Farmers Trapped In Swamp : తెలంగాణ రాష్ట్రంలో గత మూడు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు నదులు, వాగులు, వంకలు, చెరువుల్లో చేరి పొంగి పొర్లుతూ నిండుకుండను తలపిస్తున్నాయి. కొన్ని కొన్ని చోట్ల రైతులు ఇటీవలె వేసిన వరి పంటలు పూర్తిగా నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. వరద నీరు కాలనీలలో, ఇండ్లలో చేరి చెరువును తలపిస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో కుందనపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. సరిగ్గా అదే సమయానికి అక్కడికి చేరుకున్న కొంత మంది రైతులు ఆ వాగును దాటే ప్రయత్నం చేయడంతో సుమారుగా 12 మంది రైతులు నీటి ప్రవాహంలో చిక్కుకున్నారు.
కాగా స్థానికులు ఈ విషయాన్ని అధికారులకు సమచారం అందించడంతో పోలీసులు, రెస్క్యూ టీం అక్కడికి చేరుకున్నారు. వారిని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నా అవి సఫలం కాక పోవడంతో వారు ఆ వరద నీటిలోనే చిక్కుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అధికారులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి సమాచారం అందించారు. కాగా వారు అక్కడ ఉన్న పరిస్థితి గురించి ఫోన్‌లో కేటీఆర్‌కు తెలియజేశారు. కాగా ఈ విషయంపై స్పందించిన కేటీఆర్ రైతులను ఏదో ఒక విధంగా కాపాడేందుకు ప్రయత్నాలు చేయాలని తెలిపారు. అంతే కాదు వారి ప్రయత్నంలో భాగంగా హెలికాఫ్టర్ ఏర్పాటు చేస్తున్నట్లు హామీ ఇచ్చారు. మరికొద్ది సేపట్లో సంఘటనా స్థలానికి హెలికాఫ్టర్ చేరుకొని రైతులను కాపాడనున్నట్లు సమాచారం.
ఇక పోతే ఈ వర్షాలకు ఇప్పటికే పలు చోట్ల, బస్సులు, లారీలు, ద్వీచక్రవాహనాలు కొన్ని వరద నీటిలో కొట్టుకుపోయాయి. కొన్ని చోట్ల ఇండ్లలోకి వరద నీరు వచ్చి చేరడంతో అక్కడి ప్రజలు నిరాశ్రయులవుతున్నారు.