UPI: మీ యూపీఐ పేమెంట్ ఆగిపోయిందా? టెన్షన్ వద్దు.. ఏం చేయాలో తెలుసుకోండి!
UPI: ప్రపంచానికి భారత్ చూపించిన డిజిటల్ చెల్లింపుల అద్భుతం UPI.

UPI: మీ యూపీఐ పేమెంట్ ఆగిపోయిందా? టెన్షన్ వద్దు.. ఏం చేయాలో తెలుసుకోండి!
UPI: ప్రపంచానికి భారత్ చూపించిన డిజిటల్ చెల్లింపుల అద్భుతం UPI. ఒకప్పుడు దీని భవిష్యత్తు ప్రశ్నార్థకమే అయినా, ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో యూపీఐ యాప్ ఉంది. కానీ, ఈ మధ్య అదే యూపీఐ ఎందుకు పదే పదే మొరాయిస్తోంది? దుకాణానికి వెళ్లి అడిగింది తీసుకుని పేమెంట్ ఆగిపోతే గుండె ఆగినంత పనవుతోంది కదూ? గత 15 రోజుల్లో మూడుసార్లు ఇదే జరిగింది. ఇంత గొప్ప UPI ఎందుకు ఇలా అవుతోంది? ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
2016 ఏప్రిల్ 11న దేశంలో యూపీఐ పేమెంట్ సదుపాయం మొదలైనప్పుడు దీని భవిష్యత్తుపై చాలా సందేహాలు ఉండేవి. కానీ కాలక్రమేణా సామాన్యుల్లో యూపీఐ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. చాలామంది జేబులో డబ్బులు పెట్టుకోవడం కూడా మానేశారు. యూపీఐ వాడకం పెరగడానికి కరోనా మహమ్మారి, స్విగ్గి, జొమాటో, బ్లింకిట్ లాంటి తక్షణ డెలివరీ యాప్‌లు కూడా ఒక కారణం.
యూపీఐ వల్ల లావాదేవీలు చాలా సులభంగా మారినా, మీరు ఏదైనా కొన్నాక యూపీఐ పేమెంట్ ఆగిపోతే మాత్రం కొంచెం టెన్షన్ వస్తుంది. గత 15 రోజుల్లో ఇలా మూడుసార్లు జరిగింది. ఒక్కోసారి 10 నిమిషాలు, 20 నిమిషాలు కాదు.. గంటల తరబడి యూపీఐ సేవలు నిలిచిపోయాయి. ప్రపంచంలో భారత్‌కు గుర్తింపు తెచ్చిన యూపీఐ పదే పదే క్రాష్ అవ్వడంపై ఇప్పుడు ప్రశ్నలు రావడం సహజం. దాని గురించే ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
ప్రతి గంటకు రెండున్నర కోట్ల UPI లావాదేవీలు
దేశంలో యూపీఐ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క విషయం చాలు - ప్రతి గంటకు రెండున్నర కోట్ల యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. ఇది ఎంత నమ్మదగిందో అంటే దేశంలోని 90 శాతం స్మార్ట్‌ఫోన్‌లలో ఏదో ఒక యూపీఐయాప్ తప్పకుండా ఇన్‌స్టాల్ చేసి ఉంటుంది. గత 15 రోజుల్లో Paytm, GPay, PhonePe వంటి అనేక యూపీఐ యాప్‌లు క్రాష్ అయ్యాయి. ఇది ఈ సేవపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది. మళ్లీ జేబులో డబ్బులు పెట్టుకోవడం మొదలు పెట్టాలేమో అనే భయం కూడా కలుగుతోంది.
యూపీఐ సేవలు ఎందుకు డౌన్ అవుతున్నాయి?
గత 15 రోజుల్లో యూపీఐలావాదేవీలు డౌన్ కావడానికి ప్రధాన కారణం యూపీఐ లావాదేవీల సంఖ్య ఒక్కసారిగా పెరగడమే. సాధారణంగా నెలలో 160 కోట్ల వరకు యూపీఐ లావాదేవీలు జరుగుతుంటాయి. కానీ మార్చి తర్వాత ఈ సంఖ్య 180 కోట్లు దాటిపోయింది. ఎకనామిక్ టైమ్స్ ప్రకారం, IPL కారణంగా ఈ రోజుల్లో గేమింగ్ యాప్‌లలో యూపీఐ లావాదేవీలు చాలా ఎక్కువయ్యాయి. సర్వర్‌పై లోడ్ పెరగడం వల్ల సేవలు డౌన్ అవుతున్నాయి. ఉదయం 11:30 గంటల నుండి దాదాపు 3-4 గంటల వరకు సేవలు నిలిచిపోయాయి.
DownDetector ప్రకారం, సమస్యను ఎదుర్కొన్న వారిలో దాదాపు 81% మందికి చెల్లింపులు చేయడంలో, 17% మందికి నిధులు బదిలీ చేయడంలో, దాదాపు 2% మందికి కొనుగోళ్లు చేయడంలో ఇబ్బందులు తలెత్తాయి.
యూపీఐ పేమెంట్ ఆగిపోతే ఏమవుతుంది?
యూపీఐ సర్వర్ డౌన్‌లో ఉన్నప్పుడు చాలాసార్లు యూపీఐ లావాదేవీలు పెండింగ్‌లో ఉన్నట్లు చూపిస్తాయి. మీ చెల్లింపు కూడా ఇలాగే ఆగిపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ చెల్లింపు గ్రహీత ఖాతాకు వెళ్తుంది లేదా మీ బ్యాంక్ ఖాతాకు తిరిగి వస్తుంది. సాధారణంగా ఇది కొన్ని నిమిషాల్లోనే క్లియర్ అవుతుంది. ఎక్కువ సమయం తీసుకుంటే 72 గంటల వరకు పట్టవచ్చు. మీ డబ్బు ఎక్కడికీ పోదు.