AI to kill Jobs: ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయ్... బిల్‌గేట్స్, ఒబామా వార్నింగ్

AI to kill Job market: ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయ్... బిల్‌గేట్స్, ఒబామా వార్నింగ్
Barack Obama and Bill Gates about How AI impacts Jobs: ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్‌పై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సంచలన వ్యాఖ్యలు చేశారు. కృత్రిమ మేధస్సు రాక వల్ల భారీ సంఖ్యలో జనం ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. ఇంతకు ముందు 100 ఏళ్లలో ఎప్పుడూ చూడని విధంగా రాబోయే రోజుల్లో ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని అన్నారు. ఉద్యోగులను ఏఐ రీప్లేస్ చేస్తుందని బిల్‌గేట్స్, ఒబామా అభిప్రాయపడ్డారు.
ఏఐ గురించి బిల్‌గేట్స్ మాట్లాడుతూ, ఇప్పటివరకు గొప్పగొప్ప ఉద్యోగాలుగా భావిస్తున్న టీచర్, డాక్టర్ వృత్తులు కూడా ఏఐ రాకతో ఉచితం కానున్నాయని అన్నారు. ఆయా రంగాల్లోని సేవలు కృత్రిమ మేధస్సుతో ఉచితంగానే అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ రాక ఆందోళన కలిగిస్తున్నప్పటికీ వివిధ సమస్యలను పరిష్కరించడంలో, కొత్తకొత్త ఆవిష్కరణలను అందుబాటులోకి తీసుకురావడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని గేట్స్ అన్నారు.
ఒకప్పుడు కంప్యూటర్ వ్యవహారాలు ఖరీదైనవిగా ఉండేవి. కానీ ఇప్పుడు దాదాపు ఉచితం అనే స్థాయికి వచ్చేశాయి. అలాగే ప్రస్తుతం మనం అరుదుగా చూస్తోన్న మేధస్సు అనేది కూడా రాబోయే పదేళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ కారణంగా సర్వసాధారణం అవుతుందని బిల్‌గేట్స్ అభిప్రాయపడ్డారు.
బరాక్ ఒబామా మాట్లాడుతూ, ఏఐ, ఆటోమేషన్ రాకతో అన్ని రంగాల్లోని ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని అన్నారు. ఆ తరువాత మనిషి ఏం చేసి డబ్బులు సంపాదించాలో, ఎలా బతకాలో ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఏఐ, ఆటోమేషన్ గురించి ఒబామా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. రానున్న రోజుల్లో ఉపాధి అవకాశాలు ఎంత కష్టం అవుతాయనేది ఊహించుకుంటేనే వెన్నులో వణుకుపుట్టేలా ఉందని ఒబామా వ్యాఖ్యలు స్పష్టంచేస్తున్నాయి.