New Color: కొత్త కలర్‌ను గుర్తించిన సైంటిస్టులు.. పరిశోధనలో సంచలన నిజాలు!
ఎప్పుడో ఒకరోజు మనం స్క్రీన్ మీదే కాకుండా మెదడులో కూడా రంగులను సృష్టించే స్థాయికి చేరుకుంటే ఆశ్చర్యపడనక్కర్లేదు.

New Color: అమెరికాలోని పరిశోధకులు చేసిన ఒక వినూత్న ప్రయోగం ఇప్పుడు విజ్ఞాన ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. మన కళ్లతో ఇప్పటివరకు చూడని కొత్త రంగును కనిపెట్టారని వారు చెబుతున్నారు. ఇది సాధారణంగా మనకు తెలిసిన రంగులలో ఏదీ కాదు, అలాగే ప్రస్తుత టెక్నాలజీతో మన స్క్రీన్లపై చూపించలేని కలర్ కూడా.
ఈ ప్రయోగానికి ఆధారం ఏమిటంటే, మన కళ్లలోని కోన్ సెల్స్ అనే ప్రత్యేక కణాలను లేజర్ ద్వారా ఒకొక్కటిగా ఉత్తేజింపజేశారు. మనం సాధారణంగా రంగులను గుర్తించేది ఈ మూడు రకాల కణాల సహాయంతోనే – ఎరుపు, ఆకుపచ్చ, నీలం. కానీ ఈసారి శాస్త్రవేత్తలు ఒకే రకమైన సెల్‌పై మాత్రమే ఫోకస్ పెట్టారు. అదే సమయంలో, మిగిలిన రెండు కణాలను నిష్క్రియ పరచడం ద్వారా మెదడు మీద ప్రభావాన్ని పరిశీలించారు. దీంతో ఆ వ్యక్తులు చూసిన రంగు, ఇప్పుడు మనకు తెలిసిన వర్ణపటంలోని ఏ రంగునీ పోలినట్లుగా లేదు. కొందరికి ఇది బ్లూ-గ్రీన్ కలిసినట్టుగా అనిపించినా, అంత స్పష్టంగా చెప్పలేకపోయారు. దీని పేరును 'ఓలో' (Ollo) అని పెట్టారు. అయితే ఇది స్క్రీన్‌లపై చూపించగలిగే రంగు కాదు, ఎందుకంటే ఇది మెదడులో నేరుగా ఉత్పత్తి అవుతుంది. అంటే ఇది మానసిక స్థాయిలో తయారయ్యే రంగు అని చెప్పవచ్చు.
ఈ ప్రయోగంలో పాల్గొన్న ఐదుగురు వ్యక్తులకు మాత్రమే ఈ రంగు ప్రత్యక్షమైంది. ఇది చూసిన వారందరూ ఒకటే మాట చెబుతున్నారు. ఇది ఒక ప్రత్యేక అనుభూతి, కానీ దీనికి సరైన వివరణ ఇవ్వడం అసాధ్యం. ఈ రంగు గురించి కొన్ని సందేహాలూ ఉన్నాయి. కొందరు శాస్త్రవేత్తలు ఇది వాస్తవానికి కొత్త రంగు కాదని, ఇప్పటికీ మనకు తెలిసిన రంగులే కాస్త వక్రీభవించి మెదడులో కొత్తగా అనిపించడమేనని అభిప్రాయపడుతున్నారు. అంటే ఇది నిజంగా కొత్తగా కనిపించిన రంగా, లేక మన మెదడే సృష్టించిన ఒక భావనా ప్రబలతేనా అన్నది ఇంకా స్పష్టతకు రాలేదు.
అయితే ఈ ప్రయోగం ద్వారా కళ్లతో రంగులను గుర్తించే విధానం, మెదడు స్పందన, వాటి మధ్య సంభంధం పై మరింత లోతైన అవగాహన ఏర్పడుతోంది. ఈ రంగును డిజిటల్‌గా నిర్మించలేకపోవడం వల్ల ఇది మనకి తెలియని మరెన్ని రంగులు ఉండవచ్చన్న ఆసక్తికరమైన అంశానికి దారి తీస్తోంది. అంతేకాదు, రంగులపై ఆధారపడి ఉండే డిజైన్, ఆర్ట్, మానవ విజ్ఞాన, మానసిక పరిశోధనల్ని పూర్తిగా కొత్త కోణంలో ఆలోచించడానికి ఈ ప్రయోగం బలమైన ఉదాహరణగా నిలుస్తోంది. విజ్ఞాన శాస్త్రానికి ఇది ఒక అడుగు ముందుకు అని చెప్పవచ్చు. భవిష్యత్తులో మరింత మంది శాస్త్రవేత్తలు ఈ రంగును అర్థం చేసుకోవడంలో పాల్గొనబోతున్నారు. ఎప్పుడో ఒకరోజు మనం స్క్రీన్ మీదే కాకుండా మెదడులో కూడా రంగులను సృష్టించే స్థాయికి చేరుకుంటే ఆశ్చర్యపడనక్కర్లేదు. అప్పుడే ఈ 'ఓలో' రంగు నిజంగా కొత్తదేనా లేదా ఒక మానసిక మాయామాత్రమేనా అన్నది తేలనుంది.