బ్యాడ్మింటన్ కోర్టులో సంచలనాలు సృష్టించిన సైనా నెహ్వాల్, సడెన్‌గా పొలిటికల్ కోర్టులోకి ఎందుకు ఎంటరయ్యారు? రాకెట్‌తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిన స్టార్ షట్లర్, హఠాత్తుగా కాషాయ రాకెట్ ఎందుకు పట్టుకున్నారు? ఢిల్లీ అసెంబ్లీ చాంపియన్‌షిప్‌లో పతకం తెస్తుందనే ఆశతోనే, బీజేపీదళం సైనా కాషాయతీర్థం ఇచ్చిందా? సైనా పొలిటికల్ గేమ్ ఎలా ఉండబోతోంది?
భారత బ్యాడ్మింటన్ చాంపియన్, హైదరాబాద్ స్టార్ షట్లర్‌గా ఖ్యాతిపొందిన సైనా నెహ్వాల్, భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ ఆమెకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తాను హార్డ్ వర్కింగ్ పర్సన్ అన్న సైనా, హార్డ్ వర్కింగ్ వ్యక్తులంటే తనకెంతో అభిమానమని అన్నారు. దేశాభివృద్ది కోసం ప్రధాని మోడీ ఎంతో కష్టపడి పని చేస్తున్నారన్న సైనా, ఆయనతో కలిసి, పని చేసేందుకు ఉత్సాహంగా వుందన్నారు. సైనాతో పాటు ఆమె సోదరి చంద్రాన్షు నెహ్వాల్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, ఢిల్లీ ఎన్నికల సమయంలోనే, సైనా నెహ్వాల్ బీజేపీ కండువా కప్పుకోవడంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రివాల్‌ను ఢీకొట్టేందుకు చెమటోడుస్తున్న కాషాయదళం, అందుకోసం అన్ని ఆయుధాలనూ ప్రయోగిస్తోంది. క్రీడాకారులు, సెలబ్రిటీలనూ ఆకర్షిస్తోంది. అందులో భాగంగానే స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు పార్టీ తీర్థం ఇచ్చింది బీజేపీ. ఆమెతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. దేశవ్యాప్తంగా ఆమెకు ఉన్న స్టార్‌డమ్‌ను ఈ ఎన్నికల్లో వాడుకోవాలని ఆలోచిస్తోంది.
ఎన్నికలకు ముందు స్టార్ క్రీడాకారులను పార్టీలోకి చేర్చుకోవడం బీజేపీకి ఇది కొత్త కాదు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు టీమిండియా మాజీ బ్యాట్స్‌మెన్ గౌతం గంభీర్‌ను పార్టీలో చేర్చుకుంది బీజేపీ. ఆయనిప్పుడు ఢిల్లీకి బీజేపీ ఎంపీ. హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు, రెజ్లర్ యోగేశ్వర్ దత్, మరో రెజ్లర్ బబితా ఫోగట్, మాజీ హాకీ టీం కెప్టెన్ సందీప్ సింగ్‌లకు కాషాయతీర్థం ఇచ్చింది బీజేపీ. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల టైంలో సైనా నెహ్వాల్‌కు క్యాంపెయిన్ రాకెట్ ఇస్తోంది. మరి ఢిల్లీ పోల్ పోటీలో కమలానికి సైనా పతకం తెస్తుందా?