11 Bowlers: 11 మందితో బౌలింగ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి! ఆర్‌సీబీ రికార్డు బ్రేక్
ఏ కెప్టెన్ అయినా ముందుగా ప్రధాన బౌలర్లతో బౌలింగ్ చేయిస్తాడు. ఒక్కోసారి పార్ట్ టైమ్ బౌలర్లను రంగంలోకి దించుతాడు. వికెట్స్ పడని సందర్భాల్లో కొత్త బౌలర్ వైపు చూస్తాడు. ఈ క్రమంలో ఒక మ్యాచులో గరిష్టంగా 7-8 మంది బౌలింగ్ చేస్తుంటారు. కానీ ఎప్పుడూ కూడా జట్టులోని 11 మంది బౌలింగ్ చేయలేదు. కానీ అరుదైన ఘటన తాజాగా చోటుచేసుకుంది. అది కూడా మన దేశంలోనే. ఈ అరుదైన ఫీట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024లో చోటుచేసుకుంది. ఢిల్లీ జట్టు కెప్టెన్ ఆయుష్ బదోని తాను బౌలింగ్ చేయడమే కాకుండా.. జట్టులోని అందరికి బంతిని అందించాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024లో భాగంగా నేడు ఢిల్లీ, మణిపూర్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మణిపూర్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. మణిపూర్ ఇన్నింగ్స్ సందర్భంగా ఢిల్లీ జట్టులోని మొత్తం 10 మందితో కెప్టెన్ ఆయుష్ బదోని బౌలింగ్ చేయించాడు.
చివరికి వికెట్ కీపర్‌గా ఉన్న బదోని సైతం బౌలింగ్ చేశాడు. దాంతో ఢిల్లీ జట్టులోని 11 మంది బౌలింగ్ చేసినట్లయింది. దాంతో ఢిల్లీ టీమ్ టీ20 క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. టీ20 క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 11 మంది బౌలర్లతో బౌలింగ్ చేయించిన తొలి జట్టుగా ఢిల్లీ రికార్డుల్లో నిలిచింది.
టీ20ల్లో ఒకే ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు అత్యధికంగా 9 మంది బౌలింగ్ చేశారు. ఐపీఎల్‌లో దక్కన్ ఛార్జర్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్లు 9 మంది బౌలర్లను ఉపయోగించాయి. తాజాగా ఢిల్లీ ఆ రికార్డును బద్దలు కొట్టింది.
ఈ మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్ ఆయుష్ బదోని రెండు ఓవర్లు బౌలింగ్ చేసి ఓ వికెట్ పడగొట్టాడు. అతడు తన రెండవ ఓవర్ మెయిడెన్‌గా వేయడం విశేషం. హర్ష్ త్యాగీ, దిగ్వేష్, మయాంక్ రావత్ తలో మూడు ఓవర్లు వేశారు. ఆయుష్ సింగ్, అఖిల్ చౌదరి రెండేసి ఓవర్లు బౌలింగ్ చేశారు.
హిమ్మంత్ సింగ్, ఆర్యన్ రానా, ప్రియాన్ష్ ఆర్య, రావత్, యశ్ దుల్ తలో ఒక ఓవర్ బౌలింగ్ చేశారు. ఢిల్లీ బౌలర్లు తమ అద్భుత బౌలింగ్‌తో మణిపూర్‌ను కట్టడి చేశారు. మణిపూర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లను 120 రన్స్ చేసింది. ఢిల్లీకి సంబంధించి స్కోర్ కార్డ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఛేదనలో ఢిల్లీ 6 వికెట్స్ కోల్పోయి 18.3 ఓవర్లలో 124 రన్స్ చేసి గెలిచింది. ఢిల్లీ బ్యాటర్ యశ్ దుల్ (59) హాఫ్ సెంచరీ చేశాడు.