Siddarth Kaul Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా బౌలర్.. ఐపీఎల్ 2025 వేలమే కారణమా?
Siddarth Kaul Retirement: ఐపీఎల్ 2025 మెగా వేలం ముగిసిన వెంటనే సిద్దార్థ్ కౌల్ (Siddarth Kaul) రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
Siddarth Kaul Retirement: భారత ఫాస్ట్ బౌలర్ సిద్దార్థ్ కౌల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని రకాల ఫార్మాట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని సిద్దార్థ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించాడు. 34 ఏళ్ల సిద్దార్థ్.. భారత్ తరపున మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాడు. వన్డేల్లో ఒక వికెట్ తీయని అతడు.. పొట్టి ఫార్మాట్‌లో 4 వికెట్లు పడగొట్టాడు. చివరి వన్డే మ్యాచ్‌ని 2018లో ఆఫ్ఘనిస్తాన్‌పై, చివరి టీ20 మ్యాచ్ 2019లో ఆస్ట్రేలియాపై ఆడాడు. సిద్దార్థ్ అత్యుత్తమ ప్రదర్శన 2/35. విరాట్ కోహ్లీ సారథ్యంలో 2008 అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సిద్ధార్థ్ సభ్యుడు. పదేళ్ల తర్వాత 2018లో విరాట్ కెప్టెన్సీలో వన్డే, టీ20 ఫార్మాట్లలో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు.
'చిన్నప్పుడు పంజాబ్‌లోని పొలాల్లో క్రికెట్ ఆడుతున్నప్పుడు నాకు ఓ కల ఉండేది. నా దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కల కనేవాడిని. దేవుడి దయతో 2018లో నా కల నెరవేరింది. టీ20 క్యాప్ నంబర్ 75, వన్డే క్యాప్ నంబర్ 221 అందుకున్నాను. రిటైర్‌మెంట్‌కు సమయం ఆసన్నమైంది. నా కెరీర్‌లో ఎన్నో ఒడిడుకుల సమయంలో నాపై చూపిన మీ ప్రేమ, మద్దతుకు కృతజ్ఞతలు. నిత్యం నాకు అండగా నిలిచిన నా తల్లిదండ్రులు, కుటుంబం, సహచరులు, బీసీసీఐ, అభిమానులకు ధన్యవాదాలు. జీవితకాల జ్ఞాపకాలను అందించిన కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీలకు రుణపడి ఉంటా. పంజాబ్ క్రికెట్ అసోషియేషన్ అండతో క్రికెట్ ఆడాను. ఆటతో నాకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఇక రెండో ఇన్నింగ్స్ ఆరంబించాలి. మరోసారి అందరికి ధన్యవాదాలు' అని సిద్దార్థ్ కౌల్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు.
ఐపీఎల్ 2025 మెగా వేలం ముగిసిన వెంటనే సిద్దార్థ్ కౌల్ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రూ.40 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడిని ఏ ప్రాంచైజీ కొనుగోలు చేయలేదు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్‌లో 55 మ్యాచ్‌లు ఆడిన సిద్దార్థ్.. 29.98 సగటుతో 58 వికెట్స్ పడగొట్టాడు. అతని అత్యుత్తమ ప్రదర్శన 4/29. 88 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 26.77 సగటు,3.10 ఎకానమీతో 297 వికెట్లు తీశాడు. అత్యుత్తమ ప్రదర్శన 6/27. 145 టీ20 మ్యాచ్‌లలో 22.04 సగటుతో 182 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.