WTC Finals: డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం 'ఆరు' రోజుల టెస్ట్?
WTC Finals: జూన్‌లో న్యూజిలాండ్, ఇండియా జట్ల మధ్య ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే.
WTC Finals: జూన్‌లో న్యూజిలాండ్, ఇండియా జట్ల మధ్య ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ టెస్ట్ మ్యాచ్ ఆరు రోజులు జరగనున్నందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏ పోటీ అయినా.. ఫలితం ముఖ్యం. ఫలితం తేలకుంటే విజేత ఎవరనేది తేలదు. కాబట్టి.. క్రికెట్ లో ఫలితం తేలడం చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా టెస్ట్ మ్యాచ్‌లో ఫలితం తేలకుండా డ్రా చేసుకునే అవకాశం ఉంది. మరి డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఫలితం తేలకుంటే పరిస్థితి ఏంటి..? తాజాగా ఇలాంటి ఆలోచనలే ఐసీసీని వెంటాడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఫలితం తేలకుంటే ఏంటన్న సందిగ్ధం క్రికెట్ ప్రేమికుల్లో మొదలైంది. దీంతో ఐసీసీ కూడా ఇదే ఆలోచనల్లో పడినట్లు సమాచారం. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగిస్తే.. ఈ టోర్నీకి అర్థంలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇలాంటి ఆలోచనల్లోంచే పుట్టింది ఆరో రోజు ఆట. ఆరో రోజు ఆటతో కచ్చితంగా ఫలితం తేలుతుందని ఐసీసీ భావిస్తోందని టాక్ వినిపిస్తోంది. అయితే, ప్రస్తుతం డబ్ల్యూటీసీ ఫైనల్ కి ఆరో రోజు రిజర్వు డే అని ప్రకటించింది ఐసీసీ. మరి మ్యాచ్‌లో ఫలితం కోసం ఐసీసీ ఏం చేస్తుందనే ఆసక్తి అందరిలో నెలకొంది.
కాగా, టెస్టులో రోజుకు 90 ఓవర్లు ఆడిస్తారు. ఇలా ఐదు రోజులకు 450 ఓవర్లు ఆడాలి. ఒకవేళ ఆయా రోజుల్లో పరిస్థితులు అనుకూలించక పోతే.. మిగిలిన ఓవర్లను ఆరో రోజు కొనసాగించాలని ఐసీసీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మాములుగా అయితే, 5 రోజుల్లో కనీసం 30 గంటలు ఆట సాగాలి. అలా వీలు లేకుంటే 6వ రోజు ఆడించొచ్చని రూల్స్ ఉన్నట్లు సమాచారం. కాగా, ప్రస్తుతానికి ఈ ఆరు రోజుల ఆటపై సమచారం లేదు. జూన్ 1న జరిగే ఐసీసీ బోర్డు సమావేశంలో ఇదే విషయమై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే, ఒకవేళ ఆరు రోజులు ఆట ప్రవేశ పెడితే.. ఇలాంటి టోర్నీలకే పరిమితం చేస్తారా? లేదా అన్ని టెస్టు మ్యాచ్ లకు దీనిని వర్తింపజేస్తారనేది కూడా తెలియాల్సి ఉంది.
రెండేళ్ల కాలపరిమితో టెస్టు ఛాంపియన్‌షిప్ టోర్నీని ప్రవేశపెట్టింది ఐసీసీ. 2019లో మొదలైన ఈ పోరు 2021లో ముగియనుంది. ఈ కాలంలో ఎక్కువ పాయింట్లు సాధించిన రెండు జట్లు ఫైనల్ పోటీలో తలపడతాయని ఐసీసీ ప్రకటించింది. కానీ, ఆ తర్వాత రూల్స్ మార్చేసింది. సక్సెస్ రేట్ ఆధారంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధిస్తారని ప్రకటించి అందరినీ నివ్వెర పోయేలా చేసింది. ఆయా బోర్డులు ఇందేటని ప్రశ్నిస్తే.. కరోనా కారణంగా టీంలు ఎక్కువ సిరీసులు ఆడలేదని, అందుకే రూల్స్ మార్చాల్సి వచ్చిందని తేల్చేసింది ఐసీసీ.