చెన్నె వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ సారథి జోరూట్ ద్విశతకం సాధించాడు. అతడికి ఇది 100 టెస్టు కావడం మరో విశేషం. తొలి టెస్టులో శుక్రవారం 128 పరుగులు చేసిన అతడు శనివారం తొలి సెషన్‌లో 150 పరుగుల మైలురాయి చేరుకున్నాడు. అనంతరం రెండో సెషన్‌లో అశ్విన్ వేసిన 143వ ఓవర్‌లో సిక్సర్ బాది టెస్టుల్లో ఐదోసారి డబుల్ సెంచరీ సాధించాడు. కాగా, గత మూడు టెస్టుల్లో రూట్‌కిది రెండో ద్విశతకం కూడా. ఇంతకు ముందు శ్రీలంక పర్యటనలో రూట్ రెండు టెస్టుల్లో 228, 186 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా దిగ్గజం, మాజీ సారథి డాన్‌బ్రాడ్‌మన్ తర్వాత వరుసగా మూడు టెస్టుల్లో 150కి పైగా పరుగులు సాధించిన ఏకైక కెప్టెన్‌గానూ రికార్డు సృష్టించాడు. ఇక మూడో సెషన్ సమయానికి ఇంగ్లాండ్ ఆరు వికెట్లు కోల్పోయి 496 పరుగులు చేసింది.