సెంచూరియన్ టెస్ట్‌లో భారత ఆటగాళ్ల రికార్డులు.. కేఎల్ రాహుల్ నుంచి బుమ్రా వరకు.. ఎవరేం చేశారంటే?
IND vs SA 1st Test: సెంచూరియన్‌లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా 113 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది.
IND vs SA 1st Test Records: సెంచూరియన్‌లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా 113 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. దీంతో సిరీస్‌లో భారత జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు మంచి ప్రదర్శన కనబరిచి పలువురు ఆటగాళ్ల పేర్ల మీద కూడా అద్వితీయ రికార్డులు నమోదుచేసుకున్నారు. తొలి టెస్టు మ్యాచ్‌లో సాధించిన రికార్డుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. భారత కెప్టెన్ విరాట్ కోహ్లి నేతృత్వంలో 40వ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన పరంగా కోహ్లీ ప్రపంచంలోనే నాలుగో స్థానానికి చేరుకున్నాడు. గ్రేమ్ స్మిత్ (53), రికీ పాంటింగ్ (48) రెండో స్థానంలో, స్టీవ్ వా (41) మూడో స్థానంలో నిలిచారు. ఈ సిరీస్‌లో స్టీవ్ వా రికార్డును కోహ్లీ బద్దలు కొట్టగలడు.
2. వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి మ్యాచ్‌లో టెస్ట్ క్రికెట్‌లో తన 100 క్యాచ్‌లను పూర్తి చేశాడు. అతను 26 టెస్టుల్లో వికెట్ వెనుక 100 వికెట్లు తీయగా, మహేంద్ర సింగ్ ధోనీ, వృద్ధిమాన్ సాహా 36 టెస్ట్ మ్యాచ్‌ల్లో ఈ రికార్డును సాధించారు.
3. భారత స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 123 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్ ఓపెనర్‌గా విదేశీ గడ్డపై ఐదో సెంచరీ సాధించి, వీరేంద్ర సెహ్వాగ్ 4 సెంచరీల రికార్డును బద్దలు కొట్టాడు.
4. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ తొలి ఇన్నింగ్స్‌లో 117 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 11 ఏళ్ల తర్వాత దక్షిణాఫ్రికా గడ్డపై భారత ఓపెనర్ల సెంచరీ భాగస్వామ్యంగా నిలిచింది.
5. సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో మహ్మద్ షమీ మొత్తం 8 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీయడం ద్వారా టెస్టు కెరీర్‌లో 200 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. భారత్ తరఫున టెస్టు క్రికెట్‌లో 200 వికెట్లు పూర్తి చేసిన 11వ ఆటగాడిగా షమీ నిలిచాడు.
6. ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తొలి టెస్టు మ్యాచ్‌లోనే విదేశీ గడ్డపై 100 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఆశ్చర్యకరంగా బుమ్రా తన టెస్టు కెరీర్‌లో ఇప్పటి వరకు మొత్తం 106 వికెట్లు తీయగా, అందులో 100 వికెట్లు విదేశీ గడ్డపై తీయడం విశేషం.