Champions Trophy 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీపై కొనసాగుతోన్న ఉత్కంఠ.. పాకిస్థాన్‌లో జరిగేనా?

Update: 2024-11-12 11:09 GMT

Champions Trophy 2025 Venue: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ట్రోఫీకి సంబంధించిన పూర్తి షెడ్యల్‌ను విడుదల చేశారు. అయితే ఇప్పుడు ఈ ట్రోఫీకి సంబంధించి ఉత్కంఠ నెలకొంది. ఈ ట్రోపీకి పాకిస్థాన్‌ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. దీంతో పూర్తి మ్యాచులను పాక్‌లోనే షెడ్యూల్ చేశారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యంత కీలకమైన భారత జట్టు పాకిస్థాన్‌లో ఆడేందుకు సిద్ధంగా లేదు.

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టును పాకిస్థాన్‌కు పంపేందుకు బీసీసీఐ నిరాకరించిన విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య శాంతి భద్రతల సమస్యలు నెలకున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. భారత్‌ జట్టు పాకిస్థాన్‌కు వెళ్లకపోతే ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ ఫార్మాట్‌లో నిర్వహించాల్సి ఉంటుంది. భారత్‌ ఆడే మ్యాచ్‌లు పాకిస్థాన్‌ వెలుపల ఆడాల్సి ఉంటుంది. అయితే ఈ హైబ్రిడ్ మోడల్‌కు పాకిస్థాన్‌ అంగీకరించడం లేదని తెలుస్తోంది.

దీంతో ఛాంపియన్స్‌ ట్రోఫీ పాకిస్థాన్‌లోనే జరుగుతుందా? లేదా ఆతిథ్య దేశం మారుతుందా అన్న ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ తలెత్తుతోంది. ఒకవేళ టోర్నమెంట్‌ను నిర్వహించే బాధ్యతల నుంచి పాకిస్థాన్‌ తప్పుకుంటే.. వచ్చే ఏడాది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి పాకిస్థాన్‌ పేరును ఉపసంహరించుకోవచ్చు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సూచనతో డాన్ వార్తాపత్రిక ఈ విషయాన్ని నివేదించింది.

పాకిస్థాన్‌కు టీమిండియాను పంపించడానికి బీసీసీఐ నిరాకరించిన నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డ్‌ చైర్మన్‌ మొహ్సిన్ నఖ్వీ ఆదివారం సీనియర్ ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగానే పాకిస్తాన్‌కు వెళ్లడానికి భారత్‌ జట్టు అంగీకరించడం లేదన్న విషయాన్ని ధృవీకరించారు. దీంతో టోర్నీని వేరే దేశానికి మార్చాలని ఐసీసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పాకిస్థాన్‌ దీనిపై ఎలా స్పందిస్తుంది అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. తరలించినట్లయితే టోర్నమెంట్‌లో ఆడటానికి నిరాకరించాలని పిసిబికి అక్కడి ప్రభుత్వం సూచించినట్లు వార్తలు వస్తున్నాయి.

Tags:    

Similar News