Kerala man fined for obstructing Ambulance's Path: మెడికల్ ఎమర్జెన్సీలో ఉన్న పేషెంట్ ను తరలిస్తున్న అంబులెన్స్ కు పదేపదే అడ్డం వచ్చిన వ్యక్తికి కేరళ పోలీసులు తమదైన స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చారు. కేరళలో త్రిచూరు సమీపంలో నవంబర్ 7న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చలకుడి నుండి త్రిచూరు మెడికల్ కాలేజ్ వెళ్లే రహదారిలో ఒక అంబులెన్స్ వెళ్తోంది. అంబులెన్స్ కు ముందు మరో కారు వెళ్తోంది. అంబులెన్స్ డ్రైవర్ కూడా వేగంగా వెళ్లాలన్న తొందరలో ఓ వైపు సైరన్ మోగిస్తూ మరోవైపు నాన్-స్టాప్ హారన్ కొడుతూనే ఉన్నారు. అయినప్పటికీ ముందు వెళ్తున్న కారు మాత్రం పక్కకు తప్పుకోలేదు. పైగా అంబులెన్స్ తో పాటు పోటీపడుతూ వేగంగా వెళ్తోంది. పక్కకు ఆగే అవకాశం ఉన్న చోట కూడా కారు డ్రైవర్ ఆ పని చేయలేదు. ఆ కారును దాటేసి ముందుకు వెళ్లే అవకాశం లేకపోవడంతో అంబులెన్స్ డ్రైవర్ కూడా అదే పనిగా హారన్ కొడుతూ కారును ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
దాదాపు రెండు నిమిషాలకుపైనే కొనసాగిన ఈ దృశ్యం అంబులెన్స్ డ్యాష్ బోర్డు కెమెరాలో రికార్డయింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో కేరళ పోలీసుల కంటపడింది. ఇంకేం వెంటనే నెంబర్ ప్లేట్ ఆధారంగా కారు యజమాని అడ్రస్ కనుక్కున్నారు. కారు డ్రైవ్ చేసిన వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయించడంతో పాటు అంబులెన్స్ కు దారి ఇవ్వనందుకు రూ. రెండున్నర లక్షలు జరిమానా విధించినట్లుగా న్యూస్ 18 కథనం పేర్కొంది.