Organ Donation: ప్రాణాలు కాపాడుతున్న అవయవదానం.. బ్రెయిన్ డెడ్ వ్యక్తుల నుంచి అవయవాలు ఎలా సేకరిస్తారంటే..?
Organ Donation: డబ్బుంటే ఎన్ని దానాలైనా చేయొచ్చు. కానీ అవయవదానం చేయడానికి పెద్ద మనస్సుండాలి. అది అనేక మందికి కొత్త జీవితాల్ని ప్రసాదిస్తుంది. వారిపై ఆధారపడ్డ అనేక మంది జీవితాలను నిలబెడుతుంది. ఇలా ప్రత్యక్షంగా ఒక్కరినే కాకుండా పరోక్షంగా ఎన్నో జీవితాలను కాపాడుతుంది. అయితే బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల అవయవ దానంపై చాలా మందికి సందేహాలు ఉంటాయి. అవయవ దానం సమయంలో ఏం జరుగుతుంది..? దాత శరీరానికి ఎలాంటి ఆపరేషన్స్ చేస్తారు..? వంటి ప్రశ్నలు తలెత్తుతాయని.. అలాంటి ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు చూద్దాం.
అన్ని దానాల్లోకెల్లా అవయవ దానం గొప్పది అంటారు. అవయవ దానంతో ఇతరుల ప్రాణాలను రక్షించవచ్చు. సాధారణంగా మరణించిన వ్యక్తుల శరీరం నుంచి కొన్ని అవయవాలు సేకరిస్తుంటారు. వీటిని అవసరమైన వారికి అమర్చుతారు. అయితే బ్రెయిన్ డెడ్ అయిన వారి అవయవాలు కూడా దానం చేయడం అవసరం. అలాగే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో జీవించి ఉన్న వ్యక్తులు సైతం కొన్ని అవయవాలు దానం చేయవచ్చు.
బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల అవయవ దానంపై చాలా మందికి సందేహాలు ఉంటాయి. అవయవ దానం సమయంలో ఏం జరుగుతుంది. దాత శరీరానికి ఎలాంటి ఆపరేషన్స్ చేస్తారు. వంటి ప్రశ్నలకు ముంబై, జస్లోక్, రీసెర్చ్ సెంటర్, క్రిటికల్ కేర్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ పినాంక్ ప్యాండ్యా సమాధానాలు ఇచ్చారు.
ఒక వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయ్యాక అవయవ దానం ప్రాసెస్ ప్రారంభమవుతుంది. జోనల్ ట్రాన్స్‌ప్లాంట్ కోఆర్డినేషన్ సెంటర్, ఇండియన్ ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ యాక్ట్ 1994కి సంబంధించిన ప్రోటోకాల్ ప్రకారం.. వైద్యులు బ్రెయిన్ డెత్ ని నిర్ధారిస్తారు. ఆ తర్వాత వైద్య బృందం దాత అవయవాలు ఆరోగ్యంగా, ట్రాన్స్‌ప్లాంట్ కి అనుకూలంగా ఉన్నాయా..? లేదా అని పరీక్షిస్తారు. బ్లడ్ టైప్, కణజాలం అనుకూలత, వైద్య అత్యవసరాల ఆధారంగా దాత అవయవాలు రోగులకు సరిపోతాయా లేదా అనేది చెక్ చేస్తారు. ఇదంతా లీగల్ గా జరుగుతుంది. ఎవరికి అవయవాలు అమర్చుతున్నారనే విషయాలను దాత కుటుంబానికి చెప్పరు. కానీ వారు దానం చేసిన అవయవాల పనితీరు, గ్రహీత రికవరీ గురించి అప్ డేట్స్ తెలుసుకోవచ్చు.
అవయవాలు గ్రహీతలకు మ్యాచ్ అయ్యేలా ఉంటే.. వాటిని సేకరించడానికి సర్జరీ చేస్తారు. దీనికి సాధారణంగా 3-4 గంటలు పడుతుంది. అవయవాలు దెబ్బతినకుండా జాగ్రత్తగా బయటకు తీస్తారు. అవయవాన్ని తరలించే సమయంలో అవి సురక్షితంగా ఉండేందుకు స్పెషల్ ప్రిజర్వేషన్ సొల్యూషన్ లో ఉంచుతారు. ఒకే దాత వివిధ అవయవాలు, కణజాలలను దానం చేసి చాలా మంది జీవితాలను రక్షించవచ్చు. రెండు కిడ్నీల వల్ల ఇద్దరి ప్రాణాలను కాపాడవచ్చు. కాలేయాన్ని సపరేట్ చేసి ఇద్దరు గ్రహీతలకు అమర్చవచ్చు. గుండెను ఒకరికి ట్రాన్స్ ప్లాంట్ చేయవచ్చు. ఊపిరితిత్తులను ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులకు ట్రాన్స్ ప్లాంట్ చేయవచ్చు. దాత ప్యాంక్రియాస్ ఒక గ్రహీతకు సహాయం చేస్తుంది. కార్నియాలు ఇద్దరు వ్యక్తులకు చూపు ఇస్తాయి. దాత కణజాలాలు, చర్మ, ఎముకలు, స్నాయువులు కాలిన గాయాలు లేదా ఇతర వైద్య అవసరాల్లో రోగులకు సహాయపడుతాయి.
ఆర్గాన్ డొనేషన్ ప్రాసెస్ మొత్తంలో దాత శరీరాన్ని అత్యంత గౌరవంగా చూస్తారు. ఇందుకు ఇంట్రా ఆపరేటివ్ అనస్థీషియా ఉపయోగిస్తారు. అవయవాలు బయటకు తీసిన తర్వాత వాటిని జాగ్రత్తగా భద్రపరుస్తారు. దాత మృతదేహాన్ని జాగ్రత్తగా వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. బయటకు తీసిన అవయవాలను అవసరమైన వారికి అమరుస్తారు.