
TOP 6 NEWS @ 6PM: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం... తెలంగాణ హై కోర్టుకు సునీత
1) తెలంగాణలో ప్రతీ గ్రామం నుండి మండల కేంద్రానికి డబుల్ రోడ్లు - మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
తమ ప్రభుత్వంలో ప్రతీ గ్రామం నుండి మండలానికి డబుల్ రోడ్లు వేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. పంచాయతీ రాజ్ శాఖ 12 వేల కిమీ, ఆర్ అండ్ బి మరో 12 వేల కిమీ రోడ్ల నిర్మాణం చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతీ ఏడాది 4000 కిమీ మేర రోడ్ల నిర్మాణం పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఏప్రిల్ నెలలో టెండర్లు పిలిచి, మే జూన్ నాటికల్లా పనులు మొదలుపెట్టడం జరుగుతుందని అన్నారు.
ఈ రోడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం 60 శాతం, కాంట్రాక్టర్లు 40 శాతం భాగస్వామ్యంతో రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు చేసిన ప్రతిపాదనలను మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. కాంట్రాక్టర్లు ఖర్చు పెట్టిన సొమ్మును తిరిగి వారికి చెల్లించడానికి టోల్ గేట్స్ పెడతారా లేక మరే రూపంలో చెల్లిస్తారో చెప్పాల్సిందిగా ప్రభుత్వం నుండి వివరణ కోరారు. హరీశ్ రావు ప్రశ్నకు మంత్రి కోమటిరెడ్డి స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం వేసే రోడ్లకు ఎలాంటి టోల్ టాక్స్ విధించం అని చెప్పారు. కాంట్రాక్టర్లకు ఇచ్చే డబ్బులు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి వెంకట్ రెడ్డి అన్నారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
2) రోజుకు రూ. 1700 కోట్లకుపైగా అప్పులు - ఏలేటి మహేశ్వర్ రెడ్డి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జీఎస్డీపీలో కేవలం 5 లక్షల కోట్లు మాత్రమే ఉండేది. అందులోంచి 19 శాతం అప్పులు తీసుకొచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే వారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా తయారైంది. ప్రస్తుతం తెలంగాణ జీఎస్డీపీ 16 లక్షల కోట్లకు పెరిగింది. అయినప్పటికీ దానిమీద 50 శాతం అప్పులు తీసుకొచ్చే దుస్థితికి తెలంగాణ రాష్ట్రం వచ్చిందని బీజేపి శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.
తెలంగాణ బడ్జెట్ పై చర్చ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిమిషానికి కోటికిపైనే అప్పులు చేస్తోందన్నారు. రోజుకు రూ. 1700 కోట్లకుపైగా అప్పులు తీసుకొస్తోందని చెప్పారు. దీంతో ప్రస్తుతం తెలంగాణలో ఒక్కో వ్యక్తి తలపై రూ. 2.27 లక్షల అప్పు ఉందన్నారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
3) వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం... తెలంగాణ హై కోర్టుకు సునీత
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును ప్రతీ రోజు విచారణ చేపట్టేలా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఆయన కూతురు సునీత తెలంగాణ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో సీబీఐతో పాటు తన తండ్రి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న అందరి పేర్లను ప్రతివాదులుగా చేర్చారు.
2019 మార్చి 14 తన తండ్రి వైఎస్ వివేకా హత్యకు గురయ్యారని, ఇప్పటి వరకు ఈ కేసు విచారణలో ఎలాంటి పురోగతి కనిపించలేదని ఆమె కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సీబీఐ వద్ద ఉన్న హార్డ్ డిస్కులు ఓపెన్ కాని కారణంగా గత 15 నెలలుగా విచారణకు బ్రేకులు పడ్డాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఇకనైనా ఈ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చి, సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసేలా ఆదేశాలు ఇవ్వాలని సునీత కోర్టును కోరారు. సునీత పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నాలుగు వారాల్లోగా ఆరోపణలు ఎదుర్కుంటున్న నిందితులు అందరికీ వ్యక్తిగతంగా నోటీసులు ఇవ్వాల్సిందిగా సునీత తరపు న్యాయవాదికి సూచించింది. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్‌డేట్స్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
4) Banks working days: ఏప్రిల్ 1 నుండి బ్యాంకులు వారానికి 5 రోజులే పని చేస్తాయా?
PIB fact check on Banks to work 5 days a week news: ఏప్రిల్ 1 నుండి బ్యాంకులు వారానికి ఐదు రోజులే పని చేయనున్నాయా? శనివారం, ఆదివారం బ్యాంకులకు ఇకపై సెలవు దినాలేనా? ఇటీవల కాలంలో కొంతమందిని వేధిస్తోన్న ప్రశ్నలు ఇవి. సాధారణంగా మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేసే వారికి శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో వారికి ఏదైనా బ్యాంకు పనులు ఉంటే శనివారం ఆ పని చూసుకుంటుంటారు.
అయితే, ఇకపై శనివారం బ్యాంకులకు కూడా సెలవు ఉంటే తమ పరిస్థితి ఏంటని వారిలో ఒక సందేహం మొదలైంది. అది కాస్తా సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ సందేహాలకు కారణం ఇటీవల కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో కొంతమంది నెటిజెన్స్ తెలిసి తెలియక చేస్తోన్న ప్రచారమే. కానీ వాస్తవానికి అందులో నిజం లేదు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
5) ఢిల్లీ హై కోర్టు జడ్జి వర్మ ఇంట్లో భారీ మొత్తంలో నగదు... రంగంలోకి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్
ఢిల్లీ హై కోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఒక వివాదంతో వార్తల్లోకెక్కారు. ఇప్పుడు ఆ న్యాయమూర్తి పేరు మీడియాలో చర్చనియాంశమైంది. జస్టిస్ వర్మ ఇంట్లో భారీ మొత్తంలో నగదు లభించడం అనేక అనుమానాలకు తావిచ్చింది. అవినీతికి పాల్పడటం వల్లే ఆయన అంత డబ్బు సంపాదించారా అనే ఆరోపణలు వినిపించాయి. దీంతో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ఆయనను ఢిల్లీ హై కోర్టు నుండి తిరిగి అలహాబాద్ హై కోర్టుకు బదిలీ వేటు వేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
అయితే, ఇంట్లో నగదు లభించడంపై ఇప్పటివరకు జడ్జి యశ్వంత్ వర్మ స్పందించలేదు. కానీ ఈ ఘటనపై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల కొలీజియం తీవ్రంగా పరిగణించింది. ఢిల్లీ హై కోర్టు జడ్జి వర్మపై బదిలీ వేటు వేయాలని సుప్రీం కోర్టు కొలీజియం ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
6) యూఏఈలో మరణ శిక్ష ఎదుర్కుంటున్న 25 మంది భారతీయులు
యూఏఈలో వివిధ కేసుల్లో దోషులుగా తేలిన 25 మంది భారతీయులు మరణ శిక్ష ఎదుర్కొంటున్నారని కేంద్రం పార్లమెంట్‌కు తెలిపింది. అలాగే మరో 10,152 మంది భారతీయులు వివిధ దేశాల్లో జైల్లలో ఖైదీలుగా ఉన్నారని కేంద్రం చెప్పింది. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ గురువారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు బదులుగా రాతపూర్వకంగా ఈ సమాధానం ఇచ్చారు.
విదేశాల్లో శిక్షలు పడిన ఖైదీలు, విచారణ ఎదుర్కుంటున్న ఖైదీలకు తగిన రీతిలో సహాయం అందించేందుకు భారత ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. విదేశాల్లో మరణ శిక్ష ఎదుర్కుంటున్న భారతీయులు ఎంతమంది ఉన్నారు? వారికి భారత ప్రభుత్వం ఏ విధమైన న్యాయ సహాయం అందిస్తోంది అనే ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ఈ వివరణ ఇచ్చింది. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.