
ముఖ్యమంత్రి ఇఫ్తార్ విందు ఆహ్వానానికి నో చెప్పిన ముస్లిం సంఘం
Ramadan 2025: రంజాన్ మాసంలో రాజకీయ నాయకులు, ప్రభుత్వాధినేతలు ముస్లిం పెద్దలను ఆహ్వానించి ఇఫ్తార్ విందు ఇస్తుంటారు. ఇది ఎప్పటి నుండో కొనసాగుతున్న సంప్రదాయం. అందులో భాగంగానే ఈ ఆదివారం సాయంత్రం బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా ప్రభుత్వం తరపున ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఆ విందుకు పేరున్న ముస్లిం సంఘాల నాయకులను ఆహ్వానించారు.
అయితే, నితీష్ కుమార్ ఆహ్వానాన్ని ద ఇమారత్ షరియా అనే ముస్లిం సంఘం తిరస్కరించింది. ఈ ముస్లిం సంఘానికి బీహార్, జార్ఖండ్, ఒడిషా రాష్ట్రాల్లో భారీ ఫాలోయింగ్ ఉంది. మూడు రాష్ట్రాల్లో అనుచరగణం ఉన్న ముస్లిం సంస్థ కావడంతో ఈ తాజా పరిణామం చర్చనియాంశమైంది.
ముఖ్యమంత్రి ఆహ్వానాన్ని ఎందుకు కాదన్నారంటే...
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కేంద్రంలో ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నారు. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణల బిల్లుకు కూడా నితీష్ మద్దతు ఉంది.వక్ఫ్ సవరణల బిల్లు చట్టరూపం దాల్చితే చాలామంది ముస్లింలు ఆర్థికంగా చితికిపోతారని, ఇంకెంతోమంది విద్యకు దూరం అవుతారని ది ఇమారత్ షరియా ఆందోళన వ్యక్తంచేస్తోంది. తాము వ్యతిరేకిస్తోన్న బిల్లుకు నితీష్ కుమార్ మద్దతు ఇస్తుండటం వల్లే తాము ఆయన ఇస్తోన్న ఇఫ్తార్ విందు ఆహ్వానాన్ని తిరస్కరించడానికి కారణం అని ఆ ముస్లిం సంఘం అభిప్రాయపడింది.
"మైనారిటీల హక్కులు కాపాడతానని నితీష్ కుమార్ హామీ ఇచ్చారు. కానీ ముస్లింల మద్దతుతో అధికారంలోకి వచ్చిన నితీష్ కుమార్ ఇవాళ వారికే వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు" అని ఇమారత్ షరియా నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారు సీఎం నితీశ్ కుమార్ కు ఓ లేఖ రాశారు. బీజేపితో దోస్తీ చేసి కేంద్రం తీసుకొచ్చే ముస్లిం వ్యతిరేక చట్టాలకు మద్దతివ్వడం వల్ల నితీష్ కుమార్ ముస్లిం ఇచ్చిన మాట తప్పారని ఇమారత్ షరియా నేతలు తమ లేఖలో పేర్కొన్నారు.
ముస్లింలను దెబ్బ తీసే చట్టాలకు మద్దతు ఇచ్చి ముస్లింలను పిలిచి విందు ఇవ్వడంలో అర్థం లేదని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది అక్టోబర్ నెలలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో ఆ రాష్ట్రంలో బాగా పట్టున్న ముస్లిం సంఘం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమస్యను నితీష్ కుమార్ ఎలా అధిగమిస్తారనే చర్చ జరుగుతోంది.
Waqf amendments bill 2025 video Explainer: కొత్త వక్ఫ్ అమెండ్‌మెంట్ బిల్లులో ఏముంది? కొన్ని ముస్లిం సంఘాలు ఈ బిల్లును ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? అసలు వక్ఫ్ బోర్డ్ చరిత్ర ఏంటి? ఇదేం పని చేస్తుంటుంది?
More Interesting stories: మరిన్ని ఆసక్తికరమైన వార్తా కథనాలు
- ఢిల్లీ హై కోర్టు జడ్జి వర్మ ఇంట్లో రూ. 15 కోట్ల నగదు... హై కోర్టు జడ్జి తప్పు చేస్తే ఎవరు పనిష్మెంట్ ఇస్తారు?
- ఆ ఇంటి తాళం పగలగొట్టి చూస్తే 95 కిలోల బంగారం, 70 లక్షల నగదు బయటపడింది
- ఔరంగజేబ్ సమాధి కూలగొట్టాలని కొన్ని హిందూ సంఘాలు ఎందుకు డిమాండ్ చేస్తున్నాయి? 300 ఏళ్ల క్రితం చనిపోయిన మొఘల్ సామ్రాట్పై ఇప్పటికీ ఎందుకంత కోపం?
- సునీత విలియమ్స్ చిన్నప్పటి లక్ష్యం వేరు... చివరకు అయ్యింది వేరు