Delimitation: డీలిమిటేషన్ అంటే ఏంటి? ఇండియాలో ఎన్నిసార్లు డీలిమిటేషన్ జరిగింది?
Delimitation: లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే అవకాశం ఉందనే విషయమై చర్చించేందుకు డీఎంకె ఆధ్వర్యంలో శనివారం చెన్నైలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు.

Delimitation: డీలిమిటేషన్ అంటే ఏంటి? ఇండియాలో ఎన్నిసార్లు డీలిమిటేషన్ జరిగింది?
Delimitation: లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే అవకాశం ఉందనే విషయమై చర్చించేందుకు డీఎంకె ఆధ్వర్యంలో శనివారం చెన్నైలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. అసలు డీలిమిటేషన్ పై అంటే ఏంటి? ఇప్పటివరకు ఎన్నిసార్లు నియోజకవర్గాల పునర్విభజన జరిగింది? నియోజకవర్గాల పెంపు ఎందుకు నిలిచిపోయింది? ఓసారి తెలుసుకుందాం.
డీలిమిటేషన్ అంటే ఏంటి?
జనాభాకు అనుగుణంగా చట్టసభల్లో ప్రజా ప్రతినిధుల సంఖ్యను పెంచే ప్రక్రియను డీలిమిటేషన్ అంటారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 82,170 ప్రకారం తాజా జనాభా లెక్కల ఆధారంగా పార్లమెంటరీ, అసెంబ్లీ సీట్లను సవరిస్తారు. పార్లమెంట్ ఏర్పాటు చేసిన డీలిమిటేషన్ కమిషన్ ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తుంది. జనాభా ఆధారంగా లోక్‌సభ సీట్ల పెంపుదల ఉంటుంది.
భారత రాజ్యాంగం డీలిమిటేషన్ గురించి ఏం చెబుతోంది?
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 82, 170 ఆర్టికల్ ద్వారా డీలిమిటేషన్ కు సంబంధించి స్పష్టమైన గైడ్‌లైన్స్ రూపొందించారు. ఆర్టికల్ 82 లో ప్రతి జాతీయ జనాభా లెక్కల తర్వాత లోక్‌సభ నియోజకవర్గాల సరిహద్దులు, ఎంపీ సీట్ల సంఖ్య పెంపుపై పార్లమెంట్ ఒక డీలిమిటేషన్ చట్టాన్ని ఆమోదించాలి. ఆర్టికల్ 170 ప్రకారం ఇది రాష్ట్రాల శాసనసభల డీలిమిటేషన్ ను నియంత్రిస్తుంది. జనాభా డేటా ఆధారంగా ప్రతి రాష్ట్రంలో సీట్ల సంఖ్యను నిర్ణయిస్తుంది.
ఎన్నిసార్లు డీలిమిటేషన్ జరిగింది?
1952లో దేశంలో తొలిసారి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 1951 జనాభా లెక్కల ఆధారంగా 1952లో డీలిమిటేషన్ జరిగింది. 1952లో 489 ఎంపీ సీట్లతో ఎన్నికలు జరిగాయి. 1963లో మరోసారి డీలిమిటేషన్ జరిగింది. ఈ సమయంలో 489 నుంచి 522 వరకు ఎంపీ సీట్లు పెరిగింది. 1973లో 545 కు ఎంపీ సీట్లు పెరిగాయి. ఇప్పటివరకు ఎంపీ సీట్ల సంఖ్య తగ్గలేదు.1976లో 42వ చట్ట సవరణ ద్వారా డీలిమిటేషన్ ప్రక్రియను నిలిపివేశారు. జనాభా నియంత్రణను ప్రోత్సహించడం, అధిక వృద్ది రేటు ఉన్న రాష్ట్రాల ఎన్నికల ప్రయోజనం పొందకుండా నిరోధించడమే ఈ సవరణ ఉద్దేశం. 2001లో 84వ సవరణ ద్వారా 2026 వరకు దీన్ని వాయిదా వేశారు. వచ్చే ఏడాది డీలిమిటేషన్ జరుగుతాయి.2001లో కూడా డీలిమిటేషన్ నిర్వహించారు. ఈ సమయంలో నియోజకవర్గాల సరిహద్దులను పునర్విభజించారు. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలోని మొత్తం సీట్ల సంఖ్య మారలేదు.దక్షిణాది రాష్ట్రాల నుంచి వ్యతిరేకత కారణంగానే నియోజకవర్గాల పెంపు, తగ్గించలేదు.
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి నష్టమా?
కరోనా కారణంగా 2021లో జనాభా లెక్కలు నిర్వహించలేదు. 2026 నాటికి భారతదేశ జనాభా 1.42 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దక్షిణాదిలో లోక్‌సభ సీట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉందని దక్షిణాదికి చెందిన పార్టీల నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలో 28 నుంచి 36 సీట్లు, తెలంగాణలో 17 నుంచి 20, ఆంధ్రప్రదేశ్ లో 25 నుంచి 28 , తమిళనాడులో 39 నుంచి 41 సీట్లు పెరుగుతాయి. కేరళలో 20 నుంచి 19కి తగ్గే అవకాశం ఉంది. జనాభా నియంత్రించినందున దక్షిణాదిలో తక్కువ సంఖ్యలో ఎంపీ సీట్లు పెరుగుతాయి. ఉత్తర్‌ప్రదేశ్ లో 80 సీట్ల నుంచి 128కి, బీహార్ లో 40 నుంచి 70కి పెరిగే అవకాశం ఉంది. అయితే డీలిమిటేషన్ లో దక్షిణాదికి ఎలాంటి నష్టం జరగదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు.