TOP 6 NEWS @ 6PM: చెలరేగిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. IPL చరిత్రలో రెండో అత్యధిక స్కోర్

SRH vs RR match: చెలరేగిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఐపిఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్
1) రాజస్తాన్ రాయల్స్ ఎదుట భారీ లక్ష్యం
SRH vs RR match score live updates: సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు చెలరేగిపోయింది. హైదారాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపిఎల్ 2025 రెండో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాజస్తాన్ రాయల్స్ బౌలర్లకు చుక్కలు చూపించారు. స్టేడియం చుట్టూ బౌండరీలు బాదుతూ పరుగుల వరద పారించారు. దీంతో హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 286 పరుగుల భారీ స్కోర్ చేసింది.
హైదరాబాద్ జట్టు తరుపున ఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్ 47 బంతుల్లోనే 106 పరుగులతో రాణించాడు. ఇషాన్ ఐపిఎల్ కెరీర్లో ఇదే తొలి సెంచరీ. ట్రావిస్ హెడ్ కూడా 31 బంతుల్లో 67 పరుగులు (3 సిక్స్‌లు, 9 ఫోర్లు) చేసి జట్టు స్కోర్ పెరగడంలో కీలక పాత్ర పోషించాడు. నితీష్ రెడ్డి 30 పరుగులు, హెన్రి్ క్లాసిన్ 34 పరుగులు, అభిషేక్ శర్మ 24 పరుగులు చేసి స్కోర్ ను ఇంకొంత ముందుకు తీసుకెళ్లారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా అర్చర్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోగా ఓవర్ కు 20 పరుగుల చొప్పున సమర్పించుకున్నాడు.మిగతా బౌలర్లలో దేశ్ పాండే 3 వికెట్లు, తీక్షణ 2 వికెట్లు తీశారు.
2) కేటీఆర్ పర్యటనలో ప్రమాదం.. లేడీ కానిస్టేబుల్‌ను ఢీకొట్టిన బీఆర్ఎస్ కార్యకర్త
BRS Karimnagar Meeting on 27th March: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం కరీంనగర్‌లో పర్యటించారు. కేటీఆర్ రాకతో ఆయన కాన్వాయ్‌ను అనుసరిస్తూ భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు వచ్చారు. ఈ క్రమంలోనే పార్టీ కార్యకర్తల్లో ఒకరు బైక్ వేగాన్ని అదుపు చేసుకోలేక పద్మజ అనే లేడీ కానిస్టేబుల్‌ను ఢీకొట్టారు.
ఈ ప్రమాదంలో లేడీ కానిస్టేబుల్ కాలు విరిగింది. వెంటనే పార్టీ శ్రేణులు ఆమెను చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్ వెంటనే ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి ఆమె పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. పద్మజకు మెరుగైన చికిత్స అందించాల్సిందిగా కోరారు.
3) ఆడపిల్ల పుట్టిన ఇంటికి స్వీట్స్‌తో వెళ్లి సెలబ్రేట్ చేయండి.. అధికారులకు కలెక్టర్ ఆదేశాలు
IAS Muzammil Khan's initiative to save girl child: సమాజంలో ఆడపిల్లల పట్ల ఎలాంటి లింగ వివక్షత ఉండకూడదు అని కోరుకునే ప్రభుత్వాలే కాదు... అంత పెద్ద మనసున్న ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. "పుడితే కొడుకే పుట్టాలి... ఆడపిల్ల అసలే వద్దు అనే రోజుల నుండి పుడితే ఆడపిల్లే పుట్టాలి" అని కోరుకునే రోజుల్లోకి వచ్చాం. అయినప్పటికీ సమాజంలో ఇంకా ఎక్కడో ఒక చోట బంగారు తల్లులు వివక్షకు గురవుతూనే ఉన్నారు. అందుకే ఆ వివక్షతను దూరం చేసేందుకు ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ 'గళ్ ప్రైడ్' పేరుతో మరో సరికొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు.
గళ్ ప్రైడ్ లక్ష్యం ఏంటంటే... తమ జిల్లాలో ఏ కుటుంబంలో అయితే ఆడపిల్ల పుడుతుందో, స్థానిక అధికారులు ఆ ఇంటికి స్వీట్స్ తీసుకువెళ్లి వారిని అభినందించాలి. ఆడపిల్ల కూడా తక్కువేం కాదు... వారు కూడా అన్నిరంగాల్లోనూ రాణిస్తూ ఎంతో గొప్ప స్థాయిలో కొనసాగుతున్నారని వారికి అర్థమయ్యేలా చెప్పాలి. అంతేకాదు... మగపిల్లలతో సమానంగా వారిని చదివించాలి, అన్నింటా అవకాశం కల్పించాలని సూచించాలి. ఆ కుటుంబానికి స్వీట్స్ పంచి ఆ ఇంట్లో పండగ వాతావరణం తీసుకురావాలి. జిల్లా కలెక్టర్‌గా అధికారులకు ఇది ముజమ్మిల్ ఖాన్ ఆదేశం. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
4) TTD: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్..ఆ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
TTD: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్న భక్తులకు బిగ్ అలర్ట్. శ్రీవారి ఆలయంలో 25, 30వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. 25వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 30వ తేదీన ఉగాది పురస్కరించుకుని ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. దీంతో 24,29 తేదీల్లో ఎలాంటి సిఫార్సులు లేఖలు స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను ఈ నెల 23న స్వీకరించి 24వ తేదీన దర్శనానికి అనుమతించనున్నట్లు తెలిపింది.
వారంతం కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా పోటెత్తారు. శనివారం తెల్లవారుజామున 5.30గంటల సమయంలో అలిపిరి సప్తగిరి చెక్ పోస్టు వద్ద ఘాట్ రోడ్డులో వాహనాలు బారులు తీరాయి. కాలినడకన వెళ్లే భక్తులతో అలిపిరి మొదటి మెట్టు వద్ద భారీ రద్దీ నెలకొంది.
5) ముఖ్యమంత్రి ఇఫ్తార్ విందు ఆహ్వానానికి నో చెప్పిన ముస్లిం సంఘం
Ramadan 2025: రంజాన్ మాసంలో రాజకీయ నాయకులు, ప్రభుత్వాధినేతలు ముస్లిం పెద్దలను ఆహ్వానించి ఇఫ్తార్ విందు ఇస్తుంటారు. ఇది ఎప్పటి నుండో కొనసాగుతున్న సంప్రదాయం. అందులో భాగంగానే ఈ ఆదివారం సాయంత్రం బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా ప్రభుత్వం తరపున ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఆ విందుకు పేరున్న ముస్లిం సంఘాల నాయకులను ఆహ్వానించారు.
అయితే, నితీష్ కుమార్ ఆహ్వానాన్ని ద ఇమారత్ షరియా అనే ముస్లిం సంఘం తిరస్కరించింది. ఈ ముస్లిం సంఘానికి బీహార్, జార్ఖండ్, ఒడిషా రాష్ట్రాల్లో భారీ ఫాలోయింగ్ ఉంది. మూడు రాష్ట్రాల్లో అనుచరగణం ఉన్న ముస్లిం సంస్థ కావడంతో ఈ తాజా పరిణామం చర్చనియాంశమైంది. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
6) హైదరాబాద్‌లో దిగిన డేవిడ్ వార్నర్... SRH Vs RR మ్యాచ్ కోసం కాదు...
David Warner in Hyderabad: డేవిడ్ వార్నర్ హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యారు. ఇవాళే ఐపిఎల్ 2025 టోర్నమెంట్‌లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. గతంలో డేవిడ్ వార్నర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కేప్టేన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వార్నర్ హైదరాబాద్ రావడం క్రీడావర్గాల్లో, క్రీడాభిమానుల్లో ఆసక్తిని పెంచింది. అయితే, ఈసారి వార్నర్ హైదరాబాద్ రావడానికి క్రికెట్‌కు ఎలాంటి కనెక్షన్ లేదనే విషయం కూడా చాలామందికి తెలిసిందే.
ఇన్నేళ్లపాటు క్రీజులో తన పర్‌ఫార్మెన్స్ చూపించిన డేవిడ్ వార్నర్ తొలిసారిగా సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇవ్వనున్నాడు. నితిన్ హీరోగా నటించిన రాబిన్‌హుడ్ సినిమాలో వార్నర్ ఒక అతిథి పాత్రలో కనిపించనున్నాడు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.