TOP 6 NEWS @ 6PM: ఆన్‌లైన్ బెట్టింగ్, రమ్మీలపై సీఎం రేవంత్ రెడ్డి కఠిన నిర్ణయం

TOP 6 NEWS @ 6PM: ఆన్‌లైన్ బెట్టింగ్, ఆన్‌లైన్ రమ్మీలపై సీఎం రేవంత్ రెడ్డి కఠిన నిర్ణయం
1) ఆన్‌లైన్ బెట్టింగ్, రమ్మీలపై సీఎం రేవంత్ రెడ్డి కఠిన నిర్ణయం
ఆన్‌లైన్ బెట్టింగ్, ఆన్‌లైన్ రమ్మీ వంటి అంశాలపై మరిత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ఆన్‌లైన్ బెట్టింగ్, ఆన్‌లైన్ రమ్మీ వంటి వాటిని నిరోధించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఇప్పుడున్న చట్టాల స్థానంలో కొత్త చట్టాలు తీసుకొచ్చి శిక్షలు కఠినంగా పడేలా చేయనున్నట్లు చెప్పారు.
ఆన్‌లైన్ బెట్టింగ్, రమ్మీలను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలను ఇటీవల విచారించిన విషయం తెలిసిందే. అయితే కేవలం విచారణతో సరిపెట్టకుండా సిట్ వేసి కఠినమైన నిఘా పెట్టనున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు.
2) భద్రాచలంలో కుప్పకూలిన ఆరంతస్తుల భవనం:శిథిలాల కింద ఆరుగురు
భద్రాచలంలో బుధవారం ఆరంతస్తుల భవనం కుప్పకూలింది. భవనం శిథిలాల కింద ఆరుగురు ఉన్నారని సమాచారం. ఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగించి భవన శిథిలాల కింద చిక్కకున్న వారిని రక్షించేందుకు స్థానికులు, పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పాత భవనంపైనే నాలుగు అంతస్తులు నిర్మిస్తున్నారు.
నిర్మాణంలో లోపాల వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. కూలిన భవనం పక్కనే ఆలయం కూడా నిర్మిస్తున్నారు.రెండేళ్లుగా ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. అనుమతులు లేకుండా ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు.
3) తెలంగాణ అసెంబ్లీలో కూనంనేని వ్యాఖ్యలపై ఏపీ కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు రియాక్షన్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు గురించి ప్రస్తావించిన విషయం తెలిసిందే. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు ఏ ఇజాలు లేవు.. ఇప్పుడంతా టూరిజమే అనే వారు. అప్పట్లో ఆయన ఆ మాటలు అన్నప్పుడు నిజంగానే ప్రతిపక్షంలో ఉన్న మాకు కోపం వచ్చేది. కానీ నిజంగానే పెద్దగా ఖర్చు లేకుండానే అభివృద్ధి చేసుకుని, ఆదాయం సంపాదించుకునే మార్గాల్లో టూరిజం కూడా ఒకటి అని కూనంనేని అన్నారు. అయితే, తెలంగాణ అసెంబ్లీలో కూనంనేని చేసిన ఈ వ్యాఖ్యలపై ఏపీలో కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు నవ్వుతూ స్పందించారు.
కూనంనేని వ్యాఖ్యలను చంద్రబాబు గుర్తుచేసుకుంటూ ఆనాడు టూరిజం అభివృద్ధి గురించి తాను మాట్లాడితే సీపీఐ నేతలకు కోపం వచ్చేది. కానీ అది నిజం అని అర్థం చేసుకోవడానికి వారికి 30 ఏళ్లు పట్టింది అని అన్నారు. ఏపీలో టూరిజం డెవలప్ మెంట్ అంశాల గురించి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ నుండి కోనసీమ వరకు ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
4) కేటీఆర్ వ్యాఖ్యలతో తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం:భట్టి వ్యాఖ్యలపై మండిపడ్డ బీఆర్ఎస్
Telangana Assembly: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన 30 శాతం కమీషన్ వ్యాఖ్యలు తెలంగాణ అసెంబ్లీలో బుధవారం గందరగోళానికి దారితీశాయి. కేటీఆర్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో కేటీఆర్ ప్రసంగిస్తూ ఏ పని జరగాలన్నా 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నట్టు మీ నేతలే మాట్లాడుకుంటున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అధికారపార్టీ మండిపడింది.
డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు. 30 శాతం కమీషన్ ఎవరు తీసుకుంటున్నారో రుజువు చేయాలని ఆయన సవాల్ చేశారు. ఒకవేళ రుజువు చేయలేకపోతే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి పోతే బిల్లులు రాకుండా ఇబ్బందులు పడినట్టు చెప్పారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
5) ముమ్ముట్టి కోసం శబరిమలలో మోహన్ లాల్ చేసిన పూజ వివాదాస్పదం
మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ శబరిమలలో ముమ్ముట్టి కోసం పూజ చేయడం వివాదాస్పదమైంది. ముమ్ముట్టి ఒక ముస్లిం...మోహన్ లాల్ ఒక హిందు. ముస్లిం వ్యక్తి పేరు మీద హిందూ దేవాలయంలో పూజ చేయడం ఏంటని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మార్చి రెండోవారంలో ముమ్ముట్టి అస్వస్థతకు గురైనట్లు వార్తలొచ్చాయి.
ముమ్ముట్టి, మోహన్ లాల్ మధ్య సినిమా ప్రొఫెషన్ పరంగా ఎంత గట్టి పోటీ ఉంటుందో... ఆ ఇద్దరి మధ్య స్నేహ బంధం కూడా అంతే ఉంటుంది. ఇద్దరూ మంచి స్నేహితులు. అందుకే ముమ్ముట్టి అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకున్న మోహన్ లాల్ మార్చి 18న శబరిమలలో ఉష పూజలో పాల్గొన్నారు. ముమ్ముట్టి అసలు పేరు ముహమ్మెద్ కుట్టి. ఆయన జన్మ నక్షత్రం వైశాఖం. ఆ వివరాలనే మోహన్ లాల్ ఆలయంలో పూజారికి ఒక నోట్‌పై రాసిచ్చి ముహమ్మెద్ కుట్టి పేరుపై పూజ చేయించారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
6) Anti-Hamas protest: గాజాలో ఒక్కసారిగా మారిపోయిన సీన్.. హమాస్‌కు వ్యతిరేక నిరసనలు
గాజాలో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఇజ్రాయెల్‌తో హమాస్ యుద్ధం మొదలైనప్పటి నుండి దాదాపు మూన్నాలుగు దశాబ్ధాలుగా హమాస్‌కు మద్ధతుగా నిలిచిన పాలస్తినా వాసులు తాజాగా వారికి వ్యతిరేకంగా ఏకమయ్యారు. మాకు ఈ యుద్ధం వద్దు.. మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వండి అంటూ పాలస్తినా వాసులు నినాదాలు చేశారు.
హమాస్ ఉగ్రవాదులు ఇక్కడి నుండి వెళ్లిపోండి అంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసనలు చేశారు. హమాస్ నేతలు అధికారంలోకి దిగిపోండి అని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. పెద్ద సంఖ్యలో జనం రోడ్లపైకి వచ్చి నిరసనల్లో పాల్గొన్నారు. గాజాలో ఉత్తర భాగంలో ఉన్న బీట్ లహియాలో మంగళవారం ఈ ఆందోళనలు జరిగాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.