PM Modi's retirement?: సెప్టెంబర్‌లో ప్రధాని మోదీ రిటైర్మెంట్? ప్రధానిని మారుస్తున్న ఆర్ఎస్ఎస్?

PM Modi's retirement?: సెప్టెంబర్‌లో ప్రధాని మోదీ రిటైర్మెంట్ తీసుకుంటున్నారా? ఆర్ఎస్ఎస్ ప్రధాని పదవితో పాటు బీజేపి నాయకత్వంలో మార్పు కోరుకుంటోందా?
PM Modi's retirement news: ప్రధాని నరేంద్ర మోదీ రిటైర్ అవుతున్నారని ఉద్ధవ్ బాల్ థాకరే నేతృత్వంలోని శివసేన పార్టీ నేత సంజయ్ రౌత్ అన్నారు. "మోదీ సెప్టెంబర్ నెలలో రిటైర్ అవుతున్నారు. అందుకే ఆయన ఈ 10-11 ఏళ్లలో ఎన్నడూ లేనిది కొత్తగా ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. అక్కడే తన రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ను కలిసి టాటా బైబై చెప్పడానికే మోదీ అక్కడికి వెళ్లారు" అని సంజయ్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు... దేశ నాయకత్వంలో, బీజేపి నాయకత్వంలోనూ ఆర్ఎస్ఎస్ కూడా మార్పును కోరుకుంటోంది అని మరో బాంబు పేల్చారు.
ప్రధానిగా మోదీ సమయం అయిపోయిందని సంజయ్ రౌత్ అన్నారు. ఆర్ఎస్ఎస్ కూడా కేంద్రంలో, బీజేపిలో నాయకత్వ మార్పును కోరుకోవడమే అందుకు కారణంగా ఆయన చెప్పారు. మోదీ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం పర్యటన గురించి సోమవారం ముంబైలో మీడియాతో మాట్లాడుతూ సంజయ్ రౌత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అప్పుడు వాజ్‌పేయ్... ఇప్పుడు మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నాగపూర్ పర్యటనకు వచ్చారు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు కేశవ్ బలిరాం హెగ్డెవార్ జ్ఞాపకార్ధం నిర్మించిన హెగ్డెవార్ స్మృతి మందిర్‌కు వెళ్లి ఆయన విగ్రహానికి నివాళి అర్పించారు. అనంతరం ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి ఆ సంస్థ అధినేత మోహన్ భగవత్‌ను కలిసి కాసేపు ముచ్చటించారు. ఇలా ప్రధాని స్థాయిలో ఉన్న వారు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం సందర్శించడం ఇది రెండోసారి.
గతంలో 2000 సంవత్సరంలో అప్పటి ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి కూడా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు మోదీ కూడా రావడాన్ని ఆయన రిటైర్మెంట్ ప్లాన్స్‌కు ముడిపెడుతూ సంజయ్ రౌత్ ఈ వ్యాఖ్యలు చేశారు. సంజయ్ రౌత్ చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రధాని మోదీతో పాటు బీజేపి అధినాయకత్వం ఎలా స్పందిస్తుందనేదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
ఆర్ఎస్ఎస్, బీజేపి స్నేహం
ఆర్ఎస్ఎస్ బీజేపీకి అనుబంద సంస్థగా పనిచేస్తోన్న సంగతి తెలిసిందే. బీజేపిలో పెద్ద పెద్ద నాయకులుగా ఎదిగిన వారిలో చాలామంది నాయకులు ఒకప్పుడు ఆర్ఎస్ఎస్‌లో చేరి అక్కడ అంచెలంచెలుగా ఎదిగిన వారే. ముఖ్యంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపి గెలుపులో ఆర్ఎస్ఎస్ పాత్ర ఎంతో కీలక పాత్ర పోషించిందని బీజేపి నాయకులే అంగీకరించారు. అంతేకాదు... బీజేపి నాయకత్వంపై ఆర్ఎస్ఎస్ ప్రభావం ఉంటుంది అనే విమర్శలు కూడా ఉన్నాయి. తాజాగా సంజయ్ రౌత్ వ్యాఖ్యలు కూడా అందులోంచి వచ్చినవే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.