Waqf Amendment Bill passed in Lok Sabha: వక్ఫ్ అమెండ్‌మెంట్ బిల్లుకు ఆమోదం తెలిపిన లోక్ సభ
Waqf Amendment Bill passed in Lok sabha: వక్ఫ్ సవరణల బిల్లు లోక్ సభలో ఆమోదం పొందింది. మొత్తం 543 సభ్యులు ఉన్న లోక్ సభలో 288 మంది సభ్యులు వక్ఫ్ అమెండ్‌మెంట్ బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. మరో 232 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు. మెజార్టీ సభ్యులు అనుకూలంగా ఓటు వేయడంతో ఈ బిల్లును ఆమోదిస్తున్నట్లుగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.
ప్రస్తుతం అమలులో ఉన్న వక్ఫ్ బోర్డ్ చట్టంలో పలు కీలక మార్పులు తీసుకొచ్చే లక్ష్యంతో అనేక సవరణలు చేస్తూ కేంద్రం ఈ బిల్లును ప్రవేశపెట్టింది. గతేడాది ఆగస్టులోనే కేంద్రం ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పటికీ విపక్షాలు ఈ బిల్లులోని పలు సవరణలపై తీవ్ర అభ్యంతరం చెప్పాయి. కొన్ని సవరణలపై కొన్ని ముస్లిం సంఘాల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
విపక్షాల డిమాండ్‌తో కేంద్రం ఈ బిల్లుపై నివేదిక రూపొందించాల్సిందిగా ఆదేశిస్తూ జాయింట్ పార్లమెంట్ కమిటీని వేసింది. పార్లమెంట్ సభ్యులు జగదాంబిక పాల్‌ను ఈ కమిటీకి చైర్మన్‌గా అపాయింట్ చేశారు. ఈ బిల్లును అధ్యయనం చేసిన జాయింట్ పార్లమెంట్ కమిటీ గతేడాది నవంబర్‌లోనే నివేదిక అందించేందుకు సిద్ధమైంది.
అయితే, తమ అభిప్రాయాలను, అభ్యంతరాలను వినకుండానే నివేదిక ఎలా పూర్తి చేస్తారని విపక్షాలు ప్రశ్నించాయి. దీంతో అప్పట్లో కేంద్రానికి నివేదిక ఇవ్వాల్సిన పని వాయిదా పడింది. చివరకు ఈ ఏడాది జనవరి 30న జేపీసీ చైర్మన్ జగదాంబిక పాల్ లోక్ సభకు నివేదికను సమర్పించారు. అయితే, ఆ నివేదికలో తమ అభ్యంతరాలను తొలగించారని కాంగ్రెస్ అగ్రనేత మల్లికార్జున ఖర్గె, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ వంటి నాయకులు పార్లమెంట్‌లో ఆందోళనకు దిగారు. ఫిబ్రవరి నుండే పార్లమెంట్‌లో అడపాదడపా ఈ అంశంపై విపక్షాలు ఆందోళన చేస్తూనే వస్తున్నాయి.