Waqf Amendment Act: రణరంగమైన పశ్శిమ బెంగాల్... అల్లర్లలో ముగ్గురు మృతి, 150 మంది అరెస్ట్

Protests against Waqf Amendment Act: రణరంగమైన బెంగాల్... అల్లర్లలో ముగ్గురు మృతి, 150 మంది అరెస్ట్
Violence in West Bengal: పశ్చిమ బెంగాల్ రణరంగమైంది. ముర్షిదాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వక్ఫ్ అమెండ్‌మెంట్ యాక్ట్‌ను వ్యతిరేకిస్తూ ముస్లిం ఆందోళనకారులు చేపట్టిన నిరసన హింసకు దారితీసింది. ఈ విధ్వంసకాండలో ఇప్పటివరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దాంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పశ్చిమ బెంగాల్ పోలీసులు అల్లర్ల కేసులో 150 మందిని అరెస్ట్ చేశారు.
పార్లమెంట్‌లో వక్ఫ్ అమెండ్‌మెంట్ బిల్లు ఆమోదం పొందినప్పటి నుండే ముర్షిదాబాద్ జిల్లాలో ఆ బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళనలు జరుగుతున్నాయి. ఆ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొంది, చట్టరూపం దాల్చడంతో ఆ ఆందోళనలు కాస్త అల్లర్లకు దారితీశాయి. సూతి, ధులియన్, శంషేర్‌గంజ్, జంగీపూర్ ప్రాంతాల్లో అల్లర్ల ప్రభావం ఎక్కువగా కనిపించింది. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పరిస్థితి చేయి దాటి పోకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు కర్ఫ్యూ విధించారు.
ముర్షిదాబాద్‌లో ముస్లిం జనాభా ఎక్కువగా ఉంది. వక్ఫ్ అమెండ్‌మెంట్ యాక్ట్‌పై మొదటి నుండి ఇక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 8 నుండి ఈ ఆందోళనలు కాస్తా హింసాత్మకం అయ్యాయి. మొదట పోలీసులపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు పోలీసు వాహనాలకు నిప్పుపెట్టారు.
కేంద్రంపై విమర్శలు ఎక్కుపెట్టిన మమతా బెనర్జి
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జి ఈ అల్లర్లపై స్పందించారు. అల్లర్ల వెనుకున్న వారే ఈ హింసకు పాల్పడుతున్నారని మమత ఆరోపించారు. ఈ వివాదాస్పద చట్టాన్ని తీసుకొచ్చింది కేంద్రమే కానీ రాష్ట్ర ప్రభుత్వం కాదని అభిప్రాయపడ్డారు. తమ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ వివాదాస్పద చట్టానికి మద్దతు ఇవ్వడం లేదని అన్నారు.
చూస్తూ ఊరుకోలేం - పశ్చిమ బెంగాల్ హై కోర్టు
పశ్చిమ బెంగాల్‌లో అల్లర్లపై ఆ రాష్ట్ర హై కోర్టు మండిపడింది. పరిస్థితి మరీ భయంకరంగా ఉందని ఆందోళన వ్యక్తం చేసిన హై కోర్టు, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంటే మూగ సాక్షిలా చూస్తూ ఊరుకోలేం అని వ్యాఖ్యానించింది. శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొచ్చేందుకు వెంటనే కేంద్ర బలగాలను రంగంలోకి దింపాల్సిందిగా పశ్చిమ బెంగాల్ హై కోర్టు ఆదేశించింది. హై కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ముర్షిదాబాద్ జిల్లాలో శనివారం నాలుగు సెంట్రల్ ఫోర్సెస్ బలగాలను మొహరించింది. ఆదివారం మరో 5 బీఎస్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి.
హిందువులపై దాడులు చేస్తున్నారు - సువేందు అధికారి
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అయిన సువేందు అధికారి రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. మతం పేరుతో హిందువులపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. హిందువులను వారి సొంతగడ్డపైనే వేడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రాణ భయంతో హిందువులు ఇళ్ల నుండి పారిపోయేలా చేస్తున్నారని సువేందు (Suvendu Adhikari) మండిపడ్డారు. శాంతి భద్రతలను అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు
వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మమతా బెనర్జి సర్కారుకు ఈసారి ఎన్నికలు ఎదుర్కోవడం పెద్ద అగ్ని పరీక్షే కానుంది. ఇప్పటికే మూడు సార్లు ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టిన మమతా బెనర్జీ (Mamata Banerjee) ఈసారి కూడా ఎలాగైనా గెలిచి నాలుగోసారి అధికారం సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు. అయితే, ఎప్పటికప్పుడు ఓటు షేరు, బలాన్ని పెంచుకుంటూ వస్తోన్న బీజేపి ఈసారి సీఎం సీటు దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ అల్లర్లు రాజకీయంగానూ చర్చనియాంశమవుతున్నాయి.