Pahalgam Attack: వారిని నేనే ఆహ్వానించాను, కానీ... పహల్గాం దాడిపై సీఎం ఒమర్ అబ్ధుల్లా ప్రకటన
ఉగ్రవాదుల దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనను అడ్డం పెట్టుకుని రాష్ట్ర హోదా కోసం డిమాండ్ చేయలేనని ఒమర్ అబ్ధుల్లా...

Jammu and Kashmir CM Omar Abdullah speech in J&K assembly
Jammu and Kashmir CM Omar Abdullah speech in assembly: జమ్మూకశ్మీర్‌ను సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులను కాపాడుకోవడంలో తాను విఫలమయ్యానని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అద్భుల్లా ఆవేదన వ్యక్తంచేశారు. పర్యాటకులను అతిథులుగా సంబోధించిన ఆయన, చనిపోయిన వారి కుటుంబాలకు ఎలా క్షమాపణలు చెప్పాలో కూడా అర్థం కావడం లేదన్నారు. జమ్మూకశ్మీర్ పర్యటనకు రావాల్సిందిగా పర్యాటకులను తానే ఆహ్వానించానని గుర్తుచేసుకున్నారు. పర్యాటకులను సురక్షితంగా తిరిగే పంపాల్సిన బాధ్యత కూడా తమదేనని చెబుతూ ఆ పని చేయడంలో తాము విఫలమయ్యామని వ్యాఖ్యానించారు. గతంలో ఉగ్రదాడులు ఎన్నో జరిగినప్పటికీ గత 21 ఏళ్లలో పహల్గాం లాంటి ఉగ్రదాడి జరగడం మాత్రం ఇదే తొలిసారి అని అన్నారు.
పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఆ అంశంపై చర్చించేందుకు జమ్మూకశ్మీర్ అసెంబ్లీ సమావేశమైంది. అసెంబ్లీ సమావేశాల్లో సభను ఉద్దేశించి మాట్లాడుతూ సీఎం ఒమర్ అద్భుల్లా ఈ వ్యాఖ్యలు చేశారు. ఒమర్ అద్భుల్లా తమ ప్రసంగం ఆద్యంతం అనేక అంశాలను ప్రస్తావించారు.
ఇలాంటప్పుడు రాష్ట్ర హోదా అడగలేం -ఒమర్
జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఆ రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఆందోళనలు చేస్తున్నాయి. ఒమర్ అబ్ధుల్లా కూడా రాష్ట్ర హోదా సాధిస్తామనే హామీతోనే అధికారంలోకి వచ్చారు. అయితే, ఇప్పుడిలా ఉగ్రవాదుల దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనను అడ్డం పెట్టుకుని రాష్ట్ర హోదా కోసం డిమాండ్ చేయలేనని ఒమర్ అబ్ధుల్లా అన్నారు. అంతటి దేశం కష్టంలో ఉన్నప్పుడు ఏ ముఖం పెట్టుకుని కశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇవ్వాలని అడుగుతామని చెబుతూ తను అంతటి నీచ రాజకీయాలు చేయలేనని అభిప్రాయపడ్డారు.
వాళ్ల ధైర్యాన్ని ఏమని పొగడగలం...
బైసరన్ వ్యాలీలో ఉగ్ర దాడిని అడ్డుకునే క్రమంలో స్థానిక పోనీ రైడ్ ఆపరేటర్ (పర్యాటకులను గుర్రాలపై తీసుకెళ్లే కూలీ) సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా ప్రాణాలు కోల్పోయిన ఘటనను ఒమర్ అద్భుల్లా గుర్తు చేసుకున్నారు. కావాలనుకుంటే హుసేన్ షా అక్కడి నుండి పారిపోయి ప్రాణాలు కాపాడుకోవచ్చు. కానీ షా అలా చేయలేదు. తనకు ఏమీ కానీ పర్యాటకుల కోసం వారిని తమ అతిథులుగా భావించి ప్రాణాలకు తెగించి కాపాడే ప్రయత్నం చేశారు. ఈ ఉగ్రదాడి తరువాత స్థానికులు ఎంతోమంది పర్యాటకులకు తమకు తోచిన రీతిలో సాయం చేసి వారి అతిథి మర్యాదను చాటుకున్నారు. వారికి ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. కశ్మీర్ చూసేందుకు వచ్చే అతిథులకు ఇది స్థానికులు ఇచ్చే అతిథి మర్యాద అని ఒమర్ అబ్ధుల్లా పహల్గాం స్థానికులను అభినందించారు.