
3 ఊర్లలోని 5000 మందికిపైగా జనాభాకు ఒక్కటే స్కూల్... అది కూడా ఇలా!!
Paocham High School: అది 1959 లో స్థాపించిన ప్రభుత్వ పాఠశాల. ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులను ప్రొఫెసర్లుగా, ఇంజనీర్లుగా, ఉన్నత అధికారులుగా తీర్చిదిద్దిన స్కూల్ అది. 3 ఊర్లలోని 5,000 మందికిపైగా జనాభాకు ఉన్న ఒకే ఒక్క గవర్నమెంట్ స్కూల్ అది. 2009 మార్చిలో అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్ష అభియాన్ పథకం కింద 2009-10 మధ్య చివరిసారిగా ఈ పాఠశాలలో కొద్దిపాటి మరమ్మతులు చేశారు.
2015 లో వచ్చిన తుఫాన్‌కు స్కూల్ భవనాలు దెబ్బతిన్నాయి. ఆ తరువాత వాటికి మరమ్మతులు చేయపోవడంతో భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఎప్పుడు కూలి కిందపడుతుందో తెలియని పై కప్పు కింద చదువుకోవడానికి విద్యార్థులు, పిల్లలను స్కూల్‌కు పంపించడానికి తల్లిదండ్రులు భయపడే స్థాయికొచ్చింది. ఆరున్నర దశాబ్ధాల నిర్లక్ష్యం ఆ మూడు ఊర్లకు అక్షరాస్యతను దూరం చేసే స్థాయికి తీసుకొచ్చింది. వేల మంది భవిష్యత్‌ను ఇచ్చిన పాఠశాల ఇప్పుడు విద్యార్థులకు వేళ్లపై లెక్కపెట్టే స్థాయికి కుదించింది.

ఇది మణిపూర్‌లోని ఉక్రుల్ జిల్లాలోని మారుమూల ప్రాంతమైన పవోచామ్ హై స్కూల్ కథ. మణిపూర్ కథ మనకెందుకులే అని అనుకోకుండా ప్రభుత్వాలు పట్టించుకోని ఆ పాఠశాల గురించి తెలుసుకుని తీరాల్సిందే. ప్రాంతం ఏదైనా... విద్యా ప్రమాణాలను గాలికొదిలేసినట్లుగా వ్యవహరించడంలో ప్రజాప్రతినిధుల తీరు ఒక్కటేనని అనాధలా మారిన ఈ బడి పాఠం చెబుతుంది.
ఆరున్నర దశాబ్ధాల క్రితం నిర్మించిన ఈ స్కూల్ భవనం ఇప్పటికీ కట్టుకోవడానికి బట్టల్లేని నిరుపేదగా బయటికి కనిపిస్తోన్న ఇటుకల బడిగానే మిగిలిపోయింది. పేదోళ్ల గుడ్డలకు చీలికలు పడ్డట్లు ఈ స్కూల్ భవనం గోడలకు నిండా తుపాన్ మిగిల్చిన తూట్లే కనిపిస్తాయి. ఫోటోలో సరిగ్గా గమనిస్తే అవతలి వైపు గోడకు గోడ గడియారంలా వేళ్లాడుతున్న కిటికీ కనిపిస్తుంది. తలుపులే లేని విశాలమైన ద్వారాలు వద్దన్నా స్వాగతం పలుకుతున్నట్లు దర్శనమిస్తాయి.
5000 మందికిపైగా జనాభా ఉన్న ఫుంగ్‌చామ్, పౌరీ, వరంగలై అనే మూడు గ్రామాల ప్రజలకు ఇదొక్కడే పాఠశాల. ఎప్పుడు ఎటువైపు నుండి కూలుతుందో తెలియని ఈ పాఠశాలకు తమ పిల్లలను పంపివ్వలేక ఎక్కడో దూరంగా ఉన్న పాఠశాలలకు కాలినడకన పంపివ్వాల్సి వస్తోందని అక్కడి జనం వాపోతున్నారు. ఎన్నోసార్లు అధికారులకు మొరపెట్టుకున్నప్పటికీ పాఠశాలను పట్టించుకున్న నాథుడే లేరంటున్నారు.
2012 లో ఈ స్కూల్‌లో మొత్తం 28 మంది టీచర్స్ విధులు నిర్వహించే వారు. ఇప్పుడు టీచర్స్ స్ట్రెంత్ 15 కు కుచించారు. అందులోనూ హెడ్‌మిస్ట్రెస్-ఇన్-చార్జ్‌తో కలిపి ఆరుగురే విధులు నిర్వర్తిస్తున్నారు.
ప్రజల ప్రాధాన్యతలను, కనీస అవసరాలను గుర్తించకుండా ప్రభుత్వాలు ఎలా పరిపాలన చేస్తాయో అర్థం కావడం లేదని అక్కడి స్థానికులు ప్రశ్నిస్తున్నారు. శిథిలావస్థకు చేరుకుని అవస్థలు పడుతున్న ఈ స్కూల్ కథను ఉక్రుల్ టైమ్స్ వెలుగులోకి తీసుకొచ్చింది. మణిపూర్‌లో మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధికి నోచుకుని ఇలాంటి వ్యథలెన్నో ఉన్నాయని గుర్తుచేసింది. గత రెండేళ్లుగా తీవ్రమైన విధ్వంసం, హింసతో అట్టుడుతున్న మణిపూర్‌లో ఇటీవలే కేంద్రం రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే.
1956 లో మణిపూర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించారు. ఆ తరువాత 1972 లో రాష్ట్ర హోదా గుర్తింపు లభించింది. కేంద్ర హోంశాఖ 1980 నుండి 2004 వరకు మణిపూర్‌ను డిస్టర్బ్‌డ్ ఏరియాగా ప్రకటించింది. ఆ సమయంలో అక్కడ శాంతిభద్రతల కోసం మిలిటరీని రంగంలోకి దింపారు. కానీ మిలిటరీ వారే తమపై అరాచకాలకు, అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆందోళనలు ఎక్కువ అవడంతో 2004 లో మిలిటరీ ఆధిపత్యాన్ని పక్కనపెడుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.