Waqf Amendment Bill: వక్ఫ్ బిల్లును ఎందుకు అంతగా వ్యతిరేకిస్తున్నారు? బిల్లు పాస్ అవుతుందా?
Waqf Amendment Bill: వక్ఫ్ బిల్లును ఎందుకు అంతగా వ్యతిరేకిస్తున్నారు? బిల్లు పాస్ అవుతుందా?
Waqf Amendment Bill 2024: వక్ఫ్ సవరణల బిల్లును కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఇవాళ లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా లోక్ సభలో అధికార పార్టీ, ఇండియా బ్లాక్ ఎంపీల మధ్య బిల్లులో సవరణల విషయమై తీవ్ర వాగ్వీవాదం చోటుచేసుకుంది. ఇది ముస్లిం సమాజం స్వేచ్ఛను హరించడంతో పాటు వారి సంక్షేమాన్ని కూడా తొక్కిపెడుతుంది అని ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న వారు ఆరోపిస్తున్నారు. అయితే, ముస్లింల శ్రేయస్సు కోసమే వారి డిమాండ్లను పరిశీలనలోకి తీసుకునే కొత్త సవరణలు చేర్చడం జరిగిందని అధికార పార్టీ చెబుతోంది.
ఇంతకీ కొంతమంది ముస్లింలు ఈ కొత్త వక్ఫ్ సవరణల బిల్లును వ్యతిరేకించడానికి కారణం ఏంటి? వారిని బిల్లుకు వ్యతిరేకం చేసే అంశాలు ఇందులో ఏమున్నాయదే ఇప్పుడు తెలుసుకుందాం.
ఇప్పటివరకు అమలులో ఉన్న వక్ఫ్ బోర్డ్ చట్టం ప్రకారం వక్ఫ్ బోర్డులో ముస్లింలకు తప్ప ఇతర మతస్తులకు స్థానం లేదు. కానీ కొత్త చట్టం అమలులోకి వస్తే వక్ఫ్ బోర్డులో కనీసం ఇద్దరికి తగ్గకుండా ముస్లింయేతర వ్యక్తులు సభ్యులుగా ఉండేందుకు అవకాశం ఉంది. అంతేకాదు, ఇద్దరు సభ్యులు మాత్రమే కాకుండా ముస్లింయేతర వ్యక్తులను వక్ఫ్ బోర్డ్ సీఈఓగా నియమించేందుకు కొత్త చట్టం వీలు కల్పిస్తోంది. అయితే, ముస్లింల సంక్షేమం కోసం సమకూరిన ఆస్తులు, నిధిని సంరక్షించేందుకు ఏర్పడిన ముస్లిం వక్ఫ్ బోర్డులో అన్యమతస్తులకు ఎందుకు స్థానం కల్పించడం అంటే ఇది ముస్లింల హక్కులు హరించడమే అనేది వారి వాదన.
వక్ఫ్ బోర్డు చట్టం ప్రకారం ఏదైనా వక్ఫ్ భూములు, ఇతర ఆస్తులపై యాజమాన్యం హక్కుల విషయంలో ఏదైనా వివాదం తలెత్తితే, ఆ వివాదాన్ని పరిష్కరించే హక్కు వక్ఫ్ ట్రిబ్యునల్‌కు మాత్రమే ఉంది. అది వక్ఫ్ భూమినా లేదా ప్రభుత్వ భూమినా లేదా మరొకరిదా అనే విషయాన్ని ట్రిబ్యునల్ నిర్ధారిస్తోంది. కానీ కొత్త చట్టం అమలులోకి వస్తే ఇకపై ఇందులో ట్రిబ్యునల్ పాత్ర ఉండదు. సంబంధిత ప్రాపర్టీ ఏ జిల్లా పరిధిలోకి అయితే వస్తుందో, ఆ జిల్లా కలెక్టర్‌కే దాని యాజమాన్య హక్కులను నిర్ధారించే అధికారం ఉంటుంది.
ఇప్పటివరకు యాజమాన్య హక్కులతో సంబంధం లేకుండా మసీదులు, ప్రార్థన స్థలాలు ముస్లింల స్మశాన వాటికలు వంటివి వక్ఫ్ బోర్డ్ ఆస్తులుగా పరిగణిస్తున్నారు. కానీ ఈ కొత్త చట్టం అమలులోకి వస్తే, ఆ తరువాత 6 నెలల వ్యవధిలో ప్రతీ వక్ఫ్ బోర్డ్ ఆస్తిని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే సెంట్రల్ డేటాబేస్‌లో నమోదు చేయించాల్సి ఉంటుంది.
కేంద్రం తీసుకొస్తున్న కొత్త సవరణల్లో ముఖ్యంగా వీటినే కొంతమంది ముస్లింలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏదేమైనా వక్ఫ్ సవరణల బిల్లును పాస్ చేయించుకునేందుకు ఎన్డీఏ కూటమికి అవసరమైన సంఖ్య కంటే ఎక్కువ మెజారిటీనే ఉంది.
లోక్ సభలో 543 సభ్యులు ఉండగా అందులో ఎన్డీఏకు 293 మంది సభ్యుల మద్దతు ఉంది. ఇక లోక్ సభ విషయానికొస్తే... పెద్దల సభలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు, ఆరుగురు నామినేటెడ్ ఎంపీలు కలిపి మొత్తం 236 మంది ఉన్నారు. అందులో ప్రభుత్వానికి 126 మంది మద్దతు ఉంది. అందుకే వక్ఫ్ సవరణల బిల్లును పాస్ చేయించుకోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదనే భావనలో బీజేపి ఉంది.