కేరళలో ప్రియాంకా గాంధీ కాన్వాయ్‌ను అడ్డుకున్న యూట్యూబర్... కారణం ఏంటంటే...

కేరళలో ప్రియాంకా గాంధీ కాన్వాయ్‌ను అడ్డుకున్న యూట్యూబర్... కారణం ఏంటంటే...
Priyanka Gandhi Vadra's convoy blocked by youtuber in Kerala: కేరళలో తన లోక్ సభ నియోజకవర్గమైన వయనాడ్ పర్యటనకు వెళ్లిన ప్రియాంకా గాంధీ వాద్రాకు శనివారం రాత్రి ఓ చేదు అనుభవం ఎదురైంది. వందూరు, మలప్పురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ ఈవెంట్స్ లో పాల్గొన్న అనంతరం రాత్రి 9.30 గంటలకు ఆమె ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు.
ఢిల్లీకి వెళ్లెందుకని కొచ్చి ఎయిర్ పోర్టుకు వెళ్తున్న సమయంలో మన్నుతి బైపాస్ జంక్షన్ వద్ద ఉన్నట్లుండి అనీష్ అబ్రహం అనే యూట్యూబర్ తన కారును అడ్డంగా పెట్టి ఆమె కాన్వాయ్ ను అడ్డుకున్నారు.
కాన్వాయ్ ను అడ్డుకున్న అనీష్ ను ఇదేంటని ప్రశ్నించగా, పదేపదే ఎందుకు హారన్ కొడుతున్నారని ప్రియాంకా కాన్వాయ్ లోని పైలట్లను చిరాగ్గా ప్రశ్నించారు. మీరు పదేపదే హారన్ కొడుతున్నారనే చిరాకుతోనే తను ఆ పని చేశానని అన్నారు. పోలీసులతోనూ అనీష్ వాదనలకు దిగారు.
ప్రియాంకా గాంధీ వాద్రా కాన్వాయ్ లోని పైలట్స్ వచ్చి పక్కకు తప్పుకోవాల్సిందిగా చెప్పినా అనీశ్ వినిపించుకోలేదు. దీంతో పార్లమెంట్ సభ్యురాలి కాన్వాయ్ ను అడ్డుకోవడం, వారి ప్రాణాలను రిస్కులో పెట్టడంతో పాటు పోలీసుల ఆదేశాలను పాటించలేదనే అభియోగాల కింద అనీష్ ను పోలీసులు అరెస్ట్ చేసి కారు సీజ్ చేశారు. ఆ తరువాత అనీష్ ను స్టేషన్ బెయిల్ పై విడుదల చేసినట్లు మన్నుతి ఎస్ఐ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు సోమవారం మీడియాకు వెల్లడించారు.