
ప్రధాని మోదీ రిటైర్మెంట్ వార్తలపై స్పందించిన దేవేంద్ర ఫడ్నవీస్
Devendra Fadnavis reacts to PM Modi's retirement news: ప్రధాని నరేంద్ర మోదీ రిటైర్మెంట్ గురించి వస్తోన్న వార్తలపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ప్రధాని మోదీ ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో రిటైర్ అవుతున్నారని మహారాష్ట్రలో ఉద్ధవ్ బాల్ థాకరే నేతృత్వంలోని శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. సంజయ్ రౌత్ చేసిన ఈ వ్యాఖ్యలకు దేవంద్ర ఫడ్నవిస్ బదులిస్తూ కొత్త ప్రధాని కోసం వెతకాల్సిన పని లేదని అన్నారు. ఎందుకంటే, 2029 లోనూ మోదీనే ప్రధాని అవుతారని ఫడ్నవీస్ అభిప్రాయపడ్డారు.
75 ఏళ్లు పైబడిన వారు కేబినెట్‌లో కొనసాగకూడదనేది బీజేపి నియమం అని సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కూడా ఫడ్నవీస్ కౌంటర్ ఇచ్చారు. పార్టీలో అలాంటి నియమం ఏదీ లేదని స్పష్టంచేశారు. కేంద్రమంత్రిగా కొనసాగుతున్న బీహార్ నేత జితన్ రామ్ మాంఝీ 80 ఏళ్లు ఉంటారని ఫడ్నవీస్ గుర్తుచేసుకున్నారు.
ఇంతకీ సంజయ్ రౌత్ ఏమన్నారంటే...
సంజయ్ రౌత్ ముంబైలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ లో ప్రధాని మోది రిటైర్ అవుతున్నారని అన్నారు. నిన్న ఆదివారం నాగపూర్ లో ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయానికి వెళ్లి, ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ కు ఆ విషయం చెప్పడానికే మోదీ వెళ్లారని చెప్పారు. "75 ఏళ్లు దాటితే మంత్రి పదవుల్లో కొనసాగకూడదనేది బీజేపి పెట్టుకున్న అనధికారిక నియమం. ఈ ఏడాది సెప్టెంబర్ 17 తో మోదీకి 75 ఏళ్లు వస్తున్నాయి. అందుకే ఆయన తన ప్రధాని పదవి నుండి దిగిపోనున్నారు" అని సంజయ్ పేర్కొన్నారు.
కేంద్రంలో, బీజేపీ అధినాయకత్వంలో ఆర్ఎస్ఎస్ మార్పులు కోరుకుంటోందని సంజయ్ రౌత్ తెలిపారు. అందుకే సెప్టెంబర్‌లో మోదీ ప్రధాని పదవి నుండి దిగిపోతారని వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు గుడ్ బై చెప్పి రిటైర్మెంట్ దరఖాస్తు ఫారం నింపేందుకే మోదీ నాగపూర్ వచ్చారని రౌత్ వ్యాఖ్యానించారు. గత పది, పదకొండేళ్లలో ఏనాడూ ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయానికి రాని మోదీ ఇప్పుడు రావడానికి కారణం అదేనని మోదీ పర్యటనను రిటైర్మెంట్‌కు ఆపాదిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
సంజయ్ రౌత్ చేసిన ఈ వ్యాఖ్యలు మీడియాలో చర్చనియాంశమయ్యాయి. దీంతో ఆ వ్యాఖ్యలను తిప్పికొడుతూ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఈ కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడే కాదు... వచ్చే ఎన్నికల్లోనూ ఆయనే గెలిచి ప్రధాని అవుతారని ఫడ్నవీస్ స్పష్టంచేశారు. సంజయ్ రౌత్ జోష్యం చెబుతున్నట్లుగా బీజేపిలో, ఆర్ఎస్ఎస్‌లో అలాంటి ఆలోచనలు లేవనే సందేశం ఇచ్చేందుకే ఫడ్నవీస్ స్పందించినట్లుగా అర్థం అవుతోంది.