ప్రధాని మోదీకి ప్రైవేట్ సెక్రటరీగా ఐఎఫ్ఎస్ ఆఫీసర్ నిధి తివారి... ఎవరీ నిధి?

ప్రధాని మోదీకి ప్రైవేట్ సెక్రటరీగా ఐఎఫ్ఎస్ ఆఫీసర్ నిధి తివారి... ఎవరీ నిధి?
IFS officer Nidhi Tewari: ప్రధాని నరేంద్ర మోదీకి ప్రైవేట్ సెక్రటరీగా ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్ నిధి తివారి అపాయింట్ అయ్యారు. కేబినెట్ అపాయిట్మెంట్స్ కమిటీ ఆమె నియామకాన్ని ఆమోదించింది. మార్చి 29న ఆదేశాలు కూడా వెలువడ్డాయి. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం లేదా తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఆమె ప్రధానికి ప్రైవెట్ సెక్రటరీగా కొనసాగుతారు. పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT) సోమవారం ఈ వివరాలు వెల్లడించింది.
ఇంతకీ ఎవరీ నిధి తివారి?
ప్రధాని మోదీకి ప్రైవేట్ సెక్రటరీగా అపాయింట్ అవడంతో ప్రస్తుతం ఈ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ నిధి తివారి ఒక్కసారిగా న్యూస్ హెడ్‌లైన్స్‌లో నిలిచారు. ఆమె ఎవరా అని తెలుసుకోవాలనే ఆసక్తి నెటిజెన్స్‌లో కనిపిస్తోంది.
నిధి తివారి 2014 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్. ప్రధాని మోదీ 2014 నుండి పార్లమెంట్‌కు ప్రాతినిథ్యం వహిస్తోన్న వారణాసికి సమీపంలోని మహ్మూర్‌గంజ్ నిధి స్వస్థలం. 2013 లో సివిల్స్ సర్వీసెస్ ఎగ్జామ్స్‌లో ఆమె 96వ ర్యాంక్ సొంతం చేసుకున్నారు. అంతకంటే ముందే వారణాసిలో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేశారు. సివిల్స్ లక్ష్యాన్ని ఛేదించాక ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇండియన్ ఫారెన్ సర్వీస్‌లో చేరారు.
2022 లో అండర్ సెక్రటరీగా చేసిన నిధి తివారి 2023 జనవరి 6న ప్రధాన మంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా అపాయింట్ అయ్యారు. పీఎంవోలో చేరడానికి ముందు విదేశీ వ్యవహారాల శాఖ పరిధిలోని ఇంటర్నేషనల్ సెక్యురిటీ ఎఫైర్స్ డివిజన్‌లోనూ పని చేశారు.
అంతర్జాతీయ సంబంధాలను పర్యవేక్షించడంలో నిధి తివారికి మంచి నైపుణ్యం ఉంది. ఆ సమయంలో ఆమె నేరుగా నేషనల్ సెక్యురిటీ అడ్వైజర్ అజిత్ దోవల్‌కే రిపోర్ట్ చేసే వారు. ఇప్పటివరకు ప్రధాని కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా కొనసాగిన నిధి తివారి ఇకపై ప్రధాని ప్రైవేట్ సెక్రటరీగా కొత్త బాధ్యతలు అందుకోనున్నారు.