Yaas Cyclone Effect: నేడు తీరం దాటనున్న "యాస్"
Yaas Cyclone Effect: యాస్ ఒడిశాలోని భద్రతక్ జిల్లాలో ధామ్రా సమీపంలో తీరాన్ని దాటనుందని భారత వాతావరణ విభాగం తెలిపింది.
Yaas Cyclone Effect: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అతి తీవ్ర తుపాన్ యాస్ ఒడిశాలోని భద్రతక్ జిల్లాలో ధామ్రా సమీపంలో తీరాన్ని దాటనుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ)తెలిపింది. శాస్త్రవేత్తల అంచనాలకు తగ్గట్టుగానే యాస్ తుపాన్ క్రమంగా తీవ్రమై మంగళవారం సాయంత్రానికి అతి తీవ్ర తుపానుగా మారింది. దీంతో ఒడిశా, బెంగాల్ తీర ప్రాంతాలకు రెడ్ కలర్ హెచ్చరిక జారీ చేశారు. ఐఎండీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఇది ఒడిశాలోని పారాదీప్ కి 160 కి.మీ దూరంలో ఆరాష్ట్రంలో బాలాసోర్ కి 250 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది.
పశ్చిమబెంగాల్ లోని దిఘాకు 240 కి.మీ, సాగర్ ద్వీపానికి 230 కి.మీ దూరంలో వుంది. గంటకు 15 కి.మీ వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. యాస్ తుపాన్ ధామ్రా పోర్టుకు ఉత్తరంగా, బాలాసోర్ కు దక్షిణంగా ఉన్న ప్రాంతాంలో బుధవారం మధ్యాహ్నానికి తీరం దాటనుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ సమయంలో గంటకు 185 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశముందని హెచ్చరించారు. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరిక గరేశారు.
కోస్తాలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, రాయలసీమలో ఒకటిరెండు చోట్ల తేలికపాటి వానలు పడతాయని చెప్పారు. ఉత్తర కోస్తా జిల్లాల్లో బుధవారం గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో రెండో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాకినాడ, గంగవరం పోర్టులో సెక్షన్ సిగ్నల్ నంబర్–1, 2, 3తో పాటు రెండో నంబరు ప్రమాద హెచ్చరిక జారీచేయగా, కళింగపట్నం, భీమునిపట్నం, వాడరేవు పోర్టులకు అప్రమత్తత సమాచారం అందించారు.
గడిచిన 24 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. విశాఖపట్నం జిల్లా అంతటా ఆకాశం మేఘావృతమైంది. తుపాన్ కారణంగా రాజస్థాన్ నుంచి పొడిగాలులు రాష్ట్రం వైపుగా వీస్తుండటంతో ఎండలు కూడా పెరుగుతున్నాయి. మాచర్ల, చీమకుర్తి, దొనకొండలో అత్యధికంగా 42 డిగ్రీలు, అవుకు, ఒంగోలు, కలిగిరిల్లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి.