India Today Survey: మోదీ తరువాత అమిత్ షా ప్రధాని అవుతారా… ఇండియా టుడే సర్వే ఏం చెబుతోంది?
అయితే తాజాగా 2024 ఆగస్టులో నిర్వహించిన సర్వేలో అమిత్ షాకు 25 శాతం మంది మాత్రమే అనుకూలమని తేలింది.
నరేంద్ర మోదీ తర్వాత ప్రధానమంత్రి పదవికి బీజేపీలో అమిత్ షా ముందున్నారని ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే వెల్లడించింది. ఈ సర్వేలో 25 శాతం మంది ఆయనకు అనుకూలంగా ఓటు వేశారు. యోగి ఆదిత్యనాథ్, నితిన్ గడ్కరీ వంటి సీనియర్ బీజేపీ నాయకుల కంటే అమిత్ షా వైపే అత్యధికులు మొగ్గు చూపారు.
గతంలో కంటే తగ్గిన అమిత్ షా ఆదరణ
2023 ఆగస్ట్, 2024 ఫిబ్రవరి నెలల్లో నిర్వహించిన ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో అమిత్ షాకు 28 శాతం, 29 శాతం మంది ప్రజలు అనుకూలంగా ఉన్నారు. అయితే తాజాగా 2024 ఆగస్టులో నిర్వహించిన సర్వేలో అమిత్ షాకు 25 శాతం మంది మాత్రమే అనుకూలమని తేలింది.
దేశంలోని దక్షిణ ప్రాంతానికి చెందిన 31 శాతం ప్రజలు కూడా మోదీ తర్వాత బీజేపీలో అమిత్ షా వైపు మొగ్గు చూపారు. అమిత్ షా మాదిరిగానే ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు రేటింగ్ కూడా తగ్గిందని ఈ సర్వే వెల్లడించింది. ఆగస్టు 2023లో 25 శాతం, 2024 ఫిబ్రవరిలో 24 శాతం మంది యోగికి మద్దతుగా నిలిచారు. అయితే ఈ ఏడాది ఆగస్టు నాటికి యోగి మద్దతుదారుల సంఖ్య 19 శాతానికి పడిపోయింది.
మెరుగుపడిన రాజ్ నాథ్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహన్ ల రేటింగ్
గత సర్వే రిపోర్టులతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించిన సర్వేలో రాజ్ నాథ్ సింగ్, శివరాజ్ సింగ్ ల రేటింగ్ లు మెరుగయ్యాయి. రాజ్‌నాథ్ సింగ్ కు 1.2 శాతం, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు గణనీయమైన మద్దతు పెరిగింది. గతంలో ఆయనకు 2.9 శాతం మంది మద్దతుగా ఉండేవారు.
ప్రస్తుతం ఆయన మద్దతుదారుల సంఖ్య 5.4 శాతానికి పెరిగిందని ఈ సర్వే తెలిపింది. మోదీ కేబినెట్ లో ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. అంతకు ముందు నిర్వహించిన రెండు సర్వేల్లో 2023 ఆగస్టులో 2.9 శాతం, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన వైపు 2 శాతం మంది మాత్రమే మొగ్గు చూపారు. కానీ, తాజా సర్వేలో 5.4 శాతం మంది ఆయనకు ఓటేశారు.
మోదీ పనితీరుపై సర్వే ఏం చెప్పింది?
2014 నుంచి వరుసగా మూడోసారి ప్రధాని పదవి చేపట్టిన నరేంద్ర మోదీ భారత చరిత్రలో బెస్ట్ సీఎం అని ఈ సర్వేలో 51 శాతం మంది అభిప్రాయపడ్డారు. బెస్ట్ ప్రధానుల్లో ఇందిరా గాంధీ కంటే మన్మోహన్ సింగ్ కే ఎక్కువ మంది మద్దతుగా నిలిచారు. ఏబీ వాజ్ పేయ్ కి 12.1 శాతం, మన్మోహన్ సింగ్ కు 11. 6 శాతం, ఇందిరా గాంధీకి 10.4 శాతం మంది ప్రజలు మద్దతు పలికారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో మోదీ పనితీరుపై 60. 5 శాతం మంది అనుకూలంగా ఓటు చేశారు. అయితే ఆగస్టు నాటికి ఇది 58. 6 శాతానికి పడిపోయింది.
ఈ ఏడాది జూలై 15 నుంచి ఆగస్టు 10 మధ్యలో ఇండియా టుటే సర్వే నిర్వహించింది. 543 లోక్ సభ నియోజకవర్గాల్లో ఈ సర్వే చేశారు.