Maharashtra CM Race: సీఎం రేసు నుంచి ఏక్‌నాథ్ షిండే తప్పుకుంటున్నారా..? కీలక ట్వీట్..
Maharashtra CM Race: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది.
Maharashtra CM Race: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. అయితే ఇప్పటివరకు ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు మాత్రం తెర వీడలేదు. బీజేపీ నుంచే సీఎం అభ్యర్థి ఉండాలని ఆ పార్టీ అధిష్టానం అంటుండగా.. మరోవైపు బీహార్ ఫార్మూలా ప్రకారం ఏక్ నాథ్ షిండేను సీఎంగా కొనసాగించాలని శివసేన కోరుతోంది. ఈ నేపథ్యంలో సీఎం ఏక్‌నాథ్ షిండే తాజాగా ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. దీంతో ఆయన సీఎం రేసు నుంచి వైదొలుగుతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.
మంగళవారం తెల్లవారుజామున షిండే ట్వీట్ చేశారు. ఎన్నికల్లో మహాయుతి గెలవడంతో మా ప్రభుత్వం మరోసారి రాష్ట్రంలో అధికారం చేపట్టబోతోంది. మహాకూటమిగా మేము ఎన్నికల్లో కలిసి పోటీ చేశాం. ఇప్పటికీ కూడా కలిసే ఉన్నాం. నాపై ప్రేమతో కొన్ని సంఘాల వాళ్లు నన్ను కలిసేందుకు ముంబాయికి వస్తామని అడుగుతున్నారు. వారు చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు. అయితే నాకు మద్దతుగా అలా ఎవరూ రావొద్దని వేడుకుంటున్నాను. శివసేన కార్యకర్తలు సీఎం అధికారిక నివాసం వద్ద గానీ, మరెక్కడా కూడా గుమిగూడవద్దని కోరుతున్నాను. బలమైన, సుసంపన్న మహారాష్ట్ర కోసం.. మహా కూటమి బలంగా ఉంది. అలాగే కొనసాగుతుందంటూ షిండే ట్వీట్ చేశారు.
అయితే సీఎం రేసు నుంచి షిండే తప్పుకోవడం దాదాపు ఖాయమవడంతో బీజేపీ నేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పగ్గాలు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన ఢిల్లీ వెళ్లడం చర్చనీయాంశమైంది. అయితే తాను రాజకీయాల కోసం రాలేదని, వివాహ వేడుక నిమిత్తం ఢిల్లీకి వచ్చానని ఫడ్నవీస్ చెప్పారు.