Lalit Modi: దావూద్ ఇబ్రహీం భయపెట్టాడు.. అందుకే వీఐపి ఎగ్జిట్ ద్వారా.. లలిత్ మోదీ హాట్ కామెంట్స్
Lalit Modi takes Dawood Ibrahim name for his escape from india: ఐపిఎల్ సృష్టికర్త లలిత్ మోదీ 2010 లో దేశం విడిచిపెట్టి విదేశాలకు వెళ్లిపోయారు. లలిత్ మోదీ విదేశాలకు పారిపోవడం అనేది అప్పడొక సంచలనంగా మారింది. ఇప్పటికీ దేశం విడిచిపెట్టి పారిపోయిన విజయ్ మాల్యా, నిరవ్ మోదీ పేర్లు చెప్పాల్సి వస్తే.. అంతకంటే ముందుగా లలిత్ మోదీ పేరు కూడా చేర్చడం సర్వసాధారణమైపోయింది. ఇదే విషయమై తాజాగా లలిత్ మోదీ ఒక పాడ్‌కాస్ట్‌లో స్పందించారు. తాను దేశం విడిచిపెట్టి పోయింది అక్కడ న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోలేక కాదు.. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తనని చంపేస్తానని బెదిరించారన్నారు. దావూద్ భయంతోనే తాను ఇండియా విడిచిపెట్టి రావాల్సి వచ్చిందని తెలిపారు. రాజ్ షమానీ అనే ఎంటర్‌ప్రెన్యువర్ కమ్ మోటివేషనల్ స్పీకర్‌కు ఇచ్చిన పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో లలిత్ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇంతకీ దావూద్ ఇబ్రహీం ఎందుకు బెదిరించాడంటే..
దావూద్ ఇబ్రహీం తనని ఐపిఎల్ మ్యాచుల ఫిక్సింగ్ కోసం వాడుకోవాలనుకున్నాడు. తనపై తీవ్రమైన ఒత్తిళ్లు తెచ్చారు. కానీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసి అవినీతికి పాల్పడటం తనకు ఇష్టం లేదు. అందుకే దావూద్ బెదిరింపులకు తలొంచలేకే దేశం విడిచిపెట్టాల్సి వచ్చిందని లలిత్ మోదీ చెప్పుకొచ్చారు.
వీఐపి ఎగ్జిట్ ద్వారా..
పోలీసు ఉన్నతాధికారులు కూడా తన పేరు దావూద్ హిట్ లిస్టులో ఉందని చెప్పారు. కేవలం మరో 12 గంటలు మాత్రమే రక్షణ అందివ్వగలం అని అన్నారు. దాంతో ఇక దేశం నుండి వెళ్లిపోవడం తప్ప ఇంకేం చేయాలో అర్థం కాలేదు. చివరకు ఎయిర్ పోర్టులో కూడా భద్రత లేని పరిస్థితుల్లో ఎయిర్ పోర్టులో వీఐపి ఎగ్జిట్ ఉపయోగించుకుని దేశం నుండి వెళ్లిపోవాల్సిందిగా తన పర్సనల్ బాడీ గార్డ్ సూచించినట్లు లలిత్ మోదీ వెల్లడించారు. ఒకవైపు భారత్ లో ఐపిఎల్ 2025 కోసం వేలం జరుగుతున్న ప్రస్తుత సందర్భంలో అదే ఐపిఎల్ కు సృష్టికర్తగా పేరు సంపాదించుకున్న లలిత్ మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.