ఢిల్లీ హై కోర్టు జడ్జి వర్మ ఇంట్లో భారీ మొత్తంలో నగదు... రంగంలోకి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్

ఢిల్లీ హై కోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో భారీ మొత్తంలో నగదు... రంగంలోకి దిగిన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్
Delhi High court Justice Yashwant Varma news updates: ఢిల్లీ హై కోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఒక వివాదంతో వార్తల్లోకెక్కారు. ఇప్పుడు ఆ న్యాయమూర్తి పేరు మీడియాలో చర్చనియాంశమైంది. జస్టిస్ వర్మ ఇంట్లో భారీ మొత్తంలో నగదు లభించడం అనేక అనుమానాలకు తావిచ్చింది. అవినీతికి పాల్పడటం వల్లే ఆయన అంత డబ్బు సంపాదించారా అనే ఆరోపణలు వినిపించాయి. దీంతో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ఆయనను ఢిల్లీ హై కోర్టు నుండి తిరిగి అలహాబాద్ హై కోర్టుకు బదిలీ వేటు వేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
అసలు ఎవరీ జస్టిస్ యశ్వంత్ వర్మ, వివాదం ఏంటి ?
1969 లో అలహాబాద్‌లో పుట్టి పెరిగిన జస్టిస్ యశ్వంత్ వర్మ 1992 లో లా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 2006 లో అలహాబాద్ హై కోర్టులో స్పెషల్ కౌన్సెల్‌గా పనిచేశారు. అదనంగా 2012 నుండి 2013 వరకు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వానికి చీఫ్ స్టాండింగ్ కౌన్సెల్ హోదాలో కొనసాగారు. ఆ తరువాతి ఏడాదిలోనే 2014 అక్టోబర్ 13న అలహాబాద్ హై కోర్టులో అదనపు న్యాయమూర్తిగా అపాయింట్ అయ్యారు. ఆ తరువాత మరో ఏడాదిన్నరలోనే హై కోర్టు శాశ్వత న్యాయమూర్తి హోదాతో ప్రమోషన్ అందుకున్నారు.
అలహాబాద్ హై కోర్టు జడ్జిగా వ్యవహరించిన సమయంలో కార్మిక చట్టాలు, కార్పొరేట్ చట్టాలు, టాక్సేషన్ తదితర కేసులను ఎక్కువగా డీల్ చేశారు. 2021 అక్టోబర్ 11న ఢిల్లీ హై కోర్టు జడ్జిగా బదిలీ అయ్యారు. మార్చి 14న తన ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనతో ఆయన ఒక గదిలో దాచిన నగదు బయటపడటంతో ఇలా వార్తల్లోకెక్కారు. అయితే, రికవరీ చేసిన నగదు ఎంతనేది మాత్రం బయటికి రాలేదు.
ఆ రోజు ఏం జరిగింది?
హోలీ సంబరాల సమయంలో ఢిల్లీ హై కోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో ఒక అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో ఆ కుటుంబం హోలీ వెకేషన్‌లో ఉండటంతో ఇంట్లో ఎవ్వరూ లేరు. అయితే, అగ్ని ప్రమాదం జరిగిందని తెలుసుకున్న జస్టిస్ వర్మ కుటుంబం అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చి మంటలు ఆర్పే క్రమంలో ఆ ఇంట్లోని ఒక గదిలో భారీగా నగదు బయటపడింది. దీంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది ఇదే విషయమై పోలీసులకు సమాచారం అందించారు. ఇలా జడ్జి ఇంట్లో అగ్ని ప్రమాదం ఘటనతో అప్పటివరకు ఆయన ఇంట్లో దాచిపెట్టిన నగదు వ్యవహారం వెలుగులోకొచ్చింది.
అయితే, ఇంట్లో నగదు లభించడంపై ఇప్పటివరకు జడ్జి యశ్వంత్ వర్మ స్పందించలేదు. కానీ ఈ ఘటనపై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల కొలీజియం తీవ్రంగా పరిగణించింది. ఢిల్లీ హై కోర్టు జడ్జి వర్మపై బదిలీ వేటు వేయాలని సుప్రీం కోర్టు కొలీజియం ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
అదే సమయంలో వారిలోనే కొంతమంది న్యాయమూర్తులు మాత్రం బదిలీ వేటు సరిపోదని చెబుతున్నట్లు సమాచారం అందుతోంది. బదిలీతో సరిపెట్టకుండా మరింత కఠిన చర్యలు తీసుకోవాలని, లేదంటే న్యాయ వ్యవస్థపై విమర్శలు వస్తాయని అభిప్రాయపడినట్లు వార్తలొస్తున్నాయి.
ఎన్డీటీవీ కథనం ప్రకారం... కొలిజీయంలో కొంతమంది న్యాయమూర్తులు బదిలీ వేటుతో సరిపెట్టకూడదని చెబుతుండటంతో జడ్జి యశ్వంత్ వర్మను రాజీనామా చేయాల్సిందిగా కొలీజియం చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. ఒకవేళ రాజీనామా చేసేందుకు జస్టిస్ వర్మ అంగీకరించకపోయినట్లయితే... ఆయనపై చర్యలు తీసుకునేందుకు అంతర్గత విచారణకు ఆదేశించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
హై కోర్టు జడ్జిలు తప్పు చేస్తే వారిని ఎలా తొలగిస్తారు?
ఎవరైనా జడ్జిలు అవినీతికి పాల్పడినా, ఏదైనా తప్పు చేసినా, లేదంటే అక్రమాలకు పాల్పడినా... వారిపై చర్యలు తీసుకునేందుకు 1999లో సుప్రీం కోర్టు కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది.
సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఏ జడ్జిపై అయితే ఫిర్యాదు వస్తుందో, చీఫ్ జస్టిస్ ముందుగా వారి నుండి వివరణ తీసుకుంటారు.
ఒకవేళ ఆ జడ్జి ఇచ్చిన వివరణతో చీఫ్ జస్టిస్ సంతృప్తి చెందకపోయినా... లేదంటే ఈ విషయంలో మరింత లోతైన దర్యాప్తు అవసరం అని భావించిన సందర్భాల్లో ఒక అంతర్గత దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేస్తారు.
ఆ కమిటీలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఒకరు, మరో ఇద్దరు హై కోర్టుల ప్రధాన న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారు.
ఆ కమిటీ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌కు నివేదిక అందిస్తుంది. ఆ నివేదిక ప్రకారం ఆరోపణలు ఎదుర్కుంటున్న జడ్జి నిజంగానే తప్పు చేసినట్లుగా తేలితే, వారిని న్యాయమూర్తి ఉద్యోగానికి రాజీనామా చేయాల్సిందిగా చెబుతారు. కొన్ని సందర్భాల్లో చీఫ్ జస్టిస్ చెప్పినట్లుగా రాజీనామా చేసేందుకు సదరు న్యాయమూర్తి ఒప్పుకోకపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(4) ప్రకారం సదరు న్యాయమూర్తిని తొలగించాల్సిందిగా సిఫార్సు చేస్తూ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కేంద్రానికి లేఖ రాస్తారు. రాజ్యాంగం ప్రకారం దోషులుగా తేలిన న్యాయమూర్తులను తొలగించే అధికారాలు పార్లమెంట్‌కు ఉన్నాయి.
కఠినంగా వ్యవహరించాలి - రాజ్యసభ ఎంపీ, సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్
ఈ వివాదంపై రాజ్యసభ ఎంపీ, సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ స్పందించారు. "న్యాయవ్యవస్థలోన కొనసాగుతున్న వారిపై ఇలాంటి ఆరోపణలు రావడం ఇదేం తొలిసారి కాదు. గత కొన్నేళ్లుగా ఇలాంటి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి అవినీతి ఆరోపణలపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించాల్సిన అవసరం ఉంది. న్యాయమూర్తుల నియామకం విషయంలో మరింత పారదర్శకంగా జరగాలి" అని కపిల్ సిబల్ డిమాండ్ చేశారు.
More Interesting stories: మరిన్ని ఆసక్తికరమైన వార్తా కథనాలు
ఆ ఇంటి తాళం పగలగొట్టి చూస్తే 95 కిలోల బంగారం, 70 లక్షల నగదు బయటపడింది
కెనడా వచ్చి తప్పు చేశాను... పెద్ద చర్చకు దారితీసిన సోషల్ మీడియా పోస్ట్
సునీత విలియమ్స్ చిన్నప్పటి లక్ష్యం వేరు... చివరకు అయ్యింది వేరు