ఈ ఆదివారం మనదేశానికెందుకంత ముఖ్యం కాబోతుంది ?

Update: 2020-03-21 04:57 GMT
Janata Curfew

ఇప్పుడంతా జనతా కర్ఫ్యూ గురించే మాట్లాడుతున్నారు. ఆదివారం నాడు 14 గంటల పాటు ఈ కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. ఇది యావత్ దేశభవితను ప్రభావితం చేయనుంది. కరోనా వైరస్ ను కట్టడి చేయనుంది. అలాంటి జనతా కర్ఫ్యూ లో ప్రజల భాగస్వామ్యం ఎలా ఉంటుందన్నదే ఇప్పుడు కీలకంగా మారింది.

జనతా కర్ఫ్యూ...ఎవరి నోటా విన్నా ఇదే మాట. అప్పట్లో జరిగిన పెద్ద నోట్ల రద్దు తరహా చర్చ ఇప్పుడు జరుగుతోంది. బహిరంగ స్థలాల్లో జనసంచారం అధికంగా ఉంటే ఈ వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే కరోనా వైరస్ ప్రభావం తగ్గే వరకు ఇళ్ళలోనే ఉండాల్సిందిగా గత కొన్ని రోజులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తూనే ఉన్నాయి. అయినా అంతా బేఖాతరు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో స్వీయ నిర్బంధాన్ని అలవాటు చేయడంలో భాగంగా జనతా కర్ఫ్యూ ను విధించారు. ప్రస్తుతం దేశం కరోనా వైరస్ రెండో దశలోనే ఉంది. విదేశాలకు వెళ్ళివచ్చిన వారిలో మాత్రమే కరోనా వైరస్ ఉండడం మొదటి దశ. బంధుమిత్రులకు, సహోద్యోగులకు సోకడం రెండో దశ. అది గనుక మూడో దశకు అంటే యావత్ సమాజంలో ఒకరి నుంచి మరొకరికి అంటుకునే దశకు చేరుకుంటే సమాజం అతలాకుతలమవుతుంది. ఈ పరిస్థితి చేజారిపోతే అది నాలుగో దశ. ఇటలీ లాంటి దేశాలు ఇప్పుడు నాలుగో దశలో ఉన్నాయి. భారత్ లో అలా కాకుండా ఉండాలంటే ప్రజలందరికీ స్వీయ నిర్బంధం తప్పదు. ఆ దిశలో మొదటి అడుగు జనతా కర్ఫ్యూ.

పేరుకు జనతా కర్ఫ్యూ అయినప్పటికీ అసలు కర్ఫ్యూ ను మించి అమలు చేసే అవకాశం కూడా ఉంది. పోలీసులతో పాటుగా ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ తదితరాలను కూడా రంగంలోకి దించనున్నారు. ఆ రోజున దేశంలో యావత్ ప్రజారవాణా స్తంభించిపోనుంది. బహిరంగ స్థలాల్లో మాటు వేసిన వైరస్ కు ఆశ్రయం లేకుండా చేయడమే ఈ జనతా కర్ఫ్యూ ప్రధాన ఉద్దేశం. సాధారణ వాతావరణంలో ఈ వైరస్ 3 నుంచి 12 గంటల పాటు మనుగడ సాగిస్తుందని చెబుతున్నారు. అందుకే ఓ 14 గంటల పాటు నిరవధిక కర్ఫ్యూ అమలు చేయడం ద్వారా పరిస్థితిని కొంత అదుపులోకి తీసుకురావచ్చనేది ప్రభుత్వ ఉద్దేశంగా ఉంది. ఇటలీ లాంటి దేశాల్లో ఈ తరహా కర్ఫ్యూ ను ఇప్పటికే అమలు చేస్తున్నారు. పరిస్థితి విషమిస్తే భారత్ లోనూ రోజుల తరబడి కర్ఫ్యూ విధించాల్సిన పరిస్థితి రావచ్చు. అలా కాకుండా ఉండాలంటే కరోనా ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు ప్రజలంతా అండగా నిలవడం ఒక్కటే మార్గం. రాజకీయాలకు అతీతంగా పార్టీలన్నీ ఈ విషయంలో ఏకతాటిపైకి రావడం అభినందనీయం.

కరోనా వైరస్ గనుక మూడో దశకు, నాలుగో దశకు చేరుకుంటే అన్ని వ్యవస్థలూ కుప్పకూలిపోతాయి. ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ, ప్రజా రవాణా ఇలా ప్రతీది తీవ్రస్థాయిలో దెబ్బ తింటుంది. చైనాలో బలమైన ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ దేశం ఈ వైరస్ ను నియంత్రించగలిగింది. సైనికంగా, ఆర్థికంగా బలమైన దేశం కావడంతో కొద్ది రోజుల్లోనే పరిస్థితి అదుపులోకి వచ్చింది. మన దేశంలో అలాంటి పరిస్థితి లేదు. ఉన్న పళంగా కోట్లాది మందికి ఆరోగ్య వసతులు కల్పించలేం. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ స్వీయ నిర్బంధంలో ఉండాల్సిందే. వైరస్ సోకినా కూడా 14 రోజుల లోపు ఆ లక్షణాలు బయటపడని పరిస్థితి ఉంటుంది. అలా నెగెటివ్ గా వచ్చిన వారు బయట తిరుగుతూ మరికొందరికి వ్యాధి వ్యాపింపజేస్తారు. అందుకే ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. జనతా కర్ఫ్యూ బహుశా రేపటి నాడు అమలు చేసే కర్ఫ్యూలకు ప్రజలను మానసికంగా సంసిద్ధుల్ని చేసేదిగా కూడా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల్లో నిజం ఉన్నా లేకపోయినా, పరిస్థితి మాత్రం ఆ స్థాయిలో ఉందనేది మాత్రం నిజం. ప్రజల అవగాహన, చైతన్యమే దేశానికి శ్రీరామరక్ష.

కరోనా వైరస్ నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్ చాలా కీలకంగా మారింది. సోషల్ డిస్టెన్స్ పదాన్ని ఎన్నో రకాలుగా అన్వయించుకోవచ్చు. ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండడం ఒకటైతే, బయటకు వచ్చిన సందర్భాల్లో పొరుగువారితో కొంత దూరాన్ని మెయింటెయిన్ చేయడం మరొకటి. ఈ రెండూ ముఖ్యమే. ఒక్క రోజు జనతా కర్ఫ్యూతోనే పరిస్థితి మారకపోవచ్చు. అలా అని కొన్ని రోజుల పాటు వరుసగా కర్ఫ్యూ పెట్టాల్సిన పరిస్థితి కూడా తెచ్చుకోవద్దు. మన ఆరోగ్యం ఇప్పుడు మన చేతుల్లోనే ఉంది. చేతులను తరచూ శుభ్రం చేసుకుందాం కరోనా తగ్గే వరకూ ఇంట్లోనే ఉందాం.


Full View

 

Tags:    

Similar News