Bailey bridge: వయనాడ్‌లో ఇండియన్ ఆర్మీ కట్టిన 190 అడుగుల బెయిలీ బ్రిడ్జి గురించి మీకు తెలుసా
Bailey Bridge: బెయిలీ బ్రిడ్జిని 19 గంటల్లో వయనాడ్ లో భారత ఆర్మీ నిర్మించింది. కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా ఈ బ్రిడ్జిని ఉపయోగించారు.
Bailey Bridge: బెయిలీ బ్రిడ్జిని 19 గంటల్లో వయనాడ్ లో భారత ఆర్మీ నిర్మించింది. కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా ఈ బ్రిడ్జిని ఉపయోగించారు. 120 ఫీట్ల పొడవుతో నిర్మించిన ఈ వంతెనకు ఓ ఫిల్లర్ ను సపోర్ట్ గా ఉపయోగించారు. దీని నిర్మాణంలో మహిళా ఆర్మీ అధికారి సీతా ఆశోక్ షెల్కే కీలకంగా వ్యవహరించారు.
బెయిలీ బ్రిడ్జి నిర్మాణం ఎందుకు చేశారు?
వయనాడ్ జిల్లాలోని ముండక్కై, చూరల్మలైతో పాటు పరిసర గ్రామాల్లో ఈ ఏడాది జూలై 30 తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో సుమారు మూడు వందలకు పైగా మంది మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని కాపాడేందుకు ఎన్ డీ ఆర్ ఎఫ్, ఎస్ డీ ఆర్ ఎఫ్ బృందాలతో పాటు ఆర్మీ కూడా రంగంలోకి దిగింది.
అయితే ముండక్కై, చూరల్మలను కలిపేందుకు ఇరువాజింజి నదిపై నిర్మించిన బ్రిడ్జి కొట్టుకుపోయింది. ఇది సహాయక చర్యలకు ఇబ్బందిగా మారింది. దీంతో ఆర్మీ బెయిలీ బ్రిడ్జిని నిర్మించింది. 24 టన్నుల బరువును ఈ బ్రిడ్జి మోస్తుంది. బ్రిడ్జి నిర్మాణం కోసం దిల్లీ, బెంగుళూరు నుంచి 17 ట్రక్కుల్లో మెటీరియల్ తీసుకువచ్చారు.
ఈ వంతెన నిర్మాణం పూర్తైన తర్వాత కర్ణాటక కేరళ సబ్ ఏరియాకు చెందిన జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ వీటీ మాథ్యూస్ తన అధికారిక వాహనంలో వంతెనపై నుండి వెళ్లారు. ఆ తర్వాత జేసీబీలు, ఇతర వాహనాలను అనుమతించారు.
బెయిలీ బ్రిడ్జి అంటే ఏమిటి?
బెయిలీ బ్రిడ్జిని ఆర్మీ ఎక్కువగా ఉపయోగిస్తుంది. యుద్ధం చేసే సమయంలో ఆర్మీ సిబ్బందికి అవసరమైన యుద్ధ సామాగ్రిని తరలించేందుకు ఈ బ్రిడ్జిలు సహాయపడుతాయి. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటీష్ సైన్యం ఈ బ్రిడ్జిని ఉపయోగించింది.
1940లో బ్రిటిష్ సివిల్ సర్వెంట్ ఇంజనీర్ సర్ డోనాల్డ్ కోల్ మన్ బెయిలీ ఈ బ్రిడ్జిని రూపొందించారు. ఈ యుద్ధంలో ఈ బ్రిడ్జి అప్పటి సైనిక అవసరాలకు ఉపపయోగపడింది. కాలక్రమంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా ఈ బ్రిడ్జి నిర్మాణంలో మార్పులు చేశారు. బెయిలీ ఈ బ్రిడ్జికి రూపకల్పన చేసినందున ఈ బ్రిడ్జికి ఆయన పేరును పెట్టారు.
ఈ బ్రిడ్జిని ఎంత త్వరగా ఏర్పాటు చేసుకోవచ్చో అంతే త్వరగా తొలగించవచ్చు. 2017లో ముంబై ఎల్పిన్ స్టోన్ రోడ్ తొక్కిసలాట సమయంలో ఇదే తరహాలో బ్రిడ్జిని నిర్మించారు.
బెయిలీ బ్రిడ్జి నిర్మాణంలో సీతా ఆశోక్ షెల్కేదే కీలకపాత్ర
సీతా ఆశోక్ షెల్కే .. ఆర్మీ మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్ నకు చెందిన 70 మంది బృందంలో ఉన్న ఒకే ఒక్క మహిళా అధికారి. 2012 నుంచి ఆమె ఆర్మీలో పనిచేస్తున్నారు. చెన్నై ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పూర్తి చేశారు. మహారాష్ట్ర అహ్మద్ నగర్ లోని గాడిల్ గావ్ ఆమె స్వగ్రామం. బెయిలీ బ్రిడ్జి నిర్మాణంలో ఆమెదే లీడ్ రోల్.
ఈ వంతెన నిర్మాణం పూర్తయ్యే వరకు భోజనం చేయడానికి మాత్రమే ఆర్మీ సిబ్బంది వంతెన నిర్మాణ పనులను ఆపారు. మద్రాస్ సాపర్స్ గా పిలిచే ఈ ఇంజనీరింగ్ యూనిట్ సైన్యానికి మార్గం సుగమం చేయడం, వంతెనలు నిర్మించడం మందుపాతరలను నిర్వీర్యం చేయడంలో కీలకంగా వ్యవహరిస్తోంది. ఈ రెజిమెంట్ ప్రధాన కార్యాలయం బెంగుళూరులో ఉంది.
వయనాడ్ లో కొండచరియలు విరిగినపడిన ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న ఆర్మీ సిబ్బంది పలువురిని కాపాడారు. బాధితులను సహాయక శిబిరాలకు తరలించారు. తొలి 48 గంటల్లో ఆర్మీ సిబ్బంది రెస్ట్ లేకుండా పనిచేశారు.