New Criminal Laws: కొత్త క్రిమినల్ చట్టాల్లో ఏముంది... పోలీసులకు ఫుల్ పవర్స్ వచ్చాయా?
New Criminal Laws: భారతీయ న్యాయ సంహిత -2023 పేరుతో 2023 ఆగస్టు 11న బిల్లును కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రవేశ పెట్టారు. స్టాండింగ్ కమిటీ సిఫారసులను చేర్చిన తర్వాత 2023 డిసెంబర్ 12న లోక్ సభలో మళ్ళీ ప్రవేశ పెట్టారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఈ బిల్లు పాసయింది.
New Criminal Laws: భారత న్యాయ వ్యవస్థలో మూడు కొత్త క్రిమినల్ చట్టాలు 2024 జూలై 1 నుండి అమల్లోకి వచ్చాయి. ఇక నుండి ఈ మూడు కొత్త చట్టాల కిందే కేసులు నమోదు చేస్తారు. న్యూఢిల్లీలో ఈ చట్టం కింద తొలి కేసు కూడా నమోదైంది. కొత్త చట్టాలు పోలీసులకు మరిన్ని అధికారాలు దక్కుతాయని న్యాయనిపుణులు చెబుతున్నారు.
మూడు కొత్త క్రిమినల్ చట్టాలు...
భారతీయ న్యాయ సంహిత -2023 పేరుతో 2023 ఆగస్టు 11న బిల్లును కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రవేశ పెట్టారు. స్టాండింగ్ కమిటీ సిఫారసులను చేర్చిన తర్వాత 2023 డిసెంబర్ 12న లోక్ సభలో మళ్ళీ ప్రవేశ పెట్టారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఈ బిల్లు పాసయింది. ఈ బిల్లుకు 2023 డిసెంబర్ 25న రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం 2024 ఫిబ్రవరి నెలలో మూడు గెజిట్ నోటిఫికేషన్స్ విడుదల చేసింది. జూలై 1 నుంచి భారతదేశంలో మూడు క్రిమినల్ చట్టాలు అమల్లోకి వస్తాయన్నదే ఆ నోటిఫికేషన్స్ సారాంశం.
ఆ మూడు కొత్త క్రిమినల్ చట్టాలలో ఒకటి భారతీయ న్యాయ సంహిత – బీఎన్ఎస్, 2023. ఇది ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో అమల్లోకి వస్తుంది.
రెండో చట్టం పేరు.. భారతీయ నాగరిక్ సురక్ష సంహిత – బీఎన్ఎస్ఎస్, 2023. ఇప్పటివరకూ ఉన్న సీఆర్‌పీసీని రద్దు చేసి దీన్ని అమల్లోకి తీసుకువచ్చారు. మూడో చట్టం, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో వచ్చిన భారతీయ సాక్ష్య – బీఎస్, 2023.
ఈ మూడు చట్టాలు 2024 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చాయి.
వీటిలో కొన్ని కీలకమైన మార్పులున్నాయి. ముఖ్యంగా, ఈ చట్టాలు తీవ్రవాదాన్ని, అవినీతిని, వ్యవస్థీకృత నేరాలను మొదటిసారిగా క్రిమినల్ చట్టాల పరిధిలోకి తీసుకువచ్చాయి.
పోలీసు కస్టడీని 15 రోజుల నుంచి 90 రోజులకు పెంచడం వీటిలోని మరో ముఖ్యమైన మార్పు.
మూడు చట్టాలలో కీలకమైన మార్పులు...
ఇండియన్ పీనల్ కోడ్ -1860 స్థానంలో తెచ్చిన భారతీయ న్యాయ సంహిత చట్టంలో మూడు ముఖ్యమైన మార్పులేంటో చూద్దాం. ఐపీసీలో ఉన్న సెడిషన్ లేదా రాజద్రోహం చట్టాన్ని తీసేసి కొత్త చట్టంలో దేశద్రోహం – ట్రెజన్ నేరాన్ని చేర్చారు. వేర్పాటు వాదం, దేశ సార్వభౌమాధికారానికి, సమగ్రతకు వ్యతిరేకంగా చేసే తిరుగుబాటు చర్యలను ఈ చట్టంలో చేర్చారు.
అలాగే, మైనర్లపై గ్యాంగ్ రేప్ నేరానికి మరణశిక్షను అమల్లోకి తెచ్చారు. మాబ్ లించింగ్ అంటే మూక హత్యలకు పాల్పడిన వారికి కూడా మరణశిక్ష ఖరారు చేశారు.
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ -1973 చట్టాన్ని తీసేసి ఆ స్థానంలో అమల్లోకి తెస్తున్న భారతీయ నాగరిక్ సురక్ష సంహిత – 2023లోని ముఖ్యాంశాలేంటో చూద్దాం.
ముఖ్యంగా, నేర విచారణను వేగవంతం చేయడం, నిర్దిష్ట కాలంలో శిక్షలు విధించడానికి ఈ చట్టంలో నిబంధనలు పొందుపరిచారు. ఏ క్రిమినల్ కేసులోనైనా అభియోగాలు నమోదు చేయడానికి 60 గరిష్ట పరిమితి విధించిందీ కొత్త చట్టం. అలాగే, ట్రయల్ – జడ్జిమెంట్ కూడా 45 రోజుల్లోగా పూర్తి కావాలని ఈ చట్టం నిర్దేశిస్తోంది.
లైంగిక దాడికి గురైన బాధితుల వాంగ్మూలాన్ని వీడియో రికార్డ్ చేయడాన్ని కొత్త చట్టం తప్పనిసరి చేసింది.
ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ – 1872 స్థానంలో వచ్చిన భారతీయ సాక్ష్య చట్టం ప్రకారం డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కింద డిజిటల్ రికార్డ్స్, ఈమెయిల్స్, సర్వర్ లాగ్స్, ఎస్ఎంఎస్ రికార్డులు, మెయిల్స్, మెసేజిలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
అన్ని రికార్డులను డిజిటలైజ్ చేయాలని కూడా కొత్త చట్టం చెబుతోంది. దీని ప్రకారం కేస్ డైరీ, ఎఫ్,ఐ.ఆర్, చార్జిషీట్, కోర్టు తీర్పులను డిజిటల్ రూపంలో భద్రపరచాలి. పేపర్ రికార్డుల మాదిరిగానే ఎలక్ట్రానిక్ రికార్డులను కూడా చట్టబద్ధమైన సాక్ష్యాధారాలుగా గుర్తిస్తారు.
జీరో ఎఫ్ ఐ ఆర్
కొత్త చట్టంలోని జీరో ఎఫ్ ఐ ఆర్ అనే నిబంధన ఫిర్యాదుదారు ఏ పోలీసు స్టేషన్లోనైనా ఫిర్యాదు చేయడానికి అవకాశం కల్పిస్తుంది. అంటే, ఫిర్యాదుదారు తన పరిధిలోని లేదా నేరం జరిగిన ప్రాంతానికి చెందిన పోలీసు స్టేషనుకే వెళ్ళాల్సిన పని లేదు. ఏదైనా పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఫిర్యాదు చేయవచ్చు. ఆ తరువాత చట్టపరంగా ఆ కేసును విచారణకు స్వీకరిస్తారు.
మహిళలు, చిన్నారులపై జరిగిన నేరాలను 2 నెలల్లో పూర్తి చేయాలని చట్టం చెబుతుంది. 90 రోజుల వరకు పోలీసులకు రిమాండ్ కోరే అవకాశం ఈ చట్టాలు కల్పిస్తున్నాయి. ఆర్ధిక భద్రతకు ముప్పు కలిగించే నేరాలను ఉగ్రవాద చట్టం కిందకు తీసుకు వచ్చారు.
అంతేకాదు, ఈ కొత్త చట్టాల ద్వారా పోలీసులకు ఆన్ లైన్లో కూడా ఫిర్యాదులు చేయవచ్చు. పేపర్ వర్క తగ్గించడానికి సమ్మన్లు కూడా ఎలక్ట్రానిక్ పద్ధతిలో పంపించవచ్చని కొత్త చట్టం చెబుతోంది.
జీవిత ఖైదు ఎలాంటి కేసుల్లో పడుతుంది?
కులం, భాష లేదా వ్యక్తిగత గుర్తింపు కోసం ఐదుగురు లేక అంతకంటే ఎక్కువ మందిని హత్య చేస్తే నిందితులకు జీవితఖైదు లేదా మరణ శిక్ష పడుతుందని కొత్త చట్టాలు చెబుతున్నాయి. ఒక వర్గంపై దాడుల్లో ఎవరైనా మరణిస్తే అందుకు కారణమైన వారికి జీవితఖైదు లేదా మరణశిక్ష విధిస్తారు. ఒకరి మరణానికి కారణమైతే రూ. 10 లక్షల వరకు జరిమానాతో పాటు మరణశిక్ష లేదా జీవితఖైదు విధించనున్నట్టుగా కొత్త చట్టంలో మార్పులు తెచ్చారు. రేప్, లైంగిక వేధింపులకు సంబంధించి గతంలో ఐపీసీ చట్టంలోని ఏ రకమైన నిబంధనలు ఉన్నాయో వాటినే కొనసాగించారు.
పోలీసులకు అపరిమిత అధికారాలు?
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన మూడు క్రిమినల్ చట్టాలతో పోలీసులకు అపరిమిత అధికారాలు లభిస్తాయని కొందరు న్యాయ నిపుణులు అంటున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి డిఫెన్స్ చేసుకొనేందుకు అవకాశం తక్కువగా ఉందన్నది వారి ఆందోళన. అంతేకాదు, ప్రాథమిక హక్కులకు కూడా ఈ చట్టాలతో నష్టం జరిగే అవకాశం ఉందని శంకరయ్య అనే న్యాయవాది చెప్పారు. గతంలో ఉన్న రాజద్రోహం చట్టం స్థానంలో దేశ ద్రోహం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసే వెసులుబాటు పోలీసులకు దీనివల్ల కలుగుతోందని అన్నారు.
అయితే, హైదరాబాద్‌కు చెందిన వి. రవికుమార్ అనే అడ్వకేట్ మాత్రం, ‘కొత్త చట్టాల వల్ల న్యాయం త్వరగా లభించే అవకాశం ఉంది. బాధితులకు ఈ చట్టాలు మేలు చేస్తాయి’ అని అన్నారు.
ఈ చట్టాల రూపకల్పన సమయంలో వీటిని నిలిపివేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. కొత్త చట్టాల పేరుతో ప్రజల ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని కొందరు న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే, వలసపాలన నాటి కాలం చెల్లిన చట్టాల స్థానంలో తీసుకు వచ్చిన కొత్త చట్టాలు ప్రజలకు మరింత సహాయకారిగా ఉంటాయని, న్యాయం వేగంగా అందుతుందని అధికారపక్షానికి చెందిన వారు చెబుతున్నారు.