POCSO: చిన్నపిల్లల అశ్లీల చిత్రాలు చూసినా, డౌన్లోడ్ చేసినా, షేర్ చేసినా నేరమే... స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
చిన్న పిల్లలతో తీసిన పోర్న్ చిత్రాలను చూడడం కూడా పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్) చట్టం కింద నేరం అవుతుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అలాగే, చైల్డ్ పోర్నోగ్రఫీ అనే మాటలను కోర్టు ఆదేశాల్లో కానీ, తీర్పు ప్రకటనల్లో కానీ ఉపయోగించకూడదని కూడా భారత అత్యున్నత న్యాయస్థానం దేశంలోని అన్ని కోర్టులకు సూచించింది.
Supreme Court : చిన్న పిల్లలతో తీసిన పోర్న్ చిత్రాలను చూడడం కూడా పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్) చట్టం కింద నేరం అవుతుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అలాగే, చైల్డ్ పోర్నోగ్రఫీ అనే మాటలను కోర్టు ఆదేశాల్లో కానీ, తీర్పు ప్రకటనల్లో కానీ ఉపయోగించకూడదని కూడా భారత అత్యున్నత న్యాయస్థానం దేశంలోని అన్ని కోర్టులకు సూచించింది.
చిన్నపిల్లలున్న అడల్ట్ వీడియోలను చూడడం పోక్సో నేరం కిందకు రాదని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సోమవారం నాడు తోసిపుచ్చింది.
ఈ తీర్పును ప్రకటించిన సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జె.బి. పార్దీవాలా, చైల్డ్ పోర్నోగ్రఫీ అనే మాటలకు బదులు ‘బాలల లైంగిక దోపిడీ, అనుచిత మెటీరియల్’ (CSEAM) అని వ్యవహరించాలని ఆదేశించారు. పార్లమెంటు కూడా ఈ మాటల్లో మార్పును సీరియస్‌గా తీసుకోవాలని, అందుకోసం పోక్సో చట్టాన్ని సవరించేందుకు ఆర్డినెన్స్ తేవాలని కూడా సుప్రీం కోర్టు సూచించింది.
చెన్నైలోని ఒక 28 ఏళ్ళ వ్యక్తి మీద చైల్డ్ పోర్నోగ్రఫీ చూస్తున్నారనే ఆరోపణలతో కేసు నమోదైంది. ఆ కేసును విచారించిన మద్రాసు హైకోర్టు వ్యక్తిగతంగా చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం పోక్సో పరిధిలోకి రాదని చెబుతూ ఆ వ్యక్తి మీద ఎఫ్ఐఆర్‌ను, క్రిమినల్ విచారణను రద్దు చేస్తూ తీర్పు చెప్పింది. ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ మీద భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ విచారణకు స్వీకరించారు.
భారత చీఫ్ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలాలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు చెల్లదని ప్రకటిచింది. చైల్డ్ పోర్నోగ్రఫీని డౌన్లోడ్ చేసినా, చూసినా, షేర్ చేసినా పోక్సో చట్టం కింద నేరం అవుతుందని చరిత్రాత్మక తీర్పు ప్రకటించింది. చైల్డ్ పోర్నోగ్రఫీని వ్యక్తిగతా చూడడం నేరం కాదని ప్రకటించడం ద్వారా మద్రాసు హైకోర్టు ‘దారుణమైన తప్పు’ చేసిందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.