Train Engine In Field: పొలాల్లోకి దూసుకొచ్చిన రైలు ఇంజన్! ఫోటోలు, వీడియోలు వైరల్
Train Spotted In Fields: సర్వసాధారణంగా రైలుని మనం పట్టాలపై తప్పితే మరెక్కడా చూసే అవకాశం ఉండదు. కానీ తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అవుతోంది. అందులో రైలు ఇంజన్ పొలాల్లో పార్క్ చేసి ఉన్నట్లుగా కనిపిస్తోంది. అది చూసిన జనం ఆశ్చర్యంతో ఇది నిజమేనా లేక తమ కళ్లేమైనా భ్రమపడుతున్నాయా అని మళ్లీమళ్లీ అదే పిక్ వైపు పరీక్షించి చూస్తున్నారు. కానీ అది నిజమే. బీహార్‌లోని గయాకు సమీపంలోని పొలాల్లో శుక్రవారం సాయంత్రం ఈ దృశ్యం కనిపించింది.
ఇంతకీ ఏం జరిగిందంటే..
వెనకాల ఎలాంటి బోగీలు లేకుండా కేవలం ఇంజన్ మాత్రమే లూప్ లైన్ లో గయా వైపు వెళ్తోంది. కోల్హానా స్టేజ్ దాటి వజీర్‌గంజ్ స్టేషన్ వైపు వెళ్తున్న సమయంలోనే ఇంజన్ అదుపుతప్పినట్లు లోకోపైలట్ గ్రహించారు. అలాగే ముందుకెళ్తే రైలు పట్టాలపై ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఆ ప్రమాదాన్ని నివారించాలంటే ఈ రైలు ఇంజన్‌ని పక్కకు పోనివ్వక తప్పదనే నిర్ణయానికొచ్చారు. వెంటనే రైలును లూప్ లైన్ నుండి పక్కకు తప్పించారు. అలా రైలు ఇంజన్ ఆ పట్టాలు ముగిసే వరకు వెళ్లి ఆ తరువాత పొలాల్లోకి దూసుకెళ్లి ఆగిపోయింది.
రైలు పొలాల్లోకి దూసుకొచ్చి ఆగిపోవడం చూసి షాక్ అవడం స్థానికుల వంతయ్యింది. ఈ సమాచారం అందుకున్న చుట్టుపక్కల గ్రామల ప్రజలు కూడా అదేదో వింతను చూడ్డానికి వచ్చినట్లుగా వస్తున్నారని అక్కడి రఘునాథ్‌పూర్ గ్రామస్తులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజెన్స్ రకరకాల జోక్స్ కూడా వేసుకుంటున్నారు.