Top 6 News @ 6PM: ఆమ్రపాలి సహా ఐఎఎస్ లకు దక్కని ఊరట: మరో ఐదు ముఖ్యాంశాలు

జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి సహా హైకోర్టు ను ఆశ్రయించిన ఐఎఎస్ అధికారులకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించలేదు.

Update: 2024-10-16 12:57 GMT

1.ఐఎఎస్ అధికారులకు దక్కని ఊరట: డీఓపీటీ ఆదేశాలు పాటించాల్సిందే

జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి సహా హైకోర్టు ను ఆశ్రయించిన ఐఎఎస్ అధికారులకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించలేదు. ఐఎఎస్ లు దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. తమకు కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్ట్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 9న డీఓపీటీ ఉత్తర్వులను క్యాట్ లో ఐఎఎస్ అధికారులు సవాల్ చేశారు. అయితే ఏ రాష్ట్ర క్యాడర్ అఖిల భారత సర్వీస్ అధికారులు ఆ రాష్ట్రానికి వెళ్లాలని క్యాట్ అక్టోబర్ 15న ఆదేశించింది. క్యాట్ ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టులో ఆమ్రపాలి, వాకాటి కరుణ, రోనాల్డ్ రోస్,వాణీ ప్రసాద్, సృజన, శివశంకర్, హరికిరణ్ సవాల్ చేశారు. ఈ ఏడాది నవంబర్ 4 వరకు క్యాట్ లో విచారణ ఉన్నందున అప్పటివరకు రిలీవ్ చేవద్దని ఐఎఎస్ అధికారులు కోర్టును కోరారు. ఈ అభ్యర్ధనను కోర్టు తోసిపుచ్చింది.

2. టీడీపీ కార్యాలయంపై దాడి: సజ్జల రామకృష్ణారెడ్డికి నోటీసులు

వైఎస్ఆర్ సీపీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డికి బుధవారం మంగళగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ఆయనకు నోటీసులు జారీ చేశారు. అక్టోబర్17న విచారణకు రావాలని ఆ నోటీసులో పోలీసులు కోరారు. 2021 అక్టోబర్19న టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది. ఈ కేసులో ఇప్పటికే వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, నాయకులు దేవినేని అవినాశ్ తదితరులను పోలీసులు విచారించారు.

3. నైజీరియాలో పెట్రోల్ ట్యాంకర్ పేలి 90 మంది మృతి

నైజీరియాలో పెట్రోల్ ట్యాంకర్ పేలి 90 మంది మృతి చెందారు. జిగావా రాష్ట్రంలోని మజియా పట్టణంలో మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. కనో నుంచి బయలుదేరిన ఓ పెట్రోల్ ట్యాంకర్ ప్రమాదానికి గురైంది. వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయారు. దీంతో వాహనం బోల్తాపడింది. ఈ విషయం తెలిసిన స్థానికులు పెట్రోల్ కోసం ఈ వాహనం వద్దకు వెళ్లిన సమయంలో మంటలు చెలరేగి ట్యాంకర్ పేలిపోయింది. ఈ ఘటనలో 50 మంది గాయపడ్డారు.

4. బిల్డర్లు, వ్యాపారులను బెదిరించేందుకు హైడ్రా: కేటీఆర్

హైద్రాబాద్ నగరంలోని బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం సమావేశమయ్యారు. హైడ్రా, మూసీ సుందరీకరణ అంశాలపై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. బిల్డర్లు, వ్యాపారులను భయపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా తెచ్చిందని కేటీఆర్ ఆరోపించారు. మూసీ పేరుతో జరుగుతున్న దోపీడీని ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆయన చెప్పారు.దీనిపై బస్తీల్లోకి వెళ్లి ప్రజలను చైతన్యం చేస్తామని ఆయన చెప్పారు. తమ పార్టీ లీగల్ సెల్ ద్వారా అండగా నిలుస్తామన్నారు.

5.ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు: చంద్రబాబు

వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. ఏపీ కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వివరించారు. ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్, క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ పాలసీలు తెచ్చామన్నారు. పర్యాటక, ఐటీ, వర్చువల్, వర్కింగ్ పాలసీలను తీసుకువస్తామన్నారు.

6 . కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకగా కరవు భత్యాన్ని 3 శాతం పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదంతెలిపింది.దీంతో ప్రస్తుతం ఉన్న డీఏ 50 శాతం నుంచి 53 శాతానికి చేరుతుంది. ఈ ఏడాది జులై నుంచి దీన్ని అమలు చేస్తారు. డీఏ పెంపుతో కేంద్ర ఖజానాపై రూ. 9448 కోట్ల భారం పడుతుంది. కోటి మంది ఉద్యోగులు, పెన్షనర్లు ప్రయోజనం పొందుతారు.కేంద్ర కేబినెట్ సమావేశం నిర్ణయాలను ఆశ్విని వైష్ణవ్ బుధవారం మీడియాకు వివరించారు. 2025-26 రబీసీజన్ లో పంటల కనీస మద్దతు ధరను పెంచింది. క్వింటాల్ గోధుమపై రూ. 150 ఎంఎస్ పీని పెంచారు. క్వింటాల్ ఆవాలుకు రూ. 300, పెసరకు రూ. 275, శనగలకు రూ. 20, పొద్దు తిరుగుటకు 140 పెంచినట్టు మంత్రి చెప్పారు.

Tags:    

Similar News