కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కరోనా భూతంపై యుద్ధం !

Update: 2020-03-18 14:52 GMT

దేశంలో ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ పై భయం స్థానంలో అవగాహన పెరుగుతోంది. ప్రజలకే కాదు ప్రభుత్వ యంత్రాంగానికి సైతం ఒక స్పష్టత వస్తోంది. క్రమంగా ఒక్కో కఠిన చర్యను తీసుకుంటున్నారు. మరో వైపున ప్రజలు సైతం ఈ మహాయుద్ధంలో చేరేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దేశంలో ఈ యుద్ధం ఎలా జరుగుతున్నదో చూద్దాం.

యుద్ధం అనగానే మనకు గుర్తుకొచ్చేది శత్రువులే. ఈ యుద్ధంలో మాత్రం మన శత్రువు కరోనా వైరస్. ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 8 వేల మందిని బలి తీసుకుంది. మరో రెండు లక్షల మంది ఈ వైరస్ కు గురయ్యారు. మన దేశంలో ప్రస్తుతానికి ఈ వైరస్ అదుపులో ఉన్నట్లు కనిపిస్తున్నా పేలేందుకు సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా ఉందనేది మాత్రం కాదనలేని నిజం. ఆ ముప్పును తప్పించే శక్తి ప్రజలకు మాత్రమే ఉంది. ఆ శక్తిపేరే సోషల్ డిస్టెన్స్. పేరు కొత్తగా ఉన్నప్పటికీ వ్యవహారం పాతదే. ప్రతీ ఒక్కరూ బహిరంగ స్థలాలకు, సామాజిక కార్యకలాపాలకు, ఇతరులకు దూరంగా ఉండడమే సోషల్ డిస్టెన్స్. కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో దాని ఉపద్రవాన్ని తగ్గించడంలో కీలకం సోషల్ డిస్టెన్స్. ఇలా చేయడం ద్వారా కరోనా వైరస్ చెయిన్ ను బ్రేక్ చేయగలం. ఒక్కసారి ఈ చెయిన్ ను బ్రేక్ చేస్తే ఇక దాన్ని అరికట్టడం సులభమే. కొత్తగా వ్యాధిబారిన పడేవారు తగ్గిపోతే ప్రభుత్వంపై, ప్రజలపై, ఆసుపత్రులపై కూడా ఒత్తిడి తగ్గిపోతుంది. ఇప్పుడు మనం చేయాల్సింది అదే. కరోనా వైరస్ తదుపరి హాట్ స్పాట్ భారత్ అంటూ ఇప్పటికే అమెరికన్ నిపుణులు కొందరు హెచ్చరిస్తున్నారు. దేశ జనాభాలో 20 శాతం నుంచి 60 శాతం మంది కరోనా వైరస్ బారిన పడే అవకాశం ఉందని వారంటున్నారు. ఈ నేపథ్యంలో ఇక అందరి దృష్టి కూడా సోషల్ డిస్టెన్స్ పైనే ఉంది.

సోషల్ డిస్టెన్స్ ను అమలు చేయడం అంత సులభమేం కాదు. ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిందే. ప్రభుత్వమే దాన్ని అమలు చేయాలంటే మాత్రం పలు కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. కేంద్ర ప్రభుత్వం నెమ్మదిగా అయినా ఆ కఠిన చర్యలను తీసుకోవడంలో ముందుకెళ్తూనే ఉంది. మరో వైపున వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం కఠిన చర్యల అమలుకు శ్రీకారం చుట్టాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎన్నో ప్రాంతాల్లో ప్రజలతో పాటు వివిధ వర్తక, వాణిజ్యసంఘాలు కూడా దీన్ని ఓ మహోద్యమంలా చేపడుతున్నాయి. కార్యకలాపాలు బంద్ చేసేందుకు ముందుకు వస్తున్నాయి. దేశంలో ఇప్పటికే డజనుకు పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు విద్యాసంస్థలు, షాపింగ్ మాల్స్ లాంటివాటిని మూసివేశాయి. మరికొన్ని రాష్ట్రాలు కూడా అదే బాటలో ఉన్నాయి.

దేశంలో వివిధ రాష్ట్రాల్లో కరోనా పై పోరు ఎలా జరుగుతున్నదో చూద్దాం. కశ్మీర్ లో వైష్ణోదేవి యాత్రను నిలిపివేశారు. అంతర్ రాష్ట్ర బస్ సర్వీస్ లను ఆపేశారు. పలు ప్రాంతాల్లో సందర్శన స్థలాలు మూసివేశారు. కొన్ని జిల్లాల్లో ప్రజా రవాణా వ్యవస్థను ఆపేశారు. పారా మిలిటరీ బలగాలకు సెలవులు రద్దు చేశారు. ఏ విపత్తునైనా ఎదుర్కొనేందుకు సైన్యాన్ని సన్నద్ధంగా ఉంచారు. లద్దాఖ్ లో ఇరాన్ వెళ్ళి వచ్చిన ఓ జవాన్ కరోనా వైరస్ బారిన పడ్డారు. లద్దాఖ్ లో కరోనా బారిన పడిన వారి సంఖ్య 8కి పెరిగింది. ఉత్తరప్రదేశ్ లో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి దాకా విద్యార్థులకు పరీక్షలు రద్దు చేశారు. వారిని పై తరగతులకు ప్రమోట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ 2 వరకు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. వివిధ పోటీ పరీక్షలను ఏప్రిల్ 2 వరకు వాయిదా వేశారు. అవకాశం ఉన్న చోట ప్రైవేటు సంస్థలతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగులకు సైతం వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పించారు. కరోనా వైరస్ రోగులకు ఉచిత చికిత్స అందిస్తున్నారు. మార్చి 25 నుంచి ఏప్రిల్ 2 వరకు అయోధ్యలో రామ్ నవమి మేళా జరుగనుంది. సుమారు 10 లక్షల మంది ఆ కార్యక్రమానికి హాజరవుతారని అంచనా. ఆ కార్యక్రమంపై ఇప్పుడు భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఢిల్లీ లో మార్చి 31 దాకా విద్యాసంస్థలను మూసివేశారు. జిమ్, నైట్ క్లబ్, స్పాలను కూడా క్లోజ్ చేశారు. 50 కంటే తక్కువ మందితోనే కార్యక్రమాలు నిర్వహించుకోవాలని ఆదేశించారు. మహారాష్ట్ర విషయానికి వస్తే, పలు ప్రాంతాల్లో ఆలయాలను మూసివేశారు. ముంబైతో సహా పలు నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు సహా వివిధ దుకాణాలను మూసివేశారు. పరిస్థితిని బట్టి మూసివేత మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉంది. మహారాష్ట్రలో ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య 50కి చేరుకునేలా ఉంది. కొత్తగా మరో 7 లేబొరేటరీలను ఏర్పాటు చేశారు. పుణెలో ఏ కంపెనీలోనూ ఒకే కార్యాలయంలో ఐదు మందికి మించి పని చేయవద్దని ప్రభుత్వం ఆదేశించింది. ఇంట్లోనే క్వారంటైన్ లో ఉండాల్సిందిగా స్టాంప్ వేయించుకున్న వ్యక్తులు ఆ నిబంధనలను ఉల్లంఘించి ప్రయాణాలు చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఇలా ప్రయాణం చేస్తున్న నలుగురిని రైల్లో నుంచి దించేశారు. క్వారంటైన్ లో ఉండేందుకు హోటళ్లలో తక్కువ రేట్లకే గదులను అందుబాటులో ఉంచారు. వర్క్ ఫ్రం హోమ్ తరహాలో ఇంటి నుంచే భగవంతుడిని ప్రార్ధించడం కూడా అధికమైపోయింది. ఔరంగాబాద్ ఇందుకు నాంది పలికింది. నాగపూర్, నాసిక్ లలో ఇప్పటికే 144 సెక్షన్ విధించారు.

పంజాబ్ లో కరోనా వ్యాధి సోకినట్లుగా భావిస్తున్న 167 మంది ఆచూకీ లభించకపోవడం ఆందోళన కలిగించేదిగా మారింది. ప్రైవేటు సంస్థలు 50 శాతం మంది సిబ్బందితోనే పని చేయాలని సూచించారు. సచివాలయంలోకి సందర్శకుల రాకను నిషేధించారు. ప్రజలు అనవసర ప్రయాణాలను మానుకోకుంటూ ప్రజారవాణా వ్యవస్థను నిలిపివేస్తామని మహారాష్ట్ర సీఎం ఉద్భవ్ థాకరే ఇప్పటికే హెచ్చరించారు.

హర్యానాలో మార్చి 12న ప్రభుత్వం కరోనా వైరస్ ను ఎపిడమిక్ గా ప్రకటించింది. మార్చి 31 దాకా విద్యాసంస్థలను మూసేసింది. ప్రైవేటు సంస్థల సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పించారు. తెలంగాణలో ఇప్పటికే కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సందర్శకుల రాకపోకలను నియంత్రించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. రహదారులపై జన సమూహం ఎక్కువగా ఉండకుండా చర్యలు తీసుకునే యోచన కూడా ఉంది. ఇటీవల విదేశాలకు వెళ్ళి వచ్చిన ఐటీ నిపుణులు తమ వివరాలు వెల్లడించాల్సిందిగా ఒడిషా ప్రభుత్వం ఆదేశించింది. కర్నాటక విషయానికి వస్తే, మాల్స్, థియేటర్లు, పబ్ లు లాంటివాటిని మూసివేయాల్సిందిగా మార్చి 13నే ప్రభుత్వం ఆదేశించింది. పలు పరీక్షలను మార్చి 31 దాకా వాయిదా వేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయాల్సిందిగా ప్రభుత్వం వివిధ సంస్థలకు సూచించింది. ఐటీ తో సహా పలు రంగాల కంపెనీలు ఈ సూచనను అమలు చేయడంతో కార్యాలయాలు మూతపడినట్లయింది. కర్నాటకలో పాజిజివ్ కేసుల సంఖ్య 13కి పెరిగింది. కర్నాటకలోకి వచ్చే ఇతర రాష్ట్రాల ప్రయాణికులను సైతం స్క్రీనింగ్ చేసే ఉద్దేశంతో కర్నాటక ఉంది.

కేరళలో వృద్ధుల జనాభా అధికంగా ఉండడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. మొత్తం జనాభాలో 13 శాతం మంది 60 ఏళ్ళు పైబడిన వారే. అంతేగాకుండా మొత్తం జనాభాలో 27 శాతం పురుషులు, 19 శాతం మహిళలు మధుమేహ వ్యాధిగ్రస్తులు. పురుషుల్లో 41 శాతం మందికి, మహిళల్లో 39 శాతం మందికి హైబీపీ ఉంది. ఈ గణాంకాలు ఇప్పుడు కేరళ ప్రభుత్వాన్ని భయపెడుతున్నాయి. ఇలాంటి వారంతా తేలిగ్గా కరోనా వైరస్ ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది. కొచిలో క్వారంటైన్ లో ఉన్నవారి సంఖ్య 1000కి పెరిగింది. కేరళకు చెందిన వారు అత్యధిక శాతం విదేశాల్లో పని చేస్తుంటారు. అందుకే విదేశాల నుంచి కేరళకు రాకపోకలు అధికం. కరోనా వైరస్ కు సంబంధించి మొదటగా అప్రమత్తమైంది కూడా కేరళనే. అక్కడ జనవరి 23 నుంచే విదేశాల నుంచి వచ్చే వారిని స్క్రీనింగ్ చేయడం మొదలైంది. ఆలయాలు, మసీదులు, చర్చిలలో వేడుకలకు దూరంగా ఉండాల్సిందిగా భక్తులకు ప్రభుత్వం సూచించింది. కేంద్రం 14 రోజుల క్వారంటైన్ ను మాత్రమే సూచించినా కేరళలో మాత్రం ముందు జాగ్రత్తగా 28 రోజుల క్వారంటైన్ ను అమలు చేస్తున్నారు. మరెన్నో రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.

కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పలువురి ఉపాధి అవకాశాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాకపోతే ఆ చర్యలు తప్పనిసరి అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయా వర్గాల వారిని ఆదుకోవాలన్న అభ్యర్థనలు సైతం తెరపైకి వస్తున్నాయి. ఒక వైపు దేశం ఇంతగా కలవరపడుతున్నా కొన్ని చోట్ల వివిధ రకాల నిరసన ప్రదర్శనలు కొనసాగడం ఆరోగ్యపరంగా ఆందోళన కలిగించే అంశంగా మారింది.

కరోనా వైరస్ పై అవగాహన పెంచడం ఎంత ముఖ్యమో, తప్పుడు సమాచార వ్యాప్తిని అడ్డుకోవడం కూడా అంతే ముఖ్యం. అందుకే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్న వారిని అరెస్టు చేస్తున్నాయి. ప్రజల్లో ఈ అవగాహన పెంచేందుకు సినీతారలు, సెలెబ్రిటీలు ముందుకొచ్చారు. న్యాయస్థానాలు వీడియో కాన్ఫరెన్స్ అంశాన్ని పరిశీలిస్తున్నాయి. ఇక శాస్త్రవేత్తల అంచనా ప్రకారం లిక్విడ్ డ్రాప్ లెట్స్ పై ఈ వైరస్ మూడు గంటల సేపు, రాగిపై నాలుగు గంటల సేపు, కార్డ్ బోర్డ్ పై 24 గంటల పాటు, ప్లాస్టిక్, స్టెయిన్ లెస్ స్టీల్ పై రెండు, మూడు రోజుల పాటు సజీవంగా ఉండే అవకాశం ఉంది. విదేశాల నుంచి తిరిగి వస్తున్న భారతీయుల అంశం ఆందోళన కలిగించేదిగా మారుతోంది. విదేశాల్లోని భారతీయుల్లో 276 మంది ఈ వైరస్ కు గురయ్యారు. ఒక్క ఇరాన్ లో ఇలాంటి వారు 255 మంది ఉన్నారు. వీరిలో అత్యధికులు కశ్మీర్, లద్దాఖ్ లకు చెందినవారే. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు కొన్ని సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేస్తున్నా అన్ని రంగాల్లో ఇది సాధ్యం కాదు. అలాంటప్పుడు వారిని ఆదుకోవడం ఎలా అన్న అంశం కూడా ఇప్పుడు తెరపైకి వస్తోంది. పాఠశాలలు మూసివేస్తున్న నేపథ్యంలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు ఎలా అమలు చేయాలో పరిశీలించాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశించిది. ఒకపక్కన కరోనా పై దేశం అట్టుడికిపోతుంటే, సీఏఏ తదితర అంశాలపై కర్నాటకలో, ఢిల్లీలో నిరసన ప్రదర్శనలు కొనసాగించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిరసనలను కొంత కాలం వాయిదా వేయాలన్న సూచనలు వస్తున్నాయి.

కరోనా వైరస్ అనగానే భయపడాల్సిన అవసరం లేదు. ఆ వైరస్ సోకినా కోలుకున్నవారెంతో మంది ఉన్నారు. కాకపోతే ఆ వ్యాధి విస్తరించకుండా చూడాల్సిన అవసరం ఉంది. వైరస్ సోకిన తరువాత చికిత్స కన్నా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడమే సులభం. అందుకు మనకు అందుబాటులో ఉన్న ఒకే ఒక్క మార్గం సోషల్ డిస్టెన్స్. కొన్ని రోజుల పాటు ఎవరికి ఎంతగా వీలైతే అంతగా ఇంటిపట్టున ఉండడమే మంచిది. ఆ దిశలో ప్రజలంతా స్పందించాలని కోరుకుందాం. 

Tags:    

Similar News