ఈరోజు దేశవ్యాప్తంగా రెండో విడత కరోనావ్యాక్సిన్ డ్రైరన్
* తెలంగాణ వ్యాప్తంగా 6 చోట్ల టీకా డ్రైరన్ * హైదరాబాద్, పాలమూరులో మూడు చోట్ల నిర్వహణ * ఏపీలోని 13 జిల్లాల్లో కరోనా డ్రైరన్
దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా ఇవాళ డ్రైరన్ నిర్వహిస్తోంది. వ్యాక్సిన్ ఎవరికి ముందుగా ఇవ్వాలనే దానిపై వాలంటీర్ల జాబితాను సిద్ధం చేసింది. ఇందుకోసం కోవిడ్ యాప్‌ను వైద్యశాఖ రూపొందించింది. ఎవరెవరికి వ్యా్క్సిన్ ఇవ్వాలనే లిస్ట్ మొత్తాన్ని ఆన్‌లైన్ ఉంచుతున్నారు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు. ఈ క్రమంలో ఈ రోజు నుంచి అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో డ్రైరన్ కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం 83కోట్ల సిరంజీలకు ఆర్డర్ చేయగా అదనంగా మరో 35కోట్ల సిరంజీల కోసం బిడ్స్ దాఖలు చేసింది. అయితే ఈ సిరంజీలను కరోనా వ్యాక్సిన్ వేయడానికి వాడనున్నట్లు కేంద్రం తెలియజేసింది.
తెలంగాణ వ్యాప్తంగా ఆరుచోట్ల కరోనా టీకా డ్రైరన్ నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి రెండు గంటల వ్యవధిలో ఈ కార్యక్రమం పూర్తి చేయనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని తిలక్ నగర్ UPHC, నాంపల్లి ఏరియా ఆస్పత్రి, సోమాజిగూడలోని యశోద ఆస్పత్రి, మహబూబ్‌నగర్ జిల్లాలోని జానపేట PHC, మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రి, నేహా షైన్ ఆస్పత్రులను డ్రైరన్ నిర్వహిస్తున్నారు.
ఈ ఆస్పత్రుల్లో ఒక్కో కేంద్రం ఏర్పాటు చేసి 25మంది చొప్పున 150 మంది వైద్య సిబ్బందికి టీకా వేస్తున్నారు. వీరి పేర్లు, చిరునామా, వివరాలను కొ-వినన్ యాప్‌లో అప్‌లోడ్ చేశారు. సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇప్పటికే ఇచ్చారు. వ్యాక్సినేషన్‌కు గంట ముందే నిల్వ కేంద్రాల నుంచి ప్రత్యేక వాహనాల్లో డోసులను తరలించారు. ఒక్కో కేంద్రానికి అవసరమైన డోసుల కన్నా 15శాతం అదనంగా పంపారు.
దేశంలో నాలుగు రాష్ట్రాల్లో మొదటి విడతగా రెండు రోజుల పాటు డ్రై రన్ నిర్వహించారు. డిసెంబర్ 28, 29 తేదీల్లో ఏపీతో పాటు అసోం, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ చేపట్టారు. క్షేత్ర స్ధాయిలో పరిస్థితులను అంచనా వేసేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. అటు ఫైజర్‌తో పాటు ఆస్ట్రాజెన్‌కా, కోవ్యాగ్జిన్ వ్యాక్సిన్‌లు కేంద్ర ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయి. అయితే ఆగష్టు నాటికి 30కోట్ల మందికి వ్యాక్సినేషన్ చేయాలని రెడీ అవుతోంది కేంద్ర ఆరోగ్యశాఖ.