Price Hike: పండగవేళ సామాన్యులకు షాక్...ధరల బాదుడు..భారంగానే దసరా పండగ
Price HIke: ఇంకో రెండు మూడు రోజుల్లో దసరా సంబురాలు షురూ కానున్నాయి. ఈనేపథ్యంలో నిత్యవసరాలు భారీగా పెరిగాయి. ధరలు ఆకాన్నంటడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.
Price HIke: దేశం అభివృద్ధి చెందుతుంది అనే మాట మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటున్నాం. కానీ అభివృద్ధి చెందటం అంటే ఇదేనా అనే ప్రశ్న తెరపైకి వస్తోంది. దేశంలో ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రజల దగ్గర డబ్బు పెరిగితే దాన్ని అభివృద్ధి అనుకోవచ్చు. కానీ రోజు రోజుకు నిత్యావసర, అత్యవసర వస్తువుల ధరలు పెరిగిపోతుంటే ఏం చేయాలనో అర్థంకాని పరిస్థితుల్లో ఉన్నారు ప్రజలు.
దసరా, దీపావళి వంటి పండగలు వస్తే ఇళ్లకు చుట్టాలు వస్తారు. ఈ పండగల వేళ కాస్త ఎక్కువగా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పిండివంటలు, అందరు కలిసి భోజనాలు చేస్తుంటారు. కానీ సామాన్యుల ఆనందాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆవిరి చేస్తున్నాయి. పెరిగిపోతున్న ధరలను అదుపు చేయడం లేదు. పైగా మరింత ధరలు పెంచుతూ సామాన్యులకు వెన్నుపోటు పొడుస్తున్నాయి.
ఈ మధ్యే నూనెల ధరలు భారీగా పెరిగాయి. సరిగ్గా పండగల సమయం చూసి కేంద్రం సామాన్యులకు షాకిచ్చింది. అప్పటికే ఉల్లిధరలు కూడా పెరిగాయి. ఇప్పుడు ఏ వస్తువు తక్కువ ధరకు ఉన్నాయా అని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఎదురైంది. సామాన్య, పేద ప్రజలు పండగ చేసుకోవాలన్న ఆసక్తి కూడా తగ్గిపోయింది. చేతిలో డబ్బు ఉన్నప్పుడే పండగ ఆనందం. పామాయిల్, సన్ ఫ్లవర్ ధరలు లీటర్ కు 20 రూపాయలకు పైగా పెరిగిపోయాయి. వేరుశనగ ఏకంగా 160 రూపాయలు దాటింది. రైస్ బ్రాన్ ఆయిల్ రూ. 120కి చేరుకుంది. కొబ్బరి నూనె కూడా భారీగా పెరిగింది. వంటనూనెలకు కేంద్రం దిగుమతి సుంకాన్ని పెంచారన్న వంకతో కంపెనీలు కూడా భారీగా ధరలు పెంచాయన్న ఆరోపణలు ఉన్నాయి.
ఒక్కప్పుడు వంద రూపాయలు పెడితే కిలోల కొద్ది కూరగాయలు వచ్చేవి. కానీ ఇప్పుడు 5 వందలు పెట్టినా కావాల్సిన వస్తువులు రావడం లేదు. చివరకు ఆకు కూరల ధరలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. కొత్తిమీర ధర అయితే భారీగా పెరిగింది. ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురవడంతో కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. అదే సమయంలో వ్యాపారులు క్రుత్రిమ కొరతను స్రుష్టిస్తూ ధరలను పెంచేస్తున్నారు.
అటు మాంసాహారం కూడా భారీగానే పెరిగింది. చికెన్, మటన్ ధరలు ఆకాశన్నంటుతున్నాయి. పప్పులు కూడా కేజీ 180పైనే ఉన్నాయి. ఈ స్థాయిలో ధరలు పెరుగుతుంటే పండగలు ఎలా చేసుకుంటామంటూ సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ఏడాది ఏడాదికి సామాన్యులు పండగలకు దూరం కావాల్సి వస్తుంది.