Wife Equal Share: భర్త ఆస్తిలో భార్యకి సమాన వాటా.. కోర్టు తీర్పు వెనుక కారణం ఏంటంటే..?
Wife Equal Share: ఇటీవల మద్రాసు హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. భర్త ఆస్తిలో భార్యకి సమాన వాట ఉంటుందని తీర్పు వెల్లడించింది.
Wife Equal Share: ఇటీవల మద్రాసు హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. భర్త ఆస్తిలో భార్యకి సమాన వాట ఉంటుందని తీర్పు వెల్లడించింది. దీని వెనుక కోర్టు చాలా విషయాలని పరిగణలోనికి తీసుకుంది. జూన్ 21న తమిళనాడుకు చెందిన ఓ జంటకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా ఈ తీర్పును వెలువరించింది. ఇంటి పని చేస్తూ కుటుంబ సంపదకి పరోక్షంగా సహకరించినందున భర్త కొనుగోలు చేసిన ఆస్తిలో సమాన హక్కు ఉంటుందని కోర్టు పేర్కొంది. మహిళల హక్కులతో సంబంధం ఉన్న ఈ నిర్ణయాన్ని మహిళలు చారిత్రాత్మకంగా అభివర్ణిస్తున్నారు.
దేశంలో మొదటిసారిగా భర్త సంపాదనలో భార్య సహకారాన్ని మద్రాసు కోర్టు ఆమోదించింది. ఇంటి పని చేయడం ద్వారా సంపదను పెంచుకోవడానికి భార్య సహాయం చేస్తుంది. ఈ విషయాన్ని కోర్టు గుర్తించడంతో ఆలస్యమైనా ఈ విషయం వెలుగులోకి రావడంతో గృహిణులు సంబురపడుతున్నారు. మద్రాస్ హైకోర్టు తన నిర్ణయంలో కొన్ని ముఖ్యమైన విషయాలను పేర్కొంది. భార్యలు ఇంటి పనులు చేస్తారని, లాభదాయకమైన ఉపాధి కోసం భర్తలను ప్రోత్సహిస్తారని కోర్టు పేర్కొంది. ఈ విధంగా ఆమె కుటుంబ ఆస్తుల సముపార్జనకు దోహదం చేస్తుంది. దశాబ్దాలుగా కుటుంబాన్ని చూసుకునే జీవిత భాగస్వామికి ఆస్తిలో కచ్చితంగా సమానంగా హక్కు ఉంటుందని కోర్టు వివరించింది.
అయితే జస్టిస్ కృష్ణన్ రామసామి మాట్లాడుతూ వాస్తవానికి భార్య చేసే సహకారాన్ని గుర్తించే చట్టం ఏదీ లేదన్నారు. కానీ కోర్టు దానిని గుర్తించవచ్చని తెలిపారు. రోజుకి 8 గంటలు మాత్రమే పని చేసే భర్త ఉద్యోగంతో 24 గంటలూ పని చేసే గృహిణిని పోల్చలేమని కోర్టు తీర్పులో స్పష్టం చేసింది. భర్త పొదుపుతో కొనుగోలు చేసిన ఆస్తులు భార్య 24 గంటల కృషి వల్లే సాధ్యమైందని తెలిపింది. కాబట్టి భర్త తన పేరు మీద సంపాదించిన ఆస్తిలో భార్యకు హక్కు ఉంటుందని కోర్టు పేర్కొంది.