నేడు ఆకాశంలో అద్భుత దృశ్యం.. భూమికి అత్యంత సమీపంగా రానున్న జెమినిడ్స్ ఉల్కాపాతం
* రాత్రి 9 తర్వాత మరింత స్పష్టంగా వీక్షించే అవకాశం.. టెలిస్కోప్ అవసరం లేకుండానే చూసే అవకాశం
Meteor Shower: ఇవాళ ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానున్నది. ఈ ఏడాదిలో చివరి ఉల్కాపాతం భూమికి అత్యంత సమీపంగా రానుంది. ఈ నెల 4వ తేదీ నుంచి ఆకాశంలో కనిపిస్తున్న 'జెమినిడ్స్' ఉల్కాపాతం ఇవాళ రాత్రి గరిష్ఠస్థాయికి చేరుకోనుంది. గరిష్ఠంగా గంటకు 150 ఉల్కలతో ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. జెమినిడ్స్ ఉల్కాపాతం శిథిలాలు సెకనుకు 70 కిలోమీటర్ల వేగంతో భూ వాతావరణంలోకి ప్రవేశించే సందర్భంలో మండిపోతూ ప్రకాశంగా కనిపించనున్నాయి.
వీటిని టెలిస్కోప్ లేకుండానే వీక్షించే అవకాశం ఉందని, భూమిమీద ఎక్కడినుంచైనా వీక్షించొచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటిని ప్రత్యక్షంగా చూసినా ఎలాంటి ముప్పు ఉండదని పేర్కొంటున్నారు. ఈరోజు సాయంత్రం 6గంటల 30 నిమిషాలకు ఉల్కాపాతం గరిష్ఠ స్థాయిని చేరుకొంటుందని, రాత్రి 9 గంటలకు దీన్ని మరింత స్పష్టంగా వీక్షించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.