Ratan Tata:ముగిసిన రతన్ టాటా శకం..ఆయన సాధించిన విజయాలు ఇవే.. టాటా సాల్ట్ నుంచి సాఫ్ట్ వేర్ వరకూ చెరగని ముద్ర
రతన్ టాటా మరణంతో భారత వ్యాపార ప్రపంచంలో ఒక శకం ముగిసింది. తన 86వ ఏట ముంబైలోని బీచ్ కాండి హాస్పిటల్లో కన్నుమూశారు. ఈ సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని విశేషాలను తెలుసుకుందాం.
రతన్ టాటా మరణంతో భారత వ్యాపార ప్రపంచంలో ఒక శకం ముగిసింది. అక్టోబర్ 9 బుధవారం రాత్రి 11 గంటలకు రతన్ టాటా ముంబయిలోని బీచ్ క్యాండీ హాస్పిటల్లో కన్నుమూశారు. ఆయన వయసు 86 ఏళ్ళు.
టాటా అంటే గుండు పిన్నీసు నుంచి విమానాల వరకు... ఉప్పు నుంచి సాఫ్ట్ వేర్ వరకూ విస్తరించిన ఒక మహా వ్యాపార సామ్రాజ్యం. 155 సంవత్సరాల చరిత్ర ఉన్న టాటా గ్రూప్ చైర్మన్లలో అత్యంత శక్తిమంతమైన ప్రభావవంతమైన చైర్మన్ గా రతన్ టాటా పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.
టాటా అంటే రతన్ టాటా అనే స్థాయికి గ్రూప్ కంపెనీలను తీసుకెళ్లారంటే.. ఆయన ప్రతిభ ఎలాంటిదో తెలుసుకోవచ్చు. రతన్ టాటా 1937 డిసెంబర్ 28వ తేదీ ముంబైలోని పార్సీ జొరాస్ట్రియన్ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి నావెల్ టాటా,తల్లి సూనీ టాటా.
రతన్ విద్యాభ్యాసం ముంబైలోని కాంపియన్ స్కూల్లో జరిగింది. ఆ తర్వాత ఉన్నత విద్య కోసం అమెరికాలోని కార్నల్ యూనివర్సిటీకి వెళ్లారు. అక్కడే ఆయన ఆర్కిటెక్చర్ డిగ్రీ పూర్తి చేశారు.
అయితే, టాటా గ్రూపులోకి రతన్ టాటా ఎంట్రీ రెడ్ కార్పెట్ వెల్కమ్ ఏమీ కాదు. రతన్.. టాటా కుటుంబానికి చెందినవారే అయినప్పటికీ, ఆ కుటుంబంలో అప్పటికే చాలామంది వారసులు ఉన్నారు. నావల్, సూనీ టాటాల దత్తపుత్రుడు అయిన రతన్... టాటా సంస్థలోకి ఒక సాధారణ ఉద్యోగిలాగే అడుగు పెట్టారు. టాటా ఇండస్ట్రీస్‌లో ఆయన 1962లో అసిస్టెంట్‌గా చేరారు.
ఇప్పుడు టాటా మోటార్స్ అని పిలుస్తున్న టాటా ఇంజనీరింగ్ లోకోమోటివ్ కంపెనీ, టెల్కో జంషెడ్‌పూర్ ప్లాంట్‌లో రతన్ ఆరు నెలల శిక్షణను పొందారు. ఆ తర్వాత 1963లో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ, టిస్కో జంషెడ్‌పూర్ ఫెసిలిటీలో అసిస్టెంట్ గా పనిచేశారు. ఈ సంస్థ పేరు ఆ తరువాత టాటా స్టీల్ గా మారింది.
రతన్ టాటా 1970లో టాటా కంప్యూటర్ సిస్టమ్స్‌గా ప్రారంభించిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ – టిసీఎస్ లోకి అడుగు పెట్టారు. ప్రపంచంలో కంప్యూటర్ సాఫ్ట్ వేర్ రంగం ఇంకా మొగ్గ దశలోనే ఉన్న సమయంలో రతన్ టాటా టీసీఎస్ లో పనిచేశారు.
1971లో టాటా గ్రూపులో కష్టాల్లో ఉన్న నేషనల్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్ (నెల్కో) డైరెక్టర్-ఇన్‌చార్జ్ గా బాధ్యతలు చేపట్టి దాన్ని గాడిలో పెట్టారు రతన్ టాటా. ఆ తరువాత 1974లో టాటా సన్స్ బోర్డులో డైరెక్టర్ అయ్యారు.
ఈ బాధ్యతలు నిర్వహిస్తూనే మధ్యలో 1975 సంవత్సరంలో హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో నుంచి అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేశారు. 1981లో టాటా ఇండస్ట్రీస్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. రెండు సంవత్సరాల తరువాత, టాటా వ్యూహాత్మక ప్రణాళికను రూపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
రతన్ 1986-1989 మధ్య కాలంలో ఎయిర్ ఇండియా ఛైర్మన్‌గా పనిచేశారు. ఆ తరువాత రెండేళ్ళకు ఆయన టాటా సన్స్, టాటా ట్రస్ట్‌ల ఛైర్మన్‌గా JRD టాటా నుంచి పగ్గాల చేపట్టారు.
రతన్ టాటా ఘన విజయాలు
2000 సంవత్సరంలో బ్రిటీష్ టీ బ్రాండ్ టెట్లీని కొనుగోలు చేసి టాటా బేవరేజేస్ కంపెనీని గ్లోబల్ బ్రాండ్ గా చేశారు.
2004లో TCS ఐపీవో ద్వారా చరిత్ర సృష్టించారు.
2005లో బ్రిటిష్ కంపెనీ బ్రన్నర్ మోండ్‌ను టాటా కెమికల్స్ కొనుగోలు చేసింది.
2007లో యూరోపియన్ స్టీల్ దిగ్గజం కోరస్‌ను టాటా గ్రూప్ కొనుగోలు చేసింది.
ఇక, 2008లో వరల్డ్ ఫేమస్ ఆటో బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను కూడా టాటా గ్రూప్ సొంతం చేసుకుంది.
2008లో భారతదేశంలో అత్యంత సరసమైన కారు టాటా నానోను విడుదల. అదే ఏడాది భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ రతన్‌ను వరించింది.
టాటా గ్రూప్‌తో ఐదు దశాబ్దాల అనుబంధం తర్వాత టాటా సన్స్ ఛైర్మన్ పదవి నుంచి 2012లో రతన వైదొలిగారు. సైరస్ మిస్త్రీకి బాధ్యతలు అందించారు. టాటా సన్స్ ఎమెరిటస్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు.
2016లో సైరస్ మిస్త్రీని చైర్మన్ పదవి నుంచి తొలగించారు. 2016 అక్టోబర్ నుంచి 2017 ఫిబ్రవరి వరకు టాటా గ్రూప్ తాత్కాలిక చైర్మన్‌గా పని చేశారు రతన్ టాటా.
రతన్ టాటా నాయకత్వంలో టాటా గ్రూప్ 1991లో 33,600 కోట్ల రూపాయల సంస్థ నుంచి 2012 నాటికి 8,40,000 కోట్ల రూపాయల భారీ వ్యాపార సమూహంగా అభివృద్ధి చెందింది.
టాటా కంపెనీ లాభాల్లో 60 శాతం సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించే ట్రస్టులకే వెళుతుంది. రతన్ టాటా హయాంలో టాటా గ్రూప్‌నకు ఒక ధార్మిక సంస్థ ఇమేజి వచ్చింది. దేశ సరిహద్దుల్లో జవాన్ నుంచి పొలాల్లో రైతుల వరకు టాటా తన వ్యాపారం ద్వారా సేవలను అందించింది. ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి సొంత కారులో కుటుంబంతో సహా వెళ్లాలని కలలుకని ఎంతో ఇష్టంగా డిజైన్ చేసి విడుదల చేసిన టాటా నానో కారు. రతన్ టాటా అభిరుచికి నిదర్శనం.
దేశంలోని సామాన్య ప్రజలకు తన ఉత్పత్తుల ద్వారా, సేవా కార్యక్రమాల టాటా గ్రూప్ చేరువైంది. ఒక వైపు తయారీ రంగంలో టాటాను ఉన్నత శిఖరాలకు నడిపిస్తూనే, భారత ఐటీ విప్లవంలో టాటా గ్రూప్ అమోఘమైన పాత్ర పోషించింది. రతన్ హయాంలో టీసీఎస్ ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఐటీ ఉత్పత్తుల సంస్థగా ఎదిగింది.
సుమారు పది లక్షల మంది ఉద్యోగులు టాటా గ్రూపు సంస్థల ద్వారా నేడు ఉపాధిని పొందుతున్నారు. పరోక్షంగా ఇంతకు పదిరెట్ల మంది టాటా గ్రూపు సంస్థల ద్వారా ఉపాధి పొందుతున్నారు. టాటా సంస్థను లాభాలు ఆర్జించే వ్యాపార సంస్థగానే కాకుండా దేశ భవిష్యత్తులో, వికాసంలో నిర్ణాయక పాత్ర పోషించే విలువలతో కూడిన సంస్థగా విస్తరించారు రతన్ టాటా. ఆ విధంగా టాటా గ్రూప్ భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలిచే అద్భుతమైన ఫిలాసఫీని నిర్మించారు రతన్ టాటా. అందుకే, ఆయన కేవలం బిజినెస్ మ్యాన్ కాదు. బిజినెస్ హ్యూమన్.