TOP 6 NEWS @ 6PM: జైనాబ్ రౌజీతో అఖిల్ ఎంగేజ్మెంట్: మరో 5 ముఖ్యాంశాలు

Update: 2024-11-26 12:44 GMT

జైనాబ్ రౌజీతో అఖిల్ ఎంగేజ్ మెంట్: మరో 5 ముఖ్యాంశాలు

1.జైనాబ్ రౌజీతో అఖిల్ నిశ్చితార్ధం

జైనాబ్ రౌజీతో హీరో అఖిల్ ఎంగేజ్ మెంట్ జరిగిందని హీరో అక్కినేని నాగార్జున ప్రకటించారు. ఎక్స్ లో ఈ మేరకు ఆయన ఓ పోస్టు పెట్టారు. ఈ పోస్టులో అఖిల్, రౌజీతో ఉన్న ఫోటోను ఆయన షేర్ చేశారు.తమ ఇంటి కోడలు కాబోతున్న రౌజీకి శుభాకాంక్షలు తెలపాలని ఆయన కోరారు. డిసెంబర్ 4న నాగచైతన్య, శోభిత ల పెళ్లి జరగనుంది. ఈ లోపుగానే అఖిల్ ఎంగేజ్ మెంట్ జరిగింది.

2.ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజ్యసభ స్థానాలకు డిసెంబర్ 20న పోలింగ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు రాజ్యసభ స్థానాలకు డిసెంబర్ 20న ఉప ఎన్నిక జరగనుంది. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్. కృష్ణయ్యలు రాజీనామా చేయడంతో ఈ మూడు స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 3న రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. డిసెంబర్ 10 వరకు నామినేషన్ల దాఖలుకు చివరి తేది. డిసెంబర్ 11న నామినేషన్లను పరిశీలిస్తారు. డిసెంబర్ 13న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది. డిసెంబర్ 20న పోలింగ్ నిర్వహిస్తారు. ఈ మూడు స్థానాలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికే దక్కనున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 175 స్థానాలున్నాయి. ఇందులో 164 మంది కూటమి సభ్యుల బలం. ఒక్క రాజ్యసభ అభ్యర్ధి గెలవాలంటే కనీసం 25 మంది సభ్యుల మద్దతు అవసరం. వైఎస్ఆర్ సీపీకి అసెంబ్లీలో బలం 11 మంది మాత్రమే. దీంతో ఈ మూడు స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందా... మిత్రులకు ఏమైనా స్థానాలు కేటాయిస్తుందా... అనేది త్వరలోనే స్పష్టత రానుంది.

3. రాహుల్ గాంధీకి బ్రిటన్ పౌరసత్వంపై పరిశీలన

లోక్ సభలో ప్రతిపక్ష నాయకులు, రాహుల్ గాంధీ పౌరసత్వం అంశాన్ని పరిశీలిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం అలహాబాద్ హైకోర్టుకు తెలిపింది. రాహుల్ గాంధీ బ్రిటన్ పౌరుడని...ఆయనకున్న భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ నాయకులు విఘ్నేష్ శిశిర్ దాఖలు అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై కేంద్రం అభిప్రాయం చెప్పాలని కోర్టు కోరింది. ఈ పిటిషన్ పై డిసెంబర్ 19న విచారణ జరగనుంది. ఇదే విషయమై గతంలోనూ బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి కూడా ఆరోపణలు చేశారు. అంతేకాదు కేంద్ర హోంమంత్రిత్వశాఖకు కూడా ఫిర్యాదు చేశారు.

4.తీవ్ర వాయుగుండం... ఏపీకి భారీ వర్ష సూచన

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. ట్రింకోమలికి ఆగ్నేయంగా 310 కి.మీ. దూరంలో, చెన్నైకు 800 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ నవంబర్ 27 నాటికి తుఫానుగా మారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రెండు రోజుల్లో ఇది తమిళనాడు వైపు ప్రయాణించే అవకాశం ఉంది. తుఫాన్ ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది. రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.

5. చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్

ఇస్కాన్ కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ ప్రభును బంగ్లాదేశ్ లోని ఢాకా ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని ఇస్కాన్ కోరింది.గత నెలలో బంగ్లాదేశ్ లో జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. బంగ్లాదేశ్ జెండాపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణదాస్ తో పాటు మరో 17 మందిపై బంగ్లా ప్రభుత్వం కేసు నమోదు చేసింది. బంగ్లాలో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ నవంబర్ 22న రంగాపూర్ లో జరిగిన ర్యాలీలో కూడా ఆయన పాల్గొన్నారు. బంగ్లాలో హిందువులు, మైనార్టీలకు భద్రత కల్పించాలని ఆ దేశాన్ని కోరినట్టు విదేశాంగ ప్రతినిధి రణ్ ధీర్ జైస్వాల్ చెప్పారు.

6. గెలిస్తే ఈవీఎంలు మంచివేనా?: సుప్రీంకోర్టు

మీరు గెలిస్తే ఈవీఎంలు మంచివి.. ఓడిపోతే ఈవీఎంలు మంచివి కావా.. అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ విధానాన్ని అమలు చేయాలని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. విదేశాల్లో బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరుగుతున్న విషయాన్ని పిటిషనర్ ప్రస్తావించారు. ఇదే పద్దతిని అమలు చేయాలని కోరారు. ఈ పిటిషన్ పై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.

Tags:    

Similar News