Eknath Shinde's future plans: మహారాష్ట్ర సీఎం ఎవరనేదానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి పీఠం కోసం దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండే ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో సీఎం పదవిపై ఇంకా డైలమా కొనసాగుతోంది. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. కూటమిలోని బీజేపీ 132, షిండే శివసేన 57, అజిత్ పవార్ ఎన్సీపీ 41 సీట్లు సాధించింది. మొత్తంగా మహారాష్ట్రలో మహాయుతి కూటమి 235 సీట్లు కైవసం చేసుకుంది. మంగళవారం సీఎం పదవికి షిండే రాజీనామా చేశారు. ఇక డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌తో కలిసి రాజ్ భవన్ లో గవర్నర్‌కు రిజైన్ లెటర్ అందజేశారు. సీఎం పదవికి షిండే రాజీనామా చేసినప్పటికీ తదుపరి సీఎం ఎవరనేది ఇంకా తేలకపోవడంతో సీఎం పదవిపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.
సీఎం పీఠం కోసం అటు బీజేపీ, ఇటు శివసేన పట్టుపడుతున్నాయి. ఈసారి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఇవ్వాలని బీజేపీ నేతలు అంటుంటే.. లేదు లేదు ఏక్‌నాథ్ షిండేకే ఇవ్వాలని శివసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. సీఎం పదవి విషయంలో బీహార్ మోడల్‌ను అనుసరించాలని శివసేన నేతలు కోరుతున్నారు. అక్కడ బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ కూటమిలో భాగంగా నితీష్ కుమార్‌ను ముఖ్యమంత్రిని చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
మరోవైపు మహారాష్ట్రలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే 2019 సీన్ రిపీట్ అవుతుందా అన్న ప్రశ్న తలెత్తుతుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేయగా.. బీజేపీ 105, శివసేన 56 సీట్లు గెలుచుకుంది. అయితే సీఎం పదవి విషయంలో భేదాభిప్రాయాలు రావడంతో శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే కూటమి నుంచి బయటకొచ్చి తమకు విరుద్ధమైన ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ శివసేన లీడర్ ఏక్‌నాథ్ షిండే రెబల్‌గా మారి పార్టీని చీల్చడంతో ప్రభుత్వం పడిపోయింది.
ఏక్‌నాథ్ షిండే ఆ తరువాత బీజేపీతో కలిసి మహారాష్ట్రలో సర్కార్ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఎన్సీపీలోని అజిత్ పవార్ కూడా ఒక వర్గాన్ని వెంటపెట్టుకుని వచ్చి బీజేపి, షిండేల శివసేనకు మద్దతు ఇచ్చారు. ఇప్పుడు ఏక్‌నాథ్ షిండేకు కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. సీఎం పదవి విషయంలో బీజేపీ, శివసేన మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. కానీ ఉద్దవ్ లాగా షిండే బయటకు వచ్చినా బీజేపీకి నష్టమేమీ లేదు. బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు ఎన్సీపీ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ముగ్గురి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే ముగ్గురికి సీఎం పదవి వరించేలా డీల్ ఓకే చేస్తున్నట్టు సమాచారం. ముందుగా రెండు సంవత్సరాలు సీఎంగా ఫడ్నవీస్, మరో రెండు సంవత్సరాలు షిండే.. ఇక చివరి ఏడాది అజిత్ పవార్‌ను సీఎంగా చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ షిండే ఈ డీల్‌కు ఒప్పుకోకుంటే బీజేపీ.. అజిత్ పవార్‌తో కలిసి ఫడ్నవీస్‌ను సీఎం చేసే అవకాశం ఉంది. లేదంటే చెరో రెండున్నరేళ్లు ఫడ్నవీస్, అజిత్ పవార్ సీఎం అయ్యే ఛాన్స్ ఉంది.
ఇక సీఎం పదవి దక్కకపోతే షిండే ప్లాన్ బి ని అమలు చేయనున్నట్టు సమాచారం. అదే విషయాన్ని కూటమి నేతల వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తోంది. దేవేంద్ర ఫడ్నవీస్, షిండే నేతల మధ్య మంగళవారం రాత్రి సమావేశం జరిగింది. తనను ముఖ్యమంత్రిని చేయకపోతే హోంశాఖ ఇవ్వాలని పట్టుబట్టినట్టు సంబంధిత వర్గాల సమాచారం.