Ayodhya: అయోధ్య రాముడికి ‘సూర్యతిలకం’.. కనులవిందుగా అద్భుత దృశ్యం
Ayodhya: ఆలయ మూడో అంతస్తు నుంచి కిరణాలు
Ayodhya: దేశ వ్యాప్తంగా జై శ్రీరామ్ నినాదం మార్మోగింది. శ్రీరామ నవమి సందర్భంగా శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ‌్య వీధుల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. 500 ఏళ్ల నాటి వివాదం ముగిసిపోయి.. ఇటీవలె అయోధ్యలో దివ్య రామ మందిరం ప్రారంభమైంది. జనవరి 22వ తేదీన ప్రధాని మోదీ చేతుల మీదుగా విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన అయోధ్య రామాలయానికి ఇదే తొలి శ్రీరామనవమి. ఈ ఉత్సవాల కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసింది.
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా నేడు అయోధ‌్యలో కీలక ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. అయోధ్య రాముడి నుదుటన సూర్య కిరణాలు ప్రసరించాయి. ఆలయ మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోకి అద్దాలు, కటకాలతో కూడిన సాంకేతిక యంత్రాంగం సాయంతో ఈ ‘సూర్య’తిలకం ప్రదర్శన ఏర్పాటు చేశారు రామతీర్థ్ క్షేత్ర ట్రస్ట్ నిర్వహకులు. ఏటా శ్రీరామనవమి రోజున రాముడి విగ్రహం నుదుటన కిరణాలతో తిలకం ఏర్పాటుచేయడమే సూర్య తిలక్ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. చైత్రమాసంలో వచ్చే ఈ పండుగ వేళ మధ్యాహ్నం 12 గంటలకు ఆ దృశ్యం కనువిందు చేసింది. మూడు నుంచి మూడున్నర నిమిషాలపాటు ఉన్న ఈ సూర్యకిరణాల తిలకం 58 మిల్లీ మీటర్ల పరిమాణంలో రెండు నిమిషాలు పూర్తిస్థాయిలో తిలకంలా కనిపించింది.
శ్రీరామనవమి సందర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయంలో కన్యా పూజన్ కార్యక్రమాన్నినిర్వహించారు. ఆలయంలో చిన్నారుల పాదాలను కడిగి.. వారికి పుష్పార్చన చేసి.. వారిని ఆశీర్వదించారు. చిన్నారుల్లోనూ బాలరాముడు ఉంటాడన్న నేపథ్యంలో యూపీ సీఎం చిన్నారులను పూజించారు.