Supreme Court: ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు
Supreme Court: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు సుప్రీంకోర్టు సమర్ధిస్తూ గురువారం తీర్పు వెల్లడించింది.
Supreme Court: దశాబ్దాల పోరాటానికి ఫలితం దక్కింది. ఎట్టకేలకు ఎస్సీ వర్గాల డిమాండ్ ఆచరణ రూపంలోకి వచ్చేందుకు ఇక అడుగులు పడనున్నాయి. ఎస్సీ, ఎస్టీల్లో ఉప వర్గీకరణ సాధ్యమేనా అన్న అంశంపై విచారణ జరిపిన ధర్మాసనం.. కీలక తీర్పు వెలువరించింది. వర్గీకరణ సమర్థనీయం అని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా వర్గీకరణపై అధికారం కల్పిస్తూ ఆదేశాలిచ్చింది.
ఎస్సీ వర్గీకరణపై మూడు దశాబ్దాలుగా పోరాటం కొనసాగుతోంది. 2000 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీల్లో ఉప వర్గీకరణ కోసం బిల్లు ప్రవేశపెట్టారు ఆనాటి సీఎం చంద్రబాబు. ఈ విషయంపై సుప్రీంకోర్టులో 2004లో వర్గీకరణపై రాష్ట్రాలకు అధికారం లేదంటూ అప్పటి జస్టిస్ చిన్నయ్య తీర్పు వెలువరించారు. ఆ తర్వాత 2010లో పంజాబ్ ప్రభుత్వం వాల్మీకీలు, మఝాబీ సిక్కులకు 50 శాతం రిజర్వేషన్ కల్పించింది. అయితే దీనిని కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో.. పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది.
సుప్రీంకోర్టులో పంజాబ్ వేసిన పిటిషన్‌ను విచారించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. జస్టిస్ చిన్నయ్య ధర్మాసనం తీర్పును తప్పుబట్టింది. ఆ తీర్పును పున:సమీక్షించాలని ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేసింది. దీంతో పాటు దాఖలైన 23 పిటిషన్లను విచారించిన జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం.. ఇవాళ కీలక తీర్పు వెలువరించింది. ఏడుగురు సభ్యులు ఉన్న ధర్మాసనంలో ఆరుగురు వర్గీకరణను సమర్థించగా.. జస్టిస్ బేలా త్రివేది వ్యతిరేకించారు.