Smriti Irani: అమేథిలో కాంగ్రెస్ పార్టీ ఓటమిని అంగీకరించింది
Smriti Irani: ప్రధాని మోడీ నేతృత్వంలో అమేథీని ఎంతో అభివృద్ధి చేశామని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు.
Smriti Irani: ప్రధాని మోడీ నేతృత్వంలో అమేథీని ఎంతో అభివృద్ధి చేశామని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. చరిత్ర కలిగిన గాంధీ కుటుంబం అమేథీ పోటీ నుంచి తప్పుకోవడం అంటేనే మోడీ పనితనం ఏమిటో అర్థం చేసుకోవాలని సూచించారు. అమేథిలో గాంధీలు ఎవరూ ఎన్నికల బరిలో నిలవకపోవడం పోలింగ్‌కు ముందే ఇక్కడ ఓటమిని కాంగ్రెస్ అంగీకరించిందని ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమేథీలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో ప్రజలు గుర్తించారని చెప్పారు. ఏళ్లకు ఏళ్లు అమేథీని పాలించిన గాంధీ కుటుంబం అమేథీలోని సామాన్య ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
‘గాంధీ కుటుంబీకులు అమేథిలో పోటీ చేయకపోవడాన్ని బట్టి చూస్తుంటే పోలింగ్‌కు ముందే వారు ఓటమిని అంగీకరించారు. ఈ సీటుపై విజయం సాధించే అవకాశం ఉందని వారు భావించినట్లయితే వారే పోటీకి దిగేవారు. మరో అభ్యర్థిని నిలబెట్టేవాళ్లే కాదు. రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి వెళ్లిపోవడమంటే అది అమేథి ప్రజల విజయమే’ అని స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు. మే 20న జరిగే ఎన్నికల్లో అమేథి నుంచి మళ్లీ తానే గెలుస్తానని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ధీమా వ్యక్తం చేశారు.