Rahul Gandhi: రాహుల్ గాంధీ నాలుక కోసిన వాళ్లకు రూ. 11 లక్షలు నగదు బహుమానం ప్రకటన

Update: 2024-09-16 12:00 GMT

Shiv Sena MLA Sanjay Gaikwad: మహారాష్ట్రకి చెందిన శివ సేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా రాహుల్ గాంధీ నాలుక కోస్తే, వారికి తాను రూ. 11 లక్షలు ఇస్తానంటూ నగదు బహుమతి ప్రకటించారు. రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండిస్తూ సంజయ్ గైక్వాడ్ ఈ ప్రకటన చేశారు.

తాజాగా రాహుల్ గాంధీ గురించి సంజయ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. "ఒకవైపు దేశంలో రిజర్వేషన్ల పెంపుపై ఎప్పటికప్పుడు కొత్తకొత్త డిమాండ్స్ తెరపైకి వస్తున్నాయి. మరోవైపు రాహుల్ గాంధీ మాట్లాడుతూ అసలు రిజర్వేషన్లనే ఎత్తేయాలని అంటున్నారు. రాహుల్ గాంధీ మాటలతోనే కాంగ్రెస్ పార్టీ అసలు రంగు ఏంటో అర్థమవుతోంది. అందుకే రిజర్వేషన్ గురించి అలా మాట్లాడిన రాహుల్ గాంధీ నాలుక కోసిన వాళ్లకు తానే రూ. 11 లక్షలు అందిస్తాను" అని ప్రకటించారు.

విదర్భ ప్రాంతంలోని బుల్దానా అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహిస్తోన్న సంజయ్ గైక్వాడ్ వివాదాలకు కొత్తేం కాదు. గతంలోనూ సంజయ్ వ్యవహారశైలిపై పలు వివాదాలున్నాయి. గత నెలలోనూ సంజయ్ గైక్వాడ్‌కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక పోలీసు సంజయ్ కారు తుడుస్తున్నట్లుగా ఉన్న ఆ వీడియోపై ఎమ్మెల్యే స్పందిస్తూ.. అతడు తన కారులో వామిథింగ్ చేసుకున్నాడని.. అందుకే అతడే స్వచ్ఛందంగా ఆ కారుని తుడిచి శుభ్రం చేశాడని వివరణ ఇచ్చుకున్నారు.

గతంలో అతడు చేసిన మరో వివాదాస్పద వ్యాఖ్యలు అప్పట్లో పెను సంచలనం సృష్టించాయి. ఒకానొక సందర్భంలో సంజయ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. 1987 లో తాను పులిని వేటాడి, దాని దంతాన్ని మెడలో హారంగా ధరించానని అన్నారు. ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి, వణ్యప్రాణి సంరక్షణకు వ్యతిరేకంగా ఇలా మాట్లాడటం ఏంటని అప్పట్లో ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. అటవీ శాఖ అధికారులు అతడిపై వణ్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి ఆ పులి దంతాన్ని స్వాధీనం చేసుకుని పరిశీలన కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించారు.

Tags:    

Similar News